Vijay Devarakonda: ‘జనగణమన’ ప్రారంభం

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ - అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతున్న రెండో చిత్రం ‘జనగణమన’ మంగళవారం ముంబయిలో మొదలైంది. ఇటీవలే పూర్తయిన ‘లైగర్‌’ తర్వాత ఈ కలయికలో రూపొందుతున్న చిత్రమిది.

Updated : 30 Mar 2022 08:00 IST

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ - అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతున్న రెండో చిత్రం ‘జనగణమన’ మంగళవారం ముంబయిలో మొదలైంది. ఇటీవలే పూర్తయిన ‘లైగర్‌’ తర్వాత ఈ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఛార్మి, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జేజీఎం’ (జనగణమన) పేరుతో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. సినిమా ప్రారంభ కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ ఆర్మీ గెటప్‌తో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో విడుదల తేదీని ప్రకటించారు. 2023 ఆగస్టు 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రం గురించి పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘‘విజయ్‌ దేవరకొండతో మళ్లీ కలిసి పనిచేయడం గొప్పగా అనిపిస్తుంది. ‘జనగణమన’ ఒక బలమైన కథనం. ఒక మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. విజయ్‌ దేవరకొండ   మాట్లాడుతూ ‘‘ఈ కథ, స్క్రిప్ట్‌ చాలా ప్రత్యేకం. సవాల్‌తో కూడుకుని ఉంటుంది. ప్రతీ భారతీయుడి మనసునీ స్పృశిస్తుంది. పూరి జగన్నాథ్‌ కలల చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఇంతకుముందు చేయనటువంటి పాత్రని ఇందులో చేస్తున్నా. ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. శ్రీకర స్టూడియో పతాకంపై నిర్మాతగా ఈ సినిమాతో ప్రయాణం ప్రారంభించిన దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘ప్రతిష్ఠాత్మకంగా రూపొందే సినిమా ఇది. ప్రతీ భారతీయుడిని తట్టి లేపుతుందనే నమ్మకంతో ఉన్నాం. విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌లతో కలిసి పనిచేయడం ఆనందాన్నిస్తోంది’’ అన్నారు. ఏప్రిల్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో రామురావు, సింగారావు, ఛార్మి కౌర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని