Updated : 18 Aug 2022 17:56 IST

OTT Movies: 8వారాల తర్వాతే ఓటీటీలో సినిమా: దిల్‌రాజు

హైదరాబాద్‌: ఓటీటీల్లో (OTT Movies) సినిమా విడుదల చేసే విషయమై నిర్మాతలందరూ ఒక నిర్ణయానికి వచ్చామని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) అన్నారు. గురువారం ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇక నుంచి విడుదలయ్యే ప్రతి సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలో రావాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటివరకూ అగ్రిమెంట్‌ పూర్తయిన వాటిని కూడా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న, చిత్రీకరణ జరుపుకొంటున్న సినిమాలన్నీ థియేటర్‌లో విడుదలైన 8 వారాల తర్వాతే, అంటే 50 నుంచి 60 రోజుల తర్వాతే ఓటీటీలో వస్తాయి. ఈ విషయంలో నిర్మాతలందరం ఏకాభిప్రాయానికి వచ్చాం. అలాగే థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్‌ ధరలు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరాం. అందుకు వారు అంగీకరించారు. వీపీఎఫ్‌ ఛార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం ఎగ్జిబిటర్స్‌తో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని దిల్‌రాజు తెలిపారు.

‘‘ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ఒక్కోదాన్ని పరిష్కరించుకుంటూ త్వరలోనే షూటింగ్స్‌ మొదలు పెడదామని భావిస్తున్నాం. అలాగే నిర్మాణ వ్యయం తగ్గించేందుకు ఎలా వ్యవహరించాలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) తో ఒక అగ్రిమెంట్‌ చేసుకున్నాం. ఇదొక మంచి విజయం. నిర్మాతలు అడిగిన పాయింట్లకు ‘మా’ సానుకూలంగా స్పందించింది. దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులతోనూ చర్చలు కొనసాగుతున్నాయి. వృథా ఖర్చును ఎలా తగ్గించుకోవాలో వాళ్లతో చర్చిస్తున్నాం.  మరో రెండు, మూడు రోజుల్లో అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఫెడరేషన్‌తో కూడా చర్చలు పూర్తయ్యాయి. ఒకట్రెండు  సమస్యలున్నాయి. వాళ్లు అడుగుతున్న వేతనాలకు నిర్మాతలు కూడా దగ్గరగా వచ్చేశారు. తుది సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఈలోగా షూటింగ్స్‌ మొదలవుతాయన్న వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ఎప్పుడు షూటింగ్స్‌ ప్రారంభమవుతాయో మళ్లీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెబుతాం. అన్నీ విషయాలను స్వయంగా మీడియాకు వెల్లడిస్తాం’’

బాలీవుడ్‌ గమనిస్తోంది!

‘‘ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ తీసుకున్న నిర్ణయాలపై అనేక చర్చలు జరిగాయి. హిందీ చిత్ర పరిశ్రమ కూడా మనల్ని గమనిస్తోంది. షూటింగ్స్‌ నిలిపి ఏం చేస్తున్నారా? అన్నది వాళ్లు పరిశీలిస్తున్నారు. నిర్మాతలందరూ కలిసి ఏయే నిర్ణయాలు తీసుకున్నారని రోజూ అక్కడి నుంచి ఫోన్‌ చేసి మమ్మల్ని అడుగుతున్నారు. దక్షిణాదిలోని మిగతా పరిశ్రమలన్నీ మనం తీసుకున్న నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నాయి’’ అని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని