Dil Raju: అలా రాసి మమ్మల్ని బలి పశువులను చేయొద్దు: దిల్‌ రాజు భావోద్వేగం

టాలీవుడ్‌ నిర్మాతల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉందని, కొందరు వ్యూస్‌ కోసం అవాస్తలు రాస్తుంటారని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఊహాగానాలు వ్యాప్తి చేసి, చిత్ర పరిశ్రమ వారిని బలి పశువులను చేయొద్దని కోరారు. ‘కార్తికేయ 2’ సక్సెస్‌ మీట్‌లో ఆయన ఎమోషనల్‌గా మాట్లాడారు.

Updated : 16 Aug 2022 17:02 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నిర్మాతల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉందని, కొందరు వ్యూస్‌ కోసం అవాస్తవాలు రాస్తుంటారని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) అన్నారు. ఊహాగానాలు వ్యాప్తి చేసి, చిత్ర పరిశ్రమ వారిని బలి పశువులను చేయొద్దని కోరారు. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సక్సెస్‌ మీట్‌లో ఆయన ఎమోషనల్‌గా మాట్లాడారు. సినిమాల విడుదల విషయంలో తనపై వచ్చిన వదంతులపై స్పందించారు.

ఈ సినిమాలు స్ఫూర్తి..

‘‘జూన్‌, జులైలో విడుదలైన సినిమాలను చూసి టాలీవుడ్‌ పరిస్థితిపై భయమేసింది. ఆగస్టులో విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’, ఇప్పుడు ‘కార్తికేయ 2’ ధైర్యాన్ని ఇచ్చాయి. ఇండస్ట్రీకి కొత్త ఊపిరిలూదిన కార్తికేయ 2 చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఎలాంటి కథల్ని ఎంపిక చేసుకోవాలి? అనే విషయంలో ఈ సినిమాలు మాకు ఓ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈ సినిమా విడుదల గురించి నేనూ నిఖిల్‌ చాలా రోజులు చర్చించాం. జులై 8న మా చిత్రం ‘థాంక్యూ’ని రిలీజ్‌ చేయాలనుకున్నా.. కుదర్లేదు. అప్పుడు కార్తికేయ 2 నిర్మాతల్లో ఒకరైన వివేక్‌కి ఫోన్‌ చేసి.. ‘మీ సినిమాని జులై 22న విడుదల చేయాలనుకుంటున్నారు కదా. మాకు అవకాశం ఇస్తారా?’ అని అడిగా. సినిమాల మధ్య క్లాష్‌ రాకుండా ఉండేందుకు మేం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో మాట్లాడుతుంటాం. కార్తికేయ 2 విషయంలోనూ అదే చేశాం.

వివేక్‌ చెప్పటంతో నిఖిల్‌, దర్శకుడు చందు నన్ను కలిసేందుకు మా ఇంటికి వచ్చారు. ‘మీరు ఫలానా తేదీ కావాలన్నారట కదా సర్‌. మేం మరో తేదీన మా సినిమాని విడుదల చేస్తాం’ అని చెప్పి వారి సినిమాను వాయిదా వేసుకున్నారు. అక్కడితో సమస్య తీరింది. వారికి నేను సపోర్ట్‌ ఇస్తానని చెప్పా. అలా కార్తికేయ 2ని ఆగస్టు 12న విడుదల చేయాలనుకున్నారు. ఈలోపే కొందరు ‘సినిమాను తొక్కేస్తున్నారు’ అంటూ తమకు తోచింది రాసేశారు. ఏ సినిమా ఆడినా నిర్మాతలమంతా ఆనందిస్తాం. మా మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉంది. సినిమా సక్సెస్‌ మీట్‌లో నేను ఇలా మాట్లాడటం చాలా బాధగా ఉంది. మాట్లాకపోతే ఇండస్ట్రీలో ఐక్యత లేదనుకుంటారు. నిర్మాతలమంతా సరిగ్గా ప్లాన్‌ చేసుకుని సినిమాలను విడుదల చేస్తుంటాం’’

వాటిని నేను పట్టించుకోను..

‘‘నాపై గతంలోనూ చాలా వదంతులు వచ్చాయి. అలాంటి వాటిని నేనెప్పుడూ పట్టించుకోను. నిఖిల్‌ తన కెరీర్‌ ప్రారంభం నుంచీ నాకు బాగా పరిచయం. తాను నటించే సినిమా కథలను నాతో పంచుకుంటుంటాడు. ఆ చనువుతోనే తన మేనేజరుతో కలిసి మళ్లీ నా దగ్గరకు వచ్చాడు. ‘ఆగస్టు 12న వేరే సినిమాలు విడుదలవుతున్నాయి. ఏం చేయాలి’ అని అడిగాడు. డిస్ట్రిబ్యూటర్లని సంప్రదించి, క్లాష్‌ లేకుండా ఒక రోజు ముందో వెనకో విడుదల చేయండి అని సలహా ఇచ్చా. అలా కార్తికేయ 2 ఆగస్టు 13న రిలీజ్‌ అయింది. ఒక రోజు తేడాతో విడుదలకావటంపైనా మళ్లీ రాద్దాంతం చేశారు’’ అని దిల్‌రాజు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని