RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌.. గే లవ్‌ స్టోరీ’.. రసూల్‌ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఎంతటి ఘన విజయం అందుకుందో విధితమే. రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

Published : 06 Jul 2022 02:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (NTR) కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం ఎంతటి ఘన విజయం అందుకుందో విదితమే. రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అలా ఈ చిత్రాన్ని వీక్షించిన కొందరు విదేశీయులు సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ కామెంట్లు పెట్టారు. తాజాగా వారి జాబితాలోకి కొందరు భారతీయ సినీ అభిమానులు, ప్రముఖులూ చేరారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ సౌండ్‌ ఇంజినీర్‌ పెట్టిన కామెంట్‌పై ‘బాహుబలి’ చిత్రాల నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) మండిపడ్డారు. ఏం జరిగిందంటే?.. ‘‘నిన్న రాత్రి RRR అనే చెత్తను ఓ 30 నిమిషాలు చూశా’’ అని ఓ ఫిల్మ్‌మేకర్‌ ఇటీవల ట్వీట్‌ చేశారు. దానికి సమాధానంగా ‘‘గే లవ్‌ స్టోరీ’’ అంటూ ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ సౌండ్‌ ఇంజినీర్‌ రసూల్‌ పూకుట్టి (Resul Pookutty) రాసుకొచ్చారు. దీన్ని రీట్వీట్‌ చేసి, ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌.. గే లవ్‌ స్టోరీ అని నేను అనుకోవడం లేదు. అది గే లవ్‌ స్టోరీ అని మీరెలా సమర్థిస్తారు? మీరన్నట్టు ఒకవేళ అది గే లవ్‌ స్టోరీ అయితే అందులో తప్పేంటి?నిపుణులైన మీలాంటి వారి వ్యాఖ్యాలు చాలా నిరాశకు గురి చేయడమే కాదు, మీ స్థాయికి తగినట్లూ లేవు’’ అని శోభు కాస్త తీవ్రంగానే సమాధానమిచ్చారు.

‘‘మీతో ఏకీభవిస్తున్నా. ఒకవేళ అది గే లవ్‌ స్టోరీ అయినా అందులో ఎలాంటి తప్పు ఉండదు. నేను నా స్నేహితుడి ట్వీట్‌కు మాత్రమే అలా సమాధానమిచ్చా. అయినా ఈ విషయం సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందింది. ఇందులో వక్రీకరించాల్సింది ఏం లేదు.  శోభూ మీరు దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దు. నేనవరినీ ఉద్దేశించి అలా అనలేదు’’ అని శోభుకు రసూల్‌ రిప్లై ఇచ్చారు.

‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రానికిగానూ అత్యుత్తమ సౌండ్‌ మిక్సింగ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న రసూల్‌ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. తెలుగులో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రాలు ‘రాధేశ్యామ్‌’, ‘పుష్ప: ది రైజ్‌’కు ఆయన పనిచేశారు. రసూల్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి దాన్ని వెంటనే తొలగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని