DJ Tillu2: నిర్మాత నాగవంశీ ట్వీట్.. త్వరలో సెట్స్‌పైకి ‘డీజే టిల్లు2’?

‘ఏం చెప్పన్రా మార్కస్‌.. ఒక ల్యాండ్‌ ఉన్నది.. అది మన సొంతము.. మన పర్సనలు అనుకున్నా నేను.

Updated : 25 Jun 2022 17:24 IST

హైదరాబాద్‌:  ‘ఏం చెప్పన్రా మార్కస్‌.. ఒక ల్యాండ్‌ ఉన్నది.. అది మన సొంతము.. మన పర్సనలు అనుకున్నా నేను. కాకపోతే ఊళ్లో వాళ్ల అందరి పేరు మీద ఉన్నది..’ అంటూ తనదైన డైలాగ్‌ డెలివరీ, యాక్షన్‌తో ‘డీజే టిల్లు’(DJ Tillu)గా హిట్‌ కొట్టాడు యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda). ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రం రానుందా?అంటే నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్‌ చూస్తే దాదాపు అవుననే సమాధానం వస్తోంది. దేవుడి ఫొటోల ముందు స్క్రిప్ట్‌ పుస్తకాన్ని ఉంచి పూజ చేసిన ఫొటోను పంచుకుంటూ ‘మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రాంఛైజీ రౌండ్‌-2 పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రేజీ అడ్వెంచర్‌ షూటింగ్‌ ఆగస్టు నుంచి మొదలవుతుంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

దీంతో ఆయన ట్వీట్‌కు నెటిజన్లు స్పందించారు. ‘డీజే టిల్లు2’ (DJ Tillu2)అంటూ కామెంట్లు పెట్టారు. మరోవైపు నిర్మాత మధుర శ్రీధర్‌ కూడా ‘శుభాభినందనలు సోదరా.. పార్ట్‌-2 బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకోవాలి’ అంటూ సిద్ధు జొన్నలగడ్డ ట్విటర్‌ను ట్యాగ్‌ చేశారు. ఈ రిప్లైతో ‘డీజే టిల్లు2’ గురించి శ్రీధర్‌ చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ‘డిజే టిల్లు’కు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. విమల్‌తో కలిసి సిద్ధు కూడా స్క్రిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నారు. టిల్లు పాత్ర కోసం తన నటన, ఆహార్యం మార్చుకున్నారు సిద్ధు. అదే యువతలో ట్రెండ్‌ అయ్యేలా చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమాలో నేహాశెట్టి(Neha Shetty), ప్రిన్స్‌, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.30కోట్ల వసూళ్ల రాబట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని