Aswani Dutt: అమితాబ్‌ చేసిన దానికి ఆశ్చర్యపోయా: అశ్వనీదత్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌పై టాలీవుడ్‌ నిర్మాత అశ్వనీదత్‌ ప్రశంసలు కురిపించారు.

Published : 21 Jun 2024 14:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)ను మించినవారు లేదంటూ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ (Aswani Dutt) ఆయనపై ప్రశంసలు కురిపించారు. ‘కల్కి’ ఈవెంట్‌లో ఆ అగ్ర నటుడు చేసిన పనికి తాను ఆశ్చర్యపోయానన్నారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Kalki 2898 AD Pre Release Event) ముంబయిలో ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేదికపై అమితాబ్‌ మాట్లాడుతూ.. ఇలాంటి వినయపూర్వకమైన వ్యక్తిని తన కెరీర్‌లో ఎన్నడూ చూడలేదంటూ అశ్వనీదత్‌ను కొనియాడారు. నిర్మాతగా 50 ఏళ్లుగా రాణిస్తున్నారంటూ బాలీవుడ్‌ మీడియాకు గొప్పగా చెప్పారు. అనంతరం అమితాబ్‌.. అశ్వనీదత్‌ పాదాలు తాకి ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన ప్రొడ్యూసర్‌ సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

‘కల్కి 2898 ఏడీ’ రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?బెనిఫిట్‌ షోలు ఉంటాయా?

‘‘కల్కి’ వేడుకలో ఎన్నడూ ఊహించనిది జరిగింది. అమితాబ్‌ చేసిన దానికి నేను ఆశ్చర్యపోయా. అయోమయానికి గురయ్యా. వెంటనే తేరుకొని ఆయన పాదాలను నేనూ తాకే ప్రయత్నం చేశా. జీవితంలో కొన్ని క్షణాలు ఎంతో అపురూపమైనవి. అలాంటి మధుర జ్ఞాపకాలను ఆ ఈవెంట్‌ అందించింది. అమితాబ్‌.. ఇండియన్‌ సినిమా యోధుడు, ఓ లెజెండ్‌. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఉన్న ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీని అశ్వనీదత్‌ నిర్మించారు. అమితాబ్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, రాజేంద్ర ప్రసాద్‌, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రచారంలో భాగంగా రెండో ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం రిలీజ్‌ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని