Puri Jagannadh: ప్రభుత్వం వారికి రాయితీలు ఇవ్వాలి..: పూరి

‘పూరి మ్యూజింగ్స్‌’ వేదికగా మరోసారి నెటిజన్లను అలరిస్తున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. తాజాగా ఆయన ‘గుడ్‌ సిటిజన్‌’ అనే అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Updated : 12 Dec 2022 18:44 IST

హైదరాబాద్‌: సమాజంలో మంచిని పెంచడం కోసం ప్రభుత్వం గుడ్‌ సిటిజన్‌షిప్‌ కార్డులను విడుదల చేయాలని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కోరారు. సమాజ సేవ కోసం పాటుపడుతోన్న వారిని గుర్తించి.. వారికి ఈ కార్డులు అందించాలన్నారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ (Puri Musings) వేదికగా.. ‘గుడ్‌ సిటిజన్‌’ (Good Citizen) అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘‘మనదేశంలో మంచివాళ్లను, క్రమశిక్షణ కలిగిన వారిని ప్రభుత్వం గుర్తించాలి. అలాంటి వారికి చేయూతనందించి ప్రోత్సహించాలి. సమాజం కోసం నిస్వార్థంగా పనిచేస్తోన్న వారికి గుడ్‌ సిటిజన్‌ అనే కార్డు అందించాలి. ప్రభుత్వం అన్నివిధాలుగా వారికి అండగా నిలవాలి. ఎందుకంటే, ఎంతో మంది మనుషులు ఏమీ ఆశించకుండా స్వచ్ఛంద సంస్థలు, అనాథ శరణాలయాలు నడుపుతున్నారు. కష్టపడి.. నిధులు సమకూర్చి.. చేతనైనంత సాయం చేస్తున్నారు. అలాంటి వారందరికీ సమాజంలో ఒక  గౌరవం ఉండాలి. వాళ్ల పిల్లలకు విద్య, ఉద్యోగంలో రిజర్వేషన్లు కల్పించాలి. ఒక మనిషి చేసే త్యాగానికి ప్రతిఫలం స్వర్గంలో కాదు.. ఇక్కడే మన భారతదేశంలోనే దొరకాలి. సరుకులు, రైలు, బస్సు టికెట్లు అన్నింటిలో రాయితీలు ఇవ్వాలి. గుడ్‌ సిటిజన్‌ అయితే ఇన్ని ఉపయోగాలున్నాయి అనుకొని మరింత మంది మంచి పౌరులుగా మారతారు. మంచిని ప్రోత్సహించాలంటే మంచివాళ్లను గౌరవించాలి. అప్పుడే ముందు తరాలు మారతాయి. ఇలాంటివి చేయడానికి రూ.వేల కోట్ల నిధులు అవసరం లేదు. గుడ్‌ సిటిజన్‌ కార్డులు విడుదల చేసి.. కొన్ని సౌకర్యాలు కల్పిస్తే చాలు. ఏదో ఒకరోజు ఏదో ఒక ప్రభుత్వం ఇలాంటి మంచి పని చేస్తుందని నా కోరిక’’ అని పూరి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని