‘వకీల్‌సాబ్‌’ తీయడానికి కారణం వారే:దిల్‌రాజు

‘‘పింక్‌’ రీమేక్‌ తెలుగులో చేయడానికి ఆ చిత్ర కథ రాసిన రచయితలు, తీసిన దర్శకులు, నిర్మాత బోనీ కపూర్‌, హరీశ్‌ శంకర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, వేణు శ్రీరామ్‌లే కారణం’ అని నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ‘వకీల్‌సాబ్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పవన్‌తో సినిమా చేయాలన్నది చాలా మంది నిర్మాతల కల. నా కల కూడా అదే..

Published : 05 Apr 2021 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘పింక్‌’ రీమేక్‌ తెలుగులో చేయడానికి ఆ చిత్ర కథ రాసిన రచయితలు, తీసిన దర్శకులు, నిర్మాత బోనీ కపూర్‌, హరీశ్‌ శంకర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, వేణు శ్రీరామ్‌లే కారణం’ అని నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ‘వకీల్‌సాబ్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పవన్‌తో సినిమా చేయాలన్నది చాలా మంది నిర్మాతల కల. నా కల కూడా అదే. దాన్ని సాకారం చేసుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది. ఒక రోజు అజిత్‌ చిత్రం(నేర్కొండ పార్వాయ్‌) ట్రైలర్‌ను బోనీకపూర్‌ నాకు పంపారు. చూడగానే అజిత్‌పాత్రలో నాకు పవన్‌కల్యాణ్‌ గుర్తొచ్చారు. ఇదే విషయాన్ని హరీశ్‌ శంకర్‌కు చెబితే, ఈసారి కల్యాణ్‌గారిని కలిసినప్పుడు సినిమా గురించి చెబుదామని అన్నారు. ఆ తర్వాత తమిళంలో అజిత్‌ సినిమా చూసినప్పుడు నాకు స్క్రీన్‌పై ప్రతి సన్నివేశంలోనూ పవన్‌కల్యాణ్‌ కనిపించారు. ఒకరోజు త్రివిక్రమ్‌గారికి ఈ విషయం చెబితే, ఆయన పవన్‌కల్యాణ్‌ కలిసే ఏర్పాటు చేశారు. కలిసి కథ చెప్పిన వెంటనే ఆయనకూ నచ్చింది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు దర్శకులను అనుకున్నాం. ఒకరోజు నాకు వేణు శ్రీరామ్‌ గుర్తొచ్చాడు. పిలిచి ‘పింక్‌’ రీమేక్ గురించి చెబితే ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు నుంచే తన వెర్షన్‌లో సన్నివేశాలను చెప్పడం ప్రారంభించాడు. నాకు బాగా నచ్చాయి. దీంతో దర్శకుడిగా వేణును ఫిక్స్‌ చేశాం. వీరి వల్లే మా 25ఏళ్ల కల నెరవేరింది’’ అని దిల్‌ రాజు అన్నారు.

‘పవన్‌కల్యాణ్‌గారితో కలిసి పనిచేసిన ప్రతి రోజూ నాకు దక్కిన గౌరవం’ అని దర్శకుడు వేణు శ్రీరామ్‌ అన్నారు. ప్రీరిలీజ్‌ వేడుకలో మాట్లాడుతూ.. ‘మొదటిసారి కల్యాణ్‌గారితో యాడ్‌కు పనిచేశా. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. జీవితంలో మహిళల ప్రాధాన్యత గురించి తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. నేను పవన్‌ అభిమానినని సగర్వంగా చెప్పుకుంటా’ అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు వేణు శ్రీరామ్‌ సమాధానాలు ఇచ్చారు. ఇందులో పవన్‌కల్యాణ్‌ మూడు విభిన్న లుక్స్‌లో కనిపిస్తారని చెప్పారు. శ్రుతిహాసన్‌ క్లాసికల్‌ డ్యాన్సర్‌ అన్న ప్రచారం నిజం కాదని, ఇక సెకండాఫ్‌లో వచ్చే ఓ సర్‌ప్రైజ్‌ను థియేటర్‌లో చూడాలని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని