
Puri Jagannadh: విజయ్ దేవరకొండతో పూరి ‘జనగణమన’?
హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు నటించిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ చిత్రాలు భారీ విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల కిందట వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రంగా ‘జనగణమన’ తెరకెక్కాల్సింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది. కానీ, కొన్ని కారణాల వల్ల మహేశ్‌బాబు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్‌తో ఈ సినిమా చేయాలని పూరి భావించినా.. అదీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి తన ఇతర సినిమాలపై ఫోకస్ పెట్టారు.
ఇప్పుడు మళ్లీ ‘జనగణమన’ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఈ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూరి.. విజయ్ దేవరకొండతో ‘లైగర్’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. మరోవైపు ‘జనగణమన’ స్క్రిప్టు సిద్ధంగా ఉండటంతో పూరి తనకు ఇష్టమైన ఈ ప్రాజెక్టును విజయ్‌తోనే తీయాలని నిర్ణయించుకున్నారట. ఇదే నిజమైతే వచ్చే నెలలోనే అమెరికాలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.