PURI Musings: భూమ్మీద ఉన్న అద్భుత నగరమదే

ఈ భూమ్మీద ఉన్న సుందరమైన నగరం ఇటలీలోని వెనిస్‌ అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. వెనిస్‌ అందాలు, అక్కడి జీవన స్థితిగతుల గురించి తాజాగా ఆయన అందరితో పంచుకున్నారు....

Updated : 17 May 2021 15:30 IST

2030 నాటికి దెయ్యాల ప్రాంతంగా మారనుందంటున్నారు

హైదరాబాద్‌: ఈ భూమ్మీద ఉన్న సుందరమైన నగరం ఇటలీలోని వెనిస్‌ అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. వెనిస్‌ అందాలు, అక్కడి జీవన స్థితిగతుల గురించి తాజాగా ఆయన వివరించారు. అత్యంత అందమైన ప్రాంతంగా చెప్పుకునే ఈ వెనిస్‌ నగరం 2030 నాటికి ఘోస్ట్‌ సిటీగా మారనుందని అందరూ అనుకుంటున్నారని ఆయన తెలిపారు. ఒకవేళ అవకాశం వస్తే వెనిస్‌ అందాలు చూడడానికి వెళ్లాలని సూచించారు. పూరీ మ్యూజింగ్స్‌ వేదికగా ‘వెనిస్‌’ గురించి ఆయన ఏమన్నారంటే..

‘ప్రపంచంలోనే అందమైన నగరాల్లో వెనిస్‌ ఒకటి. దీన్ని వెనిజియా అని కూడా పిలుస్తారు. ఇటలీలోని నార్త్‌ ఈస్ట్‌లో కట్టిన సిటీ ఇది. ఒకప్పుడు అక్కడ 118 చిన్న ద్వీపాలు ఉండేవి. వాటి మీదనే ఈ నగరాన్ని నిర్మించారు. ప్రతి ద్వీపానికి మధ్య చెరువులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ ద్వీపాలన్నింటినీ కలపడం కోసం చెరువులపై నాలుగు వందల చిన్న చిన్న వంతెలు నిర్మించారు. వెనిస్‌లో కార్లు, బైక్‌లు ఉండవు. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లాలంటే పడవలోనే ప్రయాణించాలి. ఆ పడవల్ని గండోలాస్‌ అంటారు. ఒక గండోలా 11 మీటర్ల పొడవులో ఉండి.. చూడముచ్చటగా ఉంటుంది’

‘ప్రముఖ పర్యాటకవేత్త, రచయిత మార్కోపోలో ఈ ప్రాంతానికి చెందినవాడే. ఇక్కడ అణువణువు ఎంతో అందంగా ఉంటుంది. వీధి దీపాలు, రోడ్డు పక్కన కూర్చొనే బల్లలు చివరికి చెత్తకుండీలు కూడా ఎంతో అందంగా డిజైన్‌ చేసి ఉంటాయి. ఇక్కడ జరిగే అతిపెద్ద పండుగ‌.. కార్నివాల్‌. ఆ కార్నివాల్‌ రోజున అందరూ అందమైన ఫేస్‌ మాస్క్‌ వేసుకుని తిరుగుతారు. 16వ శతాబ్దంలో అయితే కార్నివాల్‌ సమయంలో ఎవరైనా ఫేస్‌ మాస్క్‌ లేకుండా కనిపిస్తే వాళ్లకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించేవాళ్లు. లేదా ప్రజలు వాళ్లని బాగా కొట్టి స్తంభానికి కట్టేసేవాళ్లు. ఫేస్‌మాస్క్‌ విషయంలో వాళ్లు అంత కచ్చితంగా ఉండేవాళ్లు’

‘‘ఎస్‌’ ఆకారంలో ఉన్న ఓ పెద్ద చెరువు సిటీని రెండు భాగాలుగా చేస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కాసినో ఇక్కడే ప్రారంభమైంది. అలాగే ప్రపంచంలోనే గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేసిన మొదటి మహిళ ఈ ప్రాంతానికి చెందినవారే. 1646లో ఆమె గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేసింది. వెనిస్‌ ఈజ్‌ ఫుల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌.  ఎక్కడ చూసినా మ్యూజిషియన్స్‌ కనిపిస్తూనే ఉంటారు. ఈదొక అద్భుతమైన నగరం. రోజూ ఈ నగరానికి రంగులద్దుతూ ఎంతోమంది పెయింటర్స్‌ మనకి కనిపిస్తూనే ఉంటారు. నేను అక్కడ ఉన్నప్పుడు ‘టూరిస్ట్‌’ సినిమా కోసం ఏంజెలినా జోలీ వెనిస్‌ వచ్చి వెళ్లిందని తెలిసిందే. వెంటనే నేను ఆమె ఉన్న హోటల్‌కి వెళ్లి షూటింగ్‌ అని అబద్ధం చెప్పి ఏంజెలినా జోలీ ఉన్న రూమ్‌లోకి వెళ్లి.. ఆమె సేద తీరిన మంచంపై కూర్చొని వచ్చాను’

‘వెనిస్‌ అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారడం వల్ల ప్రతి ఇల్లు కూడా హోటల్‌గానో రెస్టారెంట్‌గానో మారిపోయింది. దాంతో స్థానికులకు ఇల్లు అద్దెకు దొరకడం కూడా కష్టంగా మారింది. దీంతో పర్యాటకాన్ని ఆపేయమని గతేడాది చాలామంది స్థానికులు గొడవలు కూడా చేశారు. ఎందుకంటే, ఒకప్పుడు 1.20 లక్షల జనాభా ఉన్న ఆ నగరం ఇప్పుడు 60 వేలకు దిగజారింది. అయితే, వెనిస్‌ రోజురోజుకీ నీటిలోకి మునిగిపోతుందని.. 2030 కల్లా అది ఒక దెయ్యాల నగరంగా మారుతుందని అందరూ చెప్పుకుంటున్నారు. అది నిజమో కాదో తెలీదు. కానీ వీలైతే మాత్రం వెనిస్‌ ఒక్కసారి వెళ్లి చూసి రండి. భూమ్మీద ఉన్న అందమైన నగరమదే’ అని పూరీ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని