Puli Meka Review: రివ్యూ: పులి మేక

Puli Meka Review: లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్‌ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పులి మేక’ ఎలా ఉందంటే?

Updated : 25 Feb 2023 16:40 IST

Puli Meka Review; వెబ్‌సిరీస్‌: పులి మేక; నటీనటులు: ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి, సుమన్, సిరి హన్మంత్, రాజా చెంబోలు, ముక్కు అవినాష్, సాయి శ్రీనివాస్, గోపరాజు రమణ, స్పందన పల్లి తదితరులు; సంగీతం: ప్రవీణ్ లక్కరాజు; సినిమాటోగ్రఫీ: రామ్ కె మహేష్; ఎడిటింగ్‌: చోట కె ప్రసాద్; నిర్మాతలు: కోన ఫిలిం కార్పొరేషన్, జీ5; దర్శకత్వం: చక్రవర్తి రెడ్డి; స్ట్రీమింగ్‌ వేదిక: జీ5

వెండితెరపై తమదైన నటనతో మెప్పించిన సినీ తారలు ఇప్పుడు వెబ్‌సిరీస్‌ల బాటపడుతున్నారు. ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ప్రస్తుతం ఇదే హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆది సాయికుమార్ (aadi saikumar), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)లు తొలిసారి నటించిన వెబ్‌సిరీస్‌ ‘పులి మేక’. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ కథ, అందించి నిర్మించారు. తాజాగా జీ5 వేదికగా విడుదలైన ఈ సిరీస్‌ ఎలా ఉంది? (Puli Meka Review) ఏ మేరకు ఆకట్టుకుంది?

కథేంటంటే: హైదరాబాద్‌ నగరంలోని పలువురు పోలీస్ అధికారులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా హత్యకు గురవుతారు. ఒక సీరియల్‌ కిల్లర్‌ ఇవన్నీ చేస్తున్నాడని ప్రజలు, మీడియాకు తెలిసేలోపు అతడెవరో కనిపెట్టాలని సిటీ కమిషనర్‌ (సుమన్‌)  పోలీసులను ఆదేశిస్తాడు. ఈ క్రమంలోనే డ్యూటీలో మంచి ప్రతిభ కలిగిన ఐపీఎస్ అధికారి కిరణ్‌ ప్రభ(లావణ్య త్రిపాఠి)కు ఈ కేసును అప్పగిస్తాడు. వరుస హత్యలకు సంబంధించిన అదనపు సమాచారం సేకరించి పోలీసులకు సహకరిస్తుంటాడు ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రభాకర్ శర్మ (ఆది సాయి కుమార్). మరి ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు? పోలీసులనే అతడు ఎందుకు హత్య చేయాలనుకున్నాడు? కిరణ్‌ ప్రభ, ప్రభాకర్‌ శర్మ ఆ హంతకుడిని పట్టుకున్నారా? పల్లవి (సిరి హన్మంతు), కరుణాకర్‌ శర్మ (రాజా చెంబోలు) ఎవరు? తెలియాలంటే వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: సినిమాలో చెప్పలేని ఎన్నో విషయాలను పూసగుచ్చినట్లు చెప్పేందుకు లభించిన అద్భుతమైన వేదిక ఓటీటీ. సినిమాకు నిడివి ఆటంకమైతే, వెబ్‌సిరీస్‌కు అదే బలం. అయితే, బలాన్ని ఉపయోగించుకుని ప్రేక్షకుడిని స్క్రీన్‌ ముందు కూర్చోబెట్టగలిగితే విజయం సాధించినట్లే. ఈ విషయంలో ‘పులి మేక’ కొంత వరకే సక్సెస్‌ సాధించింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ అంటే ఊహకందని సన్నివేశాలు, ట్విస్ట్‌లు ఉండాలి. కానీ, ఇందులో ట్విస్ట్‌లు ఉన్నా, కథనం చాలా వరకూ ఊహకు అందేలా సాగుతుంది. హైదరాబాద్‌ నగరంలో పోలీసు అధికారుల హత్యలు జరగడంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. (Puli Meka Review) మరోవైపు ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ ప్రభ ప్రతిభను చూపేందుకు ఒకట్రెండు యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఇప్పటివరకూ అందాల కథానాయికగా ముద్రపడిన లావణ్య త్రిపాఠి యాక్షన్‌మోడ్‌లోనూ రాణించగలదని చెప్పడానికి ఆ సన్నివేశాలను తీర్చిదిద్దినట్లు ఇట్టే అర్థమైపోతుంది. కిరణ్‌ ప్రభ పోలీసు అధికారుల హత్య కేసు టేకప్‌ చేసిన తర్వాత కథనంలో వేగం పుంజుకుంటుందేమోననుకుంటే, ఫ్యామిలీ డ్రామాను ఇరికించి సాగదీశారు. ఉత్కంఠతో సాగే  క్రైమ్ థ్రిల్లర్స్‌కి స్పీడ్‌ బ్రేకర్లు వేసేవి ఇవే. ఇటు కిరణ్‌ ప్రభ, అటు ప్రభాకరశర్మ ఇన్వెస్టిగేషన్‌ చాలా నెమ్మదిగా సాగుతుంది. (Puli Meka Review) కొన్ని సన్నివేశాలు అసలు లాజిక్‌కు దూరంగా ఉన్నాయి.

అసలు ప్లాట్‌ పాయింట్‌కు రావడానికి మూడు ఎపిసోడ్‌లు వాడుకున్నారు. నాలుగో ఎపిసోడ్‌లో అసలైన ట్విస్ట్‌లు మొదలవుతాయి. ఇక్కడి నుంచే కథనంలో కాస్త వేగం పుంజుకున్నా, అంతా ఊహకు అందేటట్లే అది సాగుతుంది. పైగా, సీరియస్‌గా సాగుతున్న కథ మధ్యలోకి మళ్లీ మళ్లీ వచ్చే ఫ్యామిలీ డ్రామా, కామెడీ చికాకు తెప్పిస్తాయి. సీరియల్‌ కిల్లర్‌ ఎవరో తెలిసిపోయిన తర్వాత థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ కాస్తా రొటీన్‌ రివెంజ్‌ డ్రామాగా మారిపోయింది. కిరణ్‌ ప్రభ ఫ్లాష్‌ బ్యాక్‌లో బలమైన ఎమోషన్‌ లేదు. (Puli Meka Review) పల్లవి (సిరి హన్మంతు) నేపథ్యం కూడా అంతే. అందుకు కారణాలు కూడా చాలా సిల్లీగా ఉంటాయి. మొదటి మూడు ఎపిసోడ్స్‌తో పోలిస్తే, చివరి మూడు ఉత్కంఠగా, ఆసక్తిగా తీర్చిదిద్దడంలో టీమ్‌ విజయం సాధించింది. మొదట్లో చాలా ఎపిసోడ్స్‌లో సన్నివేశాలకు కత్తెర వేసే అవకాశం ఉన్నా, దాన్ని వినియోగించుకోలేదు. (Puli Meka Review)  సిరీస్‌ అంతా చూసిన తర్వాత ‘పులి మేక’ అనే టైటిల్‌ పెట్టడం వెనుక ఆంత్యరమేంటో అర్థం కాలేదు. ఎందుకంటే ఓ సన్నివేశంలో ‘ఇది పులి మేక ఆట. ఆ పులి ఎవరో మాకు తెలియాలి’ అని ఆది సాయికుమార్‌ అంటారు. చివరికి ఆ పులి తెలిసిన తర్వాత ‘ఇదా ఆ పులి’ అనిపిస్తుంది. బహుశా ‘మేక వన్నె పులి’ అని చెప్పడానికి అలా పెట్టారేమో. వెబ్‌సిరీస్‌ పేరుతో అసభ్య సన్నివేశాలకు పోకుండా కుటుంబంతో కలిసి చూడగలిగే ‘క్రైమ్‌ థ్రిల్లర్’ను తీర్చిదిద్దడం అభినందనీయం.

ఎవరెలా చేశారంటే: ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ ప్రభగా, పవర్‌ఫుల్‌ ఆఫీసర్‌గా కనిపించేందుకు లావణ్య త్రిపాఠి బాగానే కష్టపడింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లోనూ బెస్ట్‌ ఇచ్చింది. ఫోరెన్సిక్‌ హెడ్‌ ప్రభాకర్‌ శర్మగా ఆది సాయికుమార్‌ కనిపించారు. (Puli Meka Review) తన పాత్రకు న్యాయం చేశారు. ఆది పాత్రతో పోలిస్తే, లావణ్య పాత్రకే కాస్త ఎడ్జ్‌ ఎక్కువ. అయినా కూడా ఆది ఇలాంటి పాత్ర  చేయడానికి ఒప్పుకోవడం అభినందనీయం. వెండితెరపై జయాపజయాలు ఎలా ఉన్నా, ఈ వెబ్‌సిరీస్‌ ద్వారా ఆది మరో కొత్త అడుగు వేశారు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే, ఇలాంటి విభిన్న పాత్రలు మరిన్ని చేస్తే తండ్రిలా వైవిధ్య నటుడిగా పేరు తెచ్చుకోవచ్చు. యూట్యూబర్‌, ‘బిగ్‌బాస్’ ఫేం సిరి కీలక పాత్రలో కనిపించింది. (Puli Meka Review) సిరీస్‌ను మలుపు తిప్పే పాత్ర ఆమెది. అయితే, ఆ పాత్ర ద్వారా బలమైన ఎమోషన్స్‌ పండించి ఉంటే, సిరీస్‌ మరోస్థాయిలో ఉండేది. రాజా చెంబోలుది ముఖ్యమైన పాత్రే. మొదటి నుంచి ప్రేక్షకుడు అనుమానపడే పాత్ర ఏదైనా ఉందంటే రాజాదే. సుమన్‌, ముక్కు అవినాష్‌, గోపరాజు రమణ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సిరీస్‌ ఓకే. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. అనవసర సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే ఇంకాస్త బాగుండేది. నిర్మాణ విలువలు మరీ గొప్పగా ఏమీ లేవు. బడ్జెట్‌ పరిమితులు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తాయి. రచయితలు కోన వెంకట్‌, వెంకటేష్ కిలారులు సినిమాకు సరిపడా క్రైమ్‌ థ్రిల్లర్‌ ముడిసరకును తీసుకుని, వెబ్‌సిరీస్‌ వండేందుకు ఇచ్చారు. దర్శకుడు చక్రవర్తిరెడ్డి ఆ సరకుతోనే వంట చేసి, ‘బాగుంద’నిపించారంతే! క్రైమ్‌ థ్రిల్లర్‌లో కమర్షియల్‌ హంగులకు పెద్ద పీట వేశారు. ఈ మధ్య సినిమాలకు సీక్వెల్స్‌ ఉన్నట్లే, సిరీస్‌లకు అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. ‘పులి మేక’ ఆట కూడా ఇలాగే కొనసాగనుంది.

బలాలు: + ట్విస్ట్‌లు; + నటీనటులు, సాంకేతిక వర్గం పనితీరు; + చివరి మూడు ఎపిసోడ్‌లు

బలహీనతలు: - ఊహకు అందేలా సాగే కథనం; - బలమైన ఎమోషన్స్‌ లేకపోవడం - అనవసర సన్నివేశాలు

చివరిగా:  ‘పులి మేక’ సాగదీయకుంటే ఇంకాస్త బాగుండేది ఆట. (Puli Meka Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని