Aswani Dutt: ప్రభాస్‌ పాత్రపై ఫ్యాన్స్‌ అసంతృప్తి: అశ్వనీదత్‌ సమాధానమేంటంటే?

‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Updated : 04 Jul 2024 23:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా అశ్వనీదత్‌ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయోత్సాహంలో ఉన్న అశ్వనీదత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘ప్రభాస్‌ పాత్ర కంటే అమితాబ్‌ బచ్చన్‌ పాత్రే హైలైట్‌ అయిందంటూ కొందరు ఫ్యాన్స్‌ నెట్టింట అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు’ అని హోస్ట్‌ ప్రస్తావించగా నిర్మాత స్పందించారు. అవన్నీ వినొద్దని పేర్కొన్నారు. పార్ట్‌ 2 చూస్తే అసలు సంగతి తెలుస్తుందన్నారు.

ఎన్నో ఫ్లాప్‌లను తట్టుకుని ముందడుగేసి విజయం అందుకోవడం ఆనందంగా ఉందని అశ్వనీదత్‌ అన్నారు. పరాజయం ఎదురైనప్పుడు బాధపడకుండా తర్వాత ఏం చేయాలనే దాని గురించే తాను ఆలోచిస్తానని చెప్పారు. ‘కల్కి’ పార్ట్‌ 2 పూర్తయిన తర్వాత ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ పార్ట్‌ 2పై దృష్టి పెడతానని తెలిపారు.

కమల్‌ హాసన్‌ ఆ చిత్రానికే అనుకున్నాం కానీ..

‘‘కల్కి’ పాత సినిమాలానే ఉంటుంది. కానీ, టేకింగ్‌ ఇతరత్రా అంశాల్లో చాలా కొత్తదనంతో నిండి ఉంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని రూపొందించాం. నిర్మాణ వ్యయం రూ. 700 కోట్లు. ‘కల్కి’ విజయం ముందు ‘మహానటి’ విజయం కనిపించడం లేదు (నవ్వుతూ). ఈ చిత్రం విషయంలో నేనేమీ పట్టించుకోలేదు. నాగ్‌ అశ్విన్‌, స్వప్ననే అంతా చూసుకున్నారు. కమల్‌ హాసన్‌ ఇందులో నటించడం సంతోషం. అప్పట్లో ‘ఓ సీత కథ’ (1974) చిత్రంలోనే ఆయన్ను ఓ పాత్ర కోసం అనుకున్నా అది సాధ్యపడలేదు’’

ప్రభాస్‌తో సినిమా నా కల

‘‘తన బాల్యం నుంచీ ప్రభాస్‌ నాకు తెలుసు. ‘వర్షం’ నుంచి తన ప్రతి సినిమానీ చూశా. కొన్నాళ్ల క్రితమే ఆయనతో ఓ చిత్రాన్ని నిర్మించాలనుకున్నా కానీ వేరే ప్రాజెక్టులతో కుదర్లేదు. ‘కల్కి’తో నా కోరిక నెరవేరింది. ఎప్పుడైనా నాగ్‌ అశ్విన్‌తో సినిమా చేసే అవకాశం వస్తే వదలొద్దని కృష్ణంరాజు ప్రభాస్‌కు చెప్పేవారట’’

అమితాబ్‌ మహానుభావుడు..

అమితాబ్‌ బచ్చన్‌ తన పాదాలను తాకబోయే ప్రయత్నంపై స్పందిస్తూ.. ‘‘ఆయన చేసిన పనికి నేను షాకయ్యా. నా పాదాలు తాకేందుకు ప్రయత్నిస్తుంటే ఆపేశా. అమితాబ్‌ మహానుభావుడు. ఈ సినిమాతోనే ఆయనతో పరిచయం ఏర్పడింది. నేను ఎంతగానో అభిమానించే ఆ నటుడు నా సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని