Puri Musings: ఇది ప్రేమికుల కోసం.. ఇలాగే జీవితాలు నాశనం అయ్యాయి: పూరి జగన్నాథ్‌

Puri Musings: వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌ తాజాగా ‘లవ్‌ డ్రగ్‌’పై మాట్లాడారు.

Published : 22 Dec 2022 01:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రేమ అనేది ఒక డ్రగ్‌లాంటిదని, శరీరంలో కెమికల్స్‌ విడుదలవడం వల్ల మాత్రమే భావోద్వేగాలు కలుగుతాయని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అంటున్నారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘లవ్‌ డ్రగ్‌’ గురించి మాట్లాడారు. ‘‘ఇది ప్రేమలో మునిగి తేలుతున్న ప్రేమికులందరి కోసం.. రోజూ మనలో కలిగే రకరకాల ఎమోషన్స్‌, భావోద్వేగాలకు కారణం మన శరీరంలో ఉన్న కెమికల్స్‌. డోపమైన్‌, ఆక్సిటోసిన్‌, సెర్టోనియమ్‌.. వీటివల్ల నవ్వు, ఆనందం, ప్రేమ, కన్నీళ్లు ఇలా ఎన్నో ఫీలింగ్స్‌ ఉంటాయి. కానీ, వయసులో ఉన్న యూత్‌కు మాత్రం వాడి ప్రేమ నిజం అనుకుంటాడు. అద్భుతం అనుకుంటాడు. ఆ అమ్మాయి దేవత అనుకుంటాడు. పవిత్రమైన వాళ్ల ప్రేమను పెద్దవాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారని అనుకుంటాడు’’

‘‘డాక్టర్‌ హెలెన్‌ ఫిషర్‌ అనే ఆమె యువత ప్రేమపై రీసెర్చ్‌ చేసింది. ఎందుకు ప్రేమిస్తున్నారు? అతనే ఎందుకు? ఆమె ఎందుకు? ఇలా ఆరు పుస్తకాలు రాసింది. 2500మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసింది. వాళ్ల మెదళ్లను స్కాన్‌ చేసింది. ఎఫ్‌ఎంఆర్‌ఐ తీసింది. వాళ్ల పార్టనర్‌ ఫొటో చూపిస్తే, వాళ్ల బ్రెయిన్‌లో ఎలాంటి రియాక్షన్స్‌ వస్తున్నాయో రికార్డు చేసింది. కొంతమందికి వాళ్ల గర్ల్‌ఫ్రెండ్‌ కంటే ఇంకా అందమైన అమ్మాయి ఫొటో చూపించింది. అప్పుడు ఇంకా బెటర్‌ రియాక్షన్‌ మెదడులో కనిపించాయి. ఇంకొంతమందికి ఏ అమ్మాయి ఫొటో చూపించినా, ఒకేలా రియాక్ట్‌ అవుతున్నారని తెలిసింది. పరీక్షలు అన్నీ అయ్యాక ఆమెకు అర్థమైంది ఏంటంటే, ప్రేమ, దోమా ఏమీ లేదు.. ఇదంతా కెమికల్స్‌ మాయ. లవ్‌ ఒక డ్రగ్‌ అని తేలింది’’

‘‘ప్రేమించినప్పుడు హ్యాపీ కెమికల్స్‌ అన్నీ రిలీజ్‌ అవుతాయి. ముద్దు పెట్టినప్పుడు, డోపమైన్‌ రిలీజ్‌ అయి, ఆ ముద్దు చాలా బాగుంటుంది. అందుకే ఇంకో ముద్దు కావాలనిపిస్తుంది. అలా ముద్దులు కొనసాగుతూ ఉంటాయి. మీరేమనుకుంటారంటే.. ‘నా బంగారాన్ని ఎన్ని ముద్దులు పెట్టుకున్నా తనివి తీరదు ఏంటో’ అనుకుంటారు. లవ్‌ అనేది ఒక డ్రగ్‌. నువ్వు డ్రగ్‌ తీసుకున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. ప్రేమ అనే డ్రగ్‌లో ఉన్నప్పుడు నీ లవర్‌ కోసం అమ్మానాన్నలను, ఆస్తులను వదిలేసి పారిపోవాలనిపిస్తుంది. అందుకే ప్రామిస్‌ చేసేముందు కనీసం రెండుసార్లు మాస్ట్రుబేట్‌ చేసుకోండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడు కెమికల్స్‌ చల్లబడతాయి. అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. లేదంటే కెమికల్స్‌ ఉన్నన్ని రోజులు ‘పెళ్లి చేసుకో.. నింగి, నేలా తోడు ఉన్నాయ’ని ఏవేవో అబద్ధాలు మీతో చెప్పి, తప్పు చేయిస్తారు. పాతికేళ్ల వయసు దాటితే ఎంతో కొంత బుద్ధి, జ్ఞానం వస్తాయి. పాతికలోపు వాళ్లకు అసలు బుర్ర పనిచేయదు. ఒక పక్క కెమికల్స్‌ మనల్ని మోసం చేస్తుంటే, ఏదో ఒక లవ్‌స్టోరీ బ్లాక్‌బస్టర్ అవుతుంది. దాన్ని నాలుగు సార్లు చూడటం, అవే పాటలు పెట్టుకుని వింటూ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం.. ఇది జోక్‌ కాదు.. ఇలాగే ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి. దయ చేసి తప్పులు చేయకండి’’ అని పూరి జగన్నాథ్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని