Project K: ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌-కె’లో కీలక మార్పు.. ఇప్పటివరకూ ఎంత షూట్‌ అయిందంటే!

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌-కె’ టీమ్‌లో కీలక మార్పు జరిగింది.

Updated : 25 Feb 2023 18:55 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘ప్రాజెక్ట్‌-కె’ (వర్కింగ్‌ టైటిల్‌). దీపిక పదుకొణె (Deepika Padukone) కథానాయిక. అమితాబ్‌ (Amitabh Bachchan) కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఓ కీలక మార్పు చేసింది. తొలుత ‘ప్రాజెక్ట్‌-కె’ ప్రకటించినప్పుడు సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్‌ను అనుకున్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో సంతోష్‌ నారాయణన్‌ వచ్చి చేరారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అశ్వనీదత్‌ (Ashwini Dutt) తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలనూ వెల్లడించారు.

‘ప్రాజెక్ట్‌-కె’ సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌ మూవీ అయినా ఎమోషన్స్‌, సెంటిమెంట్‌ కూడా ఉంటాయని అన్నారు. ఇప్పటివరకూ ఈ సినిమా చిత్రీకరణ 70శాతం పూర్తయినట్లు తెలిపారు. ప్రభాస్‌తో పాటు, దీపిక, అమితాబ్‌లకు కూడా స్క్రీన్‌ ప్రెజెన్స్‌ఎక్కువగా ఉంటుందన్నారు. చాలా సన్నివేశాల్లో ఈ ముగ్గురూ కనిపిస్తారని అన్నారు. ప్రేక్షకులు ఇప్పటివరకూ చెందని సరికొత్త అనుభూతిని ‘ప్రాజెక్ట్‌-కె’ ఇస్తుందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ ఐదారు కంపెనీలు చేస్తున్నాయని, వాటిని తెరపై చూసినప్పుడు ‘న భూతో నభవిష్యతి’ అన్నట్లు ఉంటుందని తెలిపారు. వరుసగా తమిళ చిత్రాలు చేస్తున్న సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ (Santhosh Narayanan) ‘ప్రాజెక్ట్‌-కె’లోకి రావడంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. సంతోష్‌ నారాయణన్‌ పనిచేసిన చిత్రాల్లో నేపథ్య సంగీతం ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఆయన తెలుగులో నాని ‘దసరా’, వెంకటేశ్‌ ‘సైంధవ్‌’ చిత్రాలకు పనిచేస్తున్నారు.

ఇక శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ‘ప్రాజెక్ట్‌-కె’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న (project k release date) విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ఇటీవల తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని కథతో.. అత్యాధునిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని