
Puneeth Rajkumar: పునీత్ కళ్లతో నలుగురికి కంటిచూపు
అదెలా సాధ్యమైందంటే?
కర్ణాటకలో ఇలాంటి నేత్రదానం ఎక్కడా జరిగి ఉండదు: వైద్యులు
బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగానే కాదు.. సేవల ద్వారానూ ప్రజలకు చేరువయ్యారు. బతికున్నంత కాలం ఎంతో మందిని ఆదుకున్న ఆయన.. కన్నుమూసిన అనంతరం కూడా నలుగురి జీవితాల్లో వెలుగునింపారు. ఆయన మరణాంతరం దానం చేసిన కళ్లతో నలుగురికి కంటిచూపు దక్కడం విశేషం. ఇదే విషయాన్ని నారాయణ నేత్రాలయ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భుజంగ్ శెట్టి వెల్లడించారు. ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్‌కుమార్ నేత్రదానం చేసినందుకు చాలా మేము అదృష్టవంతులుగా భావిస్తున్నామన్నారు.
‘‘సాధారణంగా ఒక వ్యక్తి దానం చేసిన కళ్లను ఇతరులకు మార్పిడి చేస్తే.. ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుంది. కానీ పునీత్ కళ్లలోని కార్నియాలోని సుపీరియర్, డీపర్ లేయర్స్‌ని వేరు చేసి నలుగురికి శస్ర్త చికిత్స చేయగలిగాం. అంటే ఒక్కోకంటిని ఇద్దరి పేషంట్లకు చికిత్సకు వినియోగించాం. ’’ అని శెట్టి పేర్కొన్నారు. కంటి నిపుణులు డాక్టర్ శెట్టి దీన్ని వివరిస్తూ.. ‘‘ సూపర్ఫీషియల్ కార్నియల్ వ్యాధి ఉన్న వారికి సుపీరియర్ లేయర్ మార్పిడి చేశాం. ఎండోథెలియల్ / డీప్ కార్నియల్ లేయర్ వ్యాధి ఉన్న మరో ఇద్దరికి డీపర్ లేయర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశాం. అలా పునీత్ కళ్లతో నలుగురికి చూపుదక్కింది. బహుశా మాకు తెలిసి కర్ణాటకలో ఇలాంటి నేత్రదానం ఎక్కడా జరిగి ఉండదు’’ అన్నారు. కేవలం పునీత్ మాత్రమే కాదు.. ఆయన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ మరణాంతరం నేత్రాలను సేకరించి పేషంట్లకు అమర్చారు. పునీత్ ఇక లేరని ప్రకటించాక.. పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు రాఘవేంద్ర నారాయణ నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ రాజ్‌కుమార్ ఐ బ్యాంక్‌కి సమాచారం అందించి.. పునీత్ కళ్లను సేకరించమన్నారు.