వీటి వల్లే వ్యాధులు పెరిగిపోతున్నాయ్‌: పూరీ 

ఆహారాన్ని సహజంగా కాకుండా నిల్వ ఉంచి తీసుకోవడం వల్ల వ్యాధులు అధికమౌతున్నాయని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. ప్యాకెట్లు, టిన్నుల్లో ఉండే ఆహారానికి దూరంగా ఉండమని సూచించారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘ప్రాసెస్డ్‌ ఫుడ్‌’ గురించి మాట్లాడారు.....

Updated : 07 Dec 2020 15:47 IST

బ్యాక్టీరియా తినే ఫుడ్‌ మనం తిందాం

హైదరాబాద్‌: ఆహారాన్ని సహజంగా కాకుండా నిల్వ ఉంచి తీసుకోవడం వల్ల వ్యాధులు అధికమౌతున్నాయని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. ప్యాకెట్లు, టిన్నుల్లో ఉండే ఆహారానికి దూరంగా ఉండాలని సూచించారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘ప్రాసెస్డ్‌ ఫుడ్‌’ గురించి మాట్లాడారు.

‘ఒకప్పుడు మనం సముద్రంలో బతికేవాళ్లం. ఉభయచరంగా మారి.. భూమి మీద పాకుతూ.. క్రమంగా మనుషులమయ్యాం. అలా సముద్రానికి, ఉప్పుకు దూరమయ్యాం. రోజూ వేటాడటం కష్టం కాబట్టి వ్యవసాయం మొదలెట్టాం. పాలు, మాంసం కోసం జంతువుల్ని పెంచుతున్నాం’.

‘ఆ తర్వాత ఆహారం నిల్వ కోసం ప్రాసెస్డ్‌ ఫుడ్‌ మొదలెట్టాం. చేపలు, మాంసం, కూరగాయలు ఎండబెట్టాం. వీటికి ఉప్పు, నూనె కలిపితే బ్యాక్టీరియా రాదని కనిపెట్టి పచ్చళ్లు చేస్తున్నాం. ఆ తర్వాత వేపుడు, చెకోడీలు, పకోడీలు, అప్పడాలు.. ఇలా ఎన్నో. స్వీట్లు, జామ్‌లు కూడా తయారు చేశాం. విత్తనాల్ని పొడిచేసి, దాచుకోవడం మొదలెట్టాం. ప్రాసెస్డ్‌ అంటే.. సహజంగా ఉన్న ఆహారాన్ని మనం ఇంకో రూపంలోకి తీసుకొచ్చి అసహజంగా తయారు చేయడం’.

‘ఇలాంటి ఆహారాన్ని మన శరీరం తేలిగ్గా భరించలేదు. ఎందుకంటే వీటిని తినడానికి తగ్గట్టుగా మన శరీరాన్ని తయారు చేయలేదు. మనం ఒక్కసారిగా ఆహారాన్ని మార్చేశాం. కానీ మన శరీర నిర్మాణం, జీర్ణవ్యవస్థ మారలేదు. అందుకే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తిన్నప్పుడు మన శరీరం దాన్ని ఆహారం అనుకోదు. వేరే ఏదో పదార్థం వచ్చింది, అయినా ప్రయత్నిద్దాంలే.. అనుకుంటుంది. రెండు లక్షల సంవత్సరాలుగా మన శరీరానికి చెరకు గడ తినడమే తెలుసు. ఆరడుగల చెరకు గడ తింటే రెండు స్పూన్ల చక్కెర వస్తుందని మాత్రమే తెలుసు. మనం షుగర్‌ ఫ్యాక్టరీ పెట్టి, రెండు చెంచాల చక్కెరను ఒకేసారి లోపల వేస్తున్నాం. శరీరం కంగారు పడుతుంది. సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ నాలుగు చెంచాలు వేస్తే శరీరానికి భయం. ఎందుకంటే మనం విత్తనాల నుంచి ఆయిల్‌ తీస్తున్నామని, ఫ్యాక్టరీలు పెట్టామని దానికి తెలియదు. ఇది సహజమైన ఆహారం కాదనుకుంటుంది. ఆలూ చిప్స్‌ తిన్నా అంతే.. దానికి అర్థం కాకపోయినా ఏదో ప్రయత్నిస్తుంటుంది పాపం’

‘ఇలా శరీరాన్ని తికమకపెట్టే ఆహారాన్ని మనం ఎక్కువగా కనిపెడుతున్నాం. వీటి వల్లా డయాబెటిక్స్‌, మెటబాలిక్‌ సిండ్రోమ్‌, హైపర్‌ టెన్షన్‌ వంటివి పెరిగిపోయాయి. అందుకే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఎంత తక్కువ తింటే అంత మంచిది. సింపుల్‌ రూల్‌ ఏంటంటే.. త్వరగా పాడైపోయే ఆహారం మంచిది. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోతే ఇది పాడైపోద్ది అనుకుంటే అది మంచి ఆహారం. ఈ ఫుడ్‌ బయటున్నా పాడు కాదంటే అది చెడ్డది. ఆహారం పాడైపోయిందంటే.. బ్యాక్టీరియా తినడం మొదలు పెట్టిందని అర్థం. జెంతికలు, చెకోడీలు, పచ్చళ్ల వైపు బ్యాక్టీరియా కన్నెత్తి కూడా చూడదు. బ్యాక్టీరియానే వద్దు అనుకున్న ఆహారం మనకు ఎందుకు? బ్యాక్టీరియా ఏం తింటే మనం కూడా అదే తిందాం..’ అని పూరీ తన స్టైల్‌లో వివరించారు.
ఇవీ చదవండి..
జర్నలిస్టు ఇంటికెళ్లి.. హామీ ఇచ్చిన చిరు
ప్రభాస్‌ చిత్రంపై కామెంట్‌.. చిక్కుల్లో నటుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని