మేమంతా ఒకటే కుటుంబం.. హీరో దర్శన్‌పై దాడి.. శివరాజ్‌ కుమార్‌ ఆగ్రహం

సినిమా ప్రమోషన్స్‌లో దర్శన్‌పై జరిగిన దాడి గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు నటుడు శివరాజ్‌ కుమార్‌. దయచేసి ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated : 21 Dec 2022 13:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కన్నడ నటుడు దర్శన్‌పై (Darshan) జరిగిన దాడి తననెంతో కలచి వేసిందని దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) సోదరుడు నటుడు శివరాజ్‌ కుమార్‌ (Shiva Rajkumar) అన్నారు. తామంతా ఒక కుటుంబ సభ్యులమేనని తెలిపారు. ‘‘హోస్‌పేట్‌లో దర్శన్‌పై జరిగిన దాడి నన్ను బాధకు గురి చేసింది. మేమంతా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్లం. ఇలాంటి ఘటనలు మా అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. దయచేసి మానవత్వాన్ని మరచి..  ఇటువంటి ఘటనలకు పాల్పడవద్దని అందర్నీ కోరుకుంటున్నాను. అభిమానంతో ప్రేమను పంచండి. ద్వేషం, అగౌరవం కాదు’’ అని శివరాజ్‌కుమార్‌ అన్నారు.

‘‘దర్శన్‌పై దాడి ఘటన చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కొంతమంది వ్యక్తులు చేసే పనికి ఒకరినొకరు ప్రేమించుకునే, గౌరవించే కళాకారుల ఛరిష్మా దెబ్బతినకూడదు. ఇలాంటి ఘటనకు పాల్పడిన దుర్మార్గులకు శిక్ష పడాలి. అభిమానుల మధ్య ఇలాంటి విభేదాలు ఉండకూడదు. మన రాష్ట్రం ప్రేమ, కరుణకు పుట్టినిల్లు. ఆ ప్రేమ, గౌరవాన్ని కొనసాగిద్దాం’’ అని ‘పుష్ప’ నటుడు ధనుంజయ పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..

తాను నటించిన ‘క్రాంతి’ (kranthi) ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో పాల్గొన్న దర్శన్‌పైకి గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఈ ఘటనతో షాక్‌ అయినప్పటికీ.. ఆ వ్యక్తిని ఏమీ చేయవద్దని ఆయన చెప్పారు. అయితే, ఈ ఘటనకు ముందు ఈవెంట్‌ జరిగే చోట పునీత్‌ రాజ్‌కుమార్‌ - దర్శన్‌ అభిమానులకు మధ్య వివాదం చోటుచేసుకొంది. పునీత్‌ గురించి గతంలో దర్శన్‌ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని, పునీత్‌ను అభిమానించే ఓ వ్యక్తి ఇలా చేశాడని స్థానిక పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని