Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ

మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా వసూళ్లపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని నిర్మాత నాగ వంశీ తెలిపారు.

Published : 27 Sep 2023 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా తన బాబాయ్‌ ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా వసూళ్లపై గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) తెలిపారు. ఆయన సోదరి హారిక నిర్మించిన ‘మ్యాడ్‌’ (MAD) సినిమా ‘క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ ఈవెంట్‌’లో ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘రాజమౌళి (Rajamouli) చిత్రాల వసూళ్లుకు దగ్గరగా గుంటూరు కారం కలెక్షన్స్‌ ఉంటాయని మీరు చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారా?’ అని వేడుక అనంతరం ఓ విలేకరి ప్రశ్నించగా నాగ వంశీ స్పందించారు. ఆ విషయంలో తమకెలాంటి సందేహం లేదన్నారు. 2024 జనవరి 12న సినిమా చూసి మీరే ఆ మాట చెబుతారని పేర్కొన్నారు. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ గురించి మాట్లాడుతూ.. విడుదల తేదీని ఖరారు చేయలేదని, దసరా లోపు రిలీజ్‌ చేయొచ్చన్నారు.

పెద్దోడి పాత్రలో పవన్‌కల్యాణ్‌..

‘మ్యాడ్‌’ మంచి విజయం అందుకుంటుందని నమ్మకంగా చెప్పిన ఆయన.. ‘జాతిరత్నాలు’ సినిమాకంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే ప్రేక్షకులు కొన్న టికెట్‌ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఇంజినీరింగ్‌ కాలేజీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గుంటూరు కారం’ విషయానికొస్తే.. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌ బాబు- దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శర వేరంగా జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని