Naga Vamsi: ‘ఈ పాప బుట్టబొమ్మలా లేదా?’ విలేకరికి నిర్మాత కౌంటర్‌

అనికా సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌ కీలకపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ ‘బుట్టబొమ్మ’ (Buttabomma). తాజాగా ఈసినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

Updated : 28 Jan 2023 15:21 IST

హైదరాబాద్‌: కథానాయిక అనికా సురేంద్రన్‌ (Anikha Surendran) డ్రెస్సింగ్ స్టైల్‌ గురించి సరదాగా వ్యాఖ్యలు చేసిన ఓ విలేకరికి తనదైన శైలిలో బదులిచ్చారు నిర్మాత నాగవంశీ (Naga Vamsi). హీరోయిన్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌కు సినిమాలోని ఆమె పాత్రకు చాలా వ్యత్యాసం ఉందని విలేకరి నవ్వుతూ అడగ్గా.. ‘‘ఈ అమ్మాయి బుట్టబొమ్మలా లేదా? అంటే ఏంటి ఈ అమ్మాయిని చీర కట్టుకుని రమ్మంటావా’’ అని సరదాగా కౌంటర్‌ విసిరారు. అనంతరం నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘మేము ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు హీరోయిన్‌గా అనికా అయితేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. 2020లో మా బ్యానర్‌ నుంచి వచ్చిన  ‘అల.. వైకుంఠపురములో’ మంచి విజయం అందుకుంది. అందులోని ‘బుట్టబొమ్మ’ పాట కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా కథకు ఈ టైటిల్‌ అయితేనే బాగుంటుందని భావించి ‘బుట్టబొమ్మ’ పేరు ఖరారు చేశాం. 2020లో మేము ఈ టైటిల్‌ పెట్టాం. కొవిడ్‌ వల్ల షూటింగ్‌ ఆలస్యమై ఇప్పుడు రిలీజ్‌కు వస్తున్నాం’’ అని వివరించారు.

అనికా సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ట ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బుట్టబొమ్మ’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రమిది. మలయాళీ సినిమా ‘కప్పేల’కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో శనివారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర నిర్మాత నాగవంశీ సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని