Ravanasura: ‘రావణాసుర’తో రవితేజ వాటిని బ్రేక్‌ చేశారు: నిర్మాత అభిషేక్‌

‘‘ఇతర భాషల్లో తెరకెక్కిన కొన్ని సినిమాలు చూసి చాలా బాగుంది అనుకుంటాం. అలాంటి చిత్రాలను ఇక్కడ చేయాలనుకున్నప్పుడు సందేహాలు తలెత్తుతాయి. ‘రావణాసుర’ (Ravanasura)తో రవితేజ (Ravi Teja) వాటిని బ్రేక్‌ చేశారు’’ అని నిర్మాత అభిషేక్‌ నామా తెలిపారు.

Published : 05 Apr 2023 22:23 IST

హైదరాబాద్‌: రవితేజ (Ravi Teja) హీరోగా అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా (Abhishek Nama) నిర్మించిన సినిమా ‘రావణాసుర’ (Ravanasura). సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. సుశాంత్‌, మేఘా ఆకాశ్‌, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, దక్ష నగర్కర్‌, అను ఇమ్మాన్యుయేల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 7న సినిమాను విడుదల చేస్తున్న సందర్భంగా అభిషేక్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘రావణాసుర’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు.

* శ్రీకాంత్ విస్సా ఈ కథ చెబుతున్నపుడు మీకేమనిపించింది?

అభిషేక్‌: స్టోరీ వింటునప్పుడే ఇదొక కొత్త కాన్సెప్ట్‌ అని అర్థమైంది. ఇప్పటివరకూ రవితేజ ఇలాంటి నేపథ్యంలో నటించలేదు. ‘రవితేజ ఇలాంటి రోల్స్‌లో కూడా ఇంత అద్భుతంగా చేయగలరా?’ అని సినిమా చూశాక ప్రేక్షకులు తప్పక అనుకుంటారు. అంతగా సర్‌ప్రైజ్‌ ఉంటుందీ సినిమాలో. ఇలాంటి ఫార్ములా విజయవంతమైతే మరిన్ని చిత్రాలు వచ్చే అవకాశం ఉంది.

* శ్రీకాంత్‌ని దర్శకుడుగా పరిచయం చేసే అవకాశం ఉందా?

అభిషేక్‌: దర్శకుడిగా నా బ్యానర్‌లోనే తన మొదటి సినిమా చేయాలని ఇప్పటికే శ్రీకాంత్‌కు చెప్పా. దానికి అతడు ఓకే అన్నాడు.

* ‘రావణాసుర’ విషయంలో టీమ్‌ అంతా మీకే క్రెడిట్‌ ఇస్తున్నారు..!

అభిషేక్‌: అదేం లేదండీ. క్రెడిట్‌ రవితేజదే. ఈ కథ ఆయనకు బాగా నచ్చడంతో నన్ను పిలిచి మరీ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చారు. ఆయన కూడా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు.

* ఈ కథ గురించి నటులు, దర్శకులు ఇప్పటివరకు హింట్ ఇవ్వలేదు. ఎందుకు?

అభిషేక్‌: థ్రిల్లర్లకు సంబంధించి ఎలాంటి హింట్‌ బయటకు వచ్చినా సినిమా చూస్తున్నప్పుడు మజా ఉండదు. షాకింగ్‌ ఎలిమెంట్స్‌, సర్‌ప్రైజ్‌లు ముందే తెలిస్తే బాగుండదనే ఉద్దేశంతోనే ‘రావణాసుర’ గురించి ఎక్కువగా రివీల్‌ చేయట్లేదు.

* నిర్మాతలు ఒకప్పుడు చిన్న సినిమాలు సొంతగా రిలీజ్ చేసుకునేవారు. ఇప్పుడు పెద్ద సినిమాలకూ అదే పరిస్థితి నెలకొంది. కారణమేంటి?

అభిషేక్‌: అది అందరి విషయంలో ఒకేలా ఉండదు. నిర్మాతను బట్టి మారుతూ ఉంటుంది. నా విషయానికొస్తే.. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా సొంతగా విడుదల చేయాలని ముందు నుంచీ అనుకున్నా. లాభమైనా.. నష్టమైనా మేమే రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది.

* రవితేజ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమాకావడంతో ‘రావణాసుర’పై అంచనాలు భారీగా ఉన్నాయి కదా?

అభిషేక్‌:  వసూళ్లను పక్కన పెడితే.. ఆర్టిస్ట్‌ సరికొత్తగా చేసిన పాత్రని ప్రేక్షకులు ఆదరిస్తే దానికి మించిన విజయం ఉండదనేది నా అభిప్రాయం. ‘కాంతార’లాంటి చిత్రాలను చూసినప్పుడు మనం వావ్‌ అంటుంటాం. అలాంటి సినిమాని ఇక్కడ తెరకెక్కించాలంటే మాత్రం వర్కౌట్‌ అవుతుందా, లేదా? అని సందేహిస్తాం. ‘రావణాసుర’తో రవితేజ ఆ అనుమానాలన్నింటినీ బ్రేక్‌ చేశారు. 

* సుశాంత్ పాత్ర గురించి ఏం చెబుతారు?

అభిషేక్‌: మునుపెన్నడూ చూడని సుశాంత్‌ని ఈ సినిమాలో చూస్తారు.

* మీ బ్యానర్‌లో రూపొందే సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతాయి. ‘రావణాసుర’ని వేరే భాషల్లో ఎందుకు రిలీజ్‌ చేయట్లేదు?

అభిషేక్‌: ప్రత్యేక కారణమంటూ ఏం లేదు. తెలుగులో విడుదలైన తర్వాత చేద్దామనుకుంటున్నాం. గతంలో మా కాంబినేషన్‌ (సుధీర్‌వర్మతో కలిసి)లో వచ్చిన ‘కేశవ’ సినిమా కమర్షియల్‌గా వర్కౌట్‌ అయింది. అయితే, బ్లాక్‌బస్టర్‌ మిస్‌ అయింది. ‘రావణాసుర’తో ఆ లోటు తీరుతుందని నమ్ముతున్నా.

* దీనికి సీక్వెల్ ఉంటుందా?

అభిషేక్‌: అది ప్రేక్షకుల ఆదరణపై ఆధారపడిన విషయం. వారి స్పందన బాగుంటే తప్పకుండా సీక్వెల్‌ చేస్తాం. ‘రావణాసుర’ కథకి ఆ స్కోప్‌ ఉంది.

* తదుపరి చిత్రాలేంటి?

అభిషేక్‌: కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘డెవిల్‌’ క్లైమాక్స్‌ చిత్రీకరణలో ఉంది. రెండు/మూడు నెలల్లో ఆ సినిమాని విడుదల చేస్తాం. దానికి సీక్వెల్‌ కూడా రానుంది. మరోవైపు, ‘ప్రేమ విమానం’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. 2024లో ఏడు సినిమాలు విడుదల చేయబోతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని