Narayandas Narang: ఏషియన్‌ థియేటర్స్‌ అధినేత నారాయణదాస్‌ నారంగ్‌ కన్నుమూత

నిర్మాత, చలనచిత్ర వాణిజ్య మండి అధ్యక్షకుడు నారాయణదాస్‌ నారంగ్‌ (76) కన్నుమూశారు.

Updated : 19 Apr 2022 15:08 IST

హైదరాబాద్‌ : ప్రముఖ నిర్మాత, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు, ఏషియన్‌ మల్టీప్లెక్స్‌, థియేటర్స్‌ అధినేత నారాయణదాస్‌ నారంగ్‌ (76) కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన ఇటీవల స్టార్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని స్వగృహానికి తరలించారు. నాగార్జున, నిర్మాతలు సురేశ్‌బాబు, సుధాకర్‌రెడ్డి, సుప్రియ, దర్శకుడు శేఖర్‌ కమ్ముల తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. నారాయణదాస్‌ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
 
1946 జులై 27న జన్మించిన నారాయణదాస్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలు విడుదల చేశారు. శ్రీవెంకటేశ్వర పతాకంపై ‘లవ్‌స్టోరీ’, ‘లక్ష్య’ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం.. నాగార్జునతో ‘ఘోస్ట్‌’, ధనుష్‌తో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఇలా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, మూవీ ఫైనాన్షియర్‌గా సినీ పరిశ్రమకు సేవలు అందించిన ఆయన అజాతశత్రువుగా పేరొందారు. నారాయణ్‌దాస్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తనయులు సునీల్‌ నారంగ్‌, భరత్‌ నారంగ్‌ కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

నారాయణ మృతి పట్ల తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

* ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి, నిబద్ధత కలిగిన వ్యక్తి, అపార అనుభవజ్ఞుడు, సినీ రంగంలో ఓ మహారథి, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ మృతి పట్ల శ్రద్ధాంజలి. - చిరంజీవి.

* నారాయణదాస్‌ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. సినిమాపై ఆయనకున్న విజన్‌, ప్యాషన్‌ ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. - మహేశ్‌బాబు.

* నారాయణదాస్‌ నారంగ్‌ మృతి పట్ల చింతిస్తున్నా. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నేను నటించిన కొన్ని చిత్రాలు ఆయన సంస్థ ద్వారా పంపిణీ అయ్యాయి. - పవన్‌ కల్యాణ్‌.

* నారాయణదాస్‌ లేరన్న వార్త నన్ను తీవ్రంగా బాధించింది. తెలుగు సినిమా, సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. - మంచు విష్ణు.

* నారాయణదాస్‌.. చిత్ర పరిశ్రమలోని అందరితో స్నేహపూర్వకంగా మెలిగే వ్యక్తి. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నా. - దర్శకుడు వి.వి. వినాయక్‌.

* నారాయణదాస్‌, ఆయన తనయుడు సునీల్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నారాయణదాస్‌ లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా. - నిర్మాత నల్లమలుపు బుజ్జి.

* నారాయణదాస్‌గారు సినీ ఇండస్ట్రీలో అజాతశత్రువుగా పేరొందారు . నైజాంలో ఎగ్జిబిటర్, పంపిణీదారులుగా విశేష సేవలందించారు. వారి మరణం విచారకరం.  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. - ఎమ్మెల్యే కొడాలి నాని.

* నారాయణదాస్ మృతి చెందారన్న విషయం నన్ను వ్యక్తిగతంగా బాధించింది. నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన మంచి గుర్తింపు పొందారు. ఆయన దూరమవడం చాలా దురదృష్టం. వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నా. - ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని