భారత్‌లో ప్రతి పావుగంటకు ఒక అత్యాచారం..!

భారతదేశంలో ప్రతి పావుగంటకు ఒక అత్యాచారం జరుగుతుందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన హాథ్రస్‌ ఘటన నేపథ్యంలో దేశంలో మహిళలపై జరుగుతోన్న దాడులను ఉద్దేశిస్తూ తాజాగా ‘పూరీ మ్యూజింగ్స్‌’లో ఆయన మాట్లాడారు. ప్రతిరోజూ దేశంలో 100 అత్యాచార కేసులు నమోదు....

Updated : 05 Oct 2020 09:58 IST

హాథ్రస్‌ ఘటనపై పూరీ ఏమన్నారంటే..

హైదరాబాద్‌: భారతదేశంలో ప్రతి పావుగంటకు ఒక అత్యాచారం జరుగుతోందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన హాథ్రస్‌ ఘటన నేపథ్యంలో దేశంలో మహిళలపై జరుగుతోన్న దాడులను ఉద్దేశిస్తూ తాజాగా ‘పూరీ మ్యూజింగ్స్‌’లో ఆయన మాట్లాడారు. ప్రతిరోజూ దేశంలో 100 అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయని.. వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. న్యాయం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఒక్కసారి మనందరం నిజాలు మాట్లాడుకుందాం. భారత్‌లో ప్రతి 15 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది. ప్రతిరోజూ 100 అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయి. మహిళలపై రోజూ నాలుగు లక్షలపైగా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల హాథ్రస్‌లో సామూహిక అత్యాచారం. వాళ్లు అత్యాచారం చేయడం మాత్రమే కాదు.. అతి కిరాతంగా హింసించారు. మహిళలకు అన్యాయం జరిగితే న్యాయం జరగడం పక్కన పెట్టండి.. న్యాయం కోసం పోరాటం చేయాల్సి వస్తోంది ఈ దేశంలో.. ఏంటీ ఖర్మ! ఈ దేశంలో ఆడవాళ్ల కోసం ఆడవాళ్లే ఫైట్‌ చేయాల్సి వస్తోంది. మగవాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్నాళ్లు సూసైడ్‌ ఫెస్టివల్స్‌.. సుశాంత్‌ ఒక్కడే కాదు అదే సమయంలో భారత్‌లో 300 మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వాళ్ల గురించి ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. గాల్వాన్‌ వ్యాలీలో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల పేర్లు ఎవరికీ తెలియదు. కనీసం ఒక్కసారి ఆ మహావీరుల గురించి ఆలోచించారా? ఆ తర్వాత నెపోటిజం ఫెస్టివల్‌.. అందరూ కలిసి ఒకర్ని తొక్కేస్తున్నారని ఫీలైపోవడం. అది అవివేకం. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఒక స్టార్‌. కొత్త హీరో సినిమాలు ఎన్నో విడుదలవుతుంటాయి. ఆ సమయంలో ఒక్క థియేటరైనా నిండిందా? కొత్త హీరోలను ప్రోత్సహిద్దామని మీరు టిక్కెట్‌ కొన్నారా? చివరికి మీరు స్టార్స్‌ సినిమాలే చూస్తారు. ఇప్పుడు డ్రగ్స్‌ ఫెస్టివల్‌.. సెలబ్రిటీలందర్నీ తీసుకువెళ్లి ఫ్యాషన్‌ పరేడ్‌లు పెట్టారు’

‘ఆడవాళ్ల కోసం నిలబడండి. పోరాటం చేయండి. తెలంగాణలో దిశాకు జరిగిన న్యాయం ఈ దేశంలో ప్రతి అమ్మాయికి జరగాలి. మొన్న ఆగస్టు 15న మనందరం స్వాత్రంత్యదినోత్సవం జరుపుకొన్నాం. అదేరోజు ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా?’ అని పూరీ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని