Dil Raju: అందుకే నన్ను టార్గెట్‌ చేస్తారేమో: దిల్‌ రాజు

సంక్రాంతి సినిమాల టాపిక్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు స్పందించారు. 

Published : 16 Dec 2022 01:46 IST

హైదరాబాద్‌: గ్లామర్‌గా ఉండడం వల్ల తనను టార్గెట్‌ చేస్తున్నారనే అభిప్రాయాన్ని  (Dil Raju) వ్యక్తం చేశారు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్‌ చేశారు. 2023 సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల విషయంలో టాలీవుడ్‌లో కొంతకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్‌ అగ్ర హీరోల చిత్రాలు అదే సీజన్‌కు వస్తుండడంతో తెలుగు సినిమాలకే ప్రాధాన్యతనివ్వాలనే డిమాండ్‌ మొదలైంది. వాటిల్లో దిల్‌ రాజు నిర్మించిన ద్విభాషా చిత్రం ‘వారిసు’ (వారసుడు) ఉంది. దానిపై దిల్‌ రాజు స్పందిస్తూ.. ‘‘తమిళనాడులో నా సినిమాతోపాటు అజిత్‌ నటించిన చిత్రం విడుదలవుతుంది. అక్కడ మొత్తం 800 స్క్రీన్లు ఉన్నాయి. మా సినిమాకో 400 స్క్రీన్లు, ఆయన సినిమాకో 400 స్క్రీన్లు ఇస్తామని అక్కడి వారు చెబుతున్నారు. విజయ్‌ నంబరు 1 స్టార్‌ అని అందరికీ తెలిసిందే. మాకు 50 థియేటర్లు ఎక్కువ ఇవ్వండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెడ్‌ జెయింట్‌ బ్యానర్‌పై నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ అజిత్‌ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నేను ఆయన్ను కలిసి మాట్లాడతా. ఇదొక వ్యాపారం. ఏ రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని తప్పుపట్టడం లేదు. ఇక్కడ మాత్రం అందరికీ నేనే కనిపిస్తుంటా. గ్లామర్‌ వల్ల నన్ను టార్గెట్‌ చేస్తారనుకుంటున్నా’’ అని వివరించారు. సంబంధిత విజువల్స్‌ ట్విటర్‌లో వైరల్‌గా మారాయి.

తమిళ నటుడు విజయ్‌ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రమే ‘వారిసు’. జనవరి 12 విడుదలకానుంది. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని రూపొందించిన ‘వీర సింహారెడ్డి’ అదే రోజున విడుదల కానుంది. జనవరి 13న.. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. అజిత్‌ హీరోగా హెచ్‌. వినోద్‌ తెరకెక్కించిన చిత్రమే ‘తునివు’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని