GodFather: పారితోషికం గురించి నయన్‌ ఒక్క మాటా మాట్లాడలేదు : ఎన్వీ ప్రసాద్

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather). మోహన్‌రాజా దర్శకుడు. తాజాగా ఈసినిమా ప్రెస్‌మీట్‌ హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది.

Updated : 04 Oct 2022 15:01 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather). మోహన్‌రాజా దర్శకుడు. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రబృందం మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది.

‘‘చిరంజీవితో నాకు ఎంతో కాలం నుంచి మంచి అనుబంధం ఉంది. ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని ఉండేది. కానీ కుదరలేదు. అలాంటి సమయంలో ఓసారి రామ్‌చరణ్‌ ఫోన్‌ చేసి.. ‘‘లూసిఫర్‌’ సినిమా నాన్నకు బాగా నచ్చింది. కుదిరితే మీరు హక్కులు కొనుగోలు చేయండి’’ అని చెప్పారు. చరణ్‌ చెప్పడంతో మేము హక్కులు కొనుగోలు చేశాం. అలా, ఈ చిత్రానికి నన్ను నిర్మాతను చేసింది చరణే. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి దీన్ని తెరకెక్కించారు. ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా ఓ పండుగ. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఉంది. మూడు సన్నివేశాల్లో అభిమానులు తప్పకుండా విజిల్స్‌ వేస్తారు. ఇక, నయనతారకు ప్రత్యేకంగా థ్యాంక్స్‌ చెప్పాలి. మోహన్‌రాజా వల్లే ఆమె ఈ సినిమా ఓకే చేసింది. ఫైనల్‌ డే షూట్‌ కోసం గత నెలలో ఆమె సెట్‌కు వచ్చారు. గంట వ్యవధిలోనే షూట్‌ పూర్తి చేసుకొని ఆమె వెళ్లిపోయారు. అయితే అప్పటికే మేము ఆమెకు బ్యాలెన్స్‌ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కానీ,  ఆమె ఎప్పుడూ మమ్మల్ని అడగలేదు. ఆమె టీమ్‌ కూడా ఏ రోజూ డబ్బుల గురించి ప్రశ్నించలేదు. వర్క్‌ పట్ల ఆమె చూపించిన క్రమశిక్షణ, శ్రద్ధ నాకు బాగా నచ్చాయి. ఇటీవల ఆమెకు డబ్బులు కూడా ఇచ్చేశాం’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ పేర్కొన్నారు.

‘‘చిరంజీవితో కలిసి మొదటిసారి వర్క్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన సల్మాన్‌కు ధన్యవాదాలు. చిరు-చరణ్‌ వల్లే ఆయన ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్ముతున్నా’’ - నిర్మాత ఆర్‌.బి.చౌదరి

‘‘చిరంజీవితో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన ఇప్పటికీ కష్టపడి పనిచేస్తుంటారు. ‘మొగుడుకావాలి’ నుంచి ఆయన్ని చూస్తున్నా.. కథ విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటారు. ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటారు. కొన్నిసార్లు రైటర్‌ కంటే కూడా గొప్పగా మార్పులు చెబుతుంటాడు. ‘లూసిఫర్‌’ రీమేక్‌ అనుకున్నప్పుడు ఏదో చిన్న సందేహం ఉండేది. కానీ మోహన్‌రాజా చిన్న మార్పు చెప్పారు. అది మాకెంతో నచ్చేసింది. ఆ మార్పు వల్లే ఈ సినిమా చేయాలని అందరూ నిర్ణయించుకున్నాం’’ - సత్యానంద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని