Puri Musings: 60కే రిటైర్మెంటా.. చెప్పిందెవరు?

సాధారణంగా ఒక మనిషికి అరవై సంవత్సరాలు వస్తే.. అతనికి పదవీ విరమణ వయసు వచ్చిందని అందరూ చెప్పుకుంటారు. కానీ 60 ఏళ్ల వయసు నుంచి ఒక మనిషి జీవితంలో సరికొత్త అంకం ప్రారంభం అవుతుందని పూరీ జగన్నాథ్‌ అంటున్నారు.

Updated : 19 Jun 2021 13:27 IST

జీవితాన్ని బ్లాక్‌బస్టర్‌ చేసుకో అంటోన్న పూరీ

హైదరాబాద్‌: సాధారణంగా ఒక మనిషికి అరవై సంవత్సరాలు వస్తే.. అతనికి పదవీ విరమణ వయసు వచ్చిందని అందరూ చెప్పుకుంటారు. కానీ 60 ఏళ్ల వయసు నుంచి ఒక మనిషి జీవితంలో సరికొత్త అంకం ప్రారంభం అవుతుందని పూరీ జగన్నాథ్‌ అంటున్నారు. ఒక మనిషి తన మలిదశలో ఎవరిపై ఆధారపడకుండా జీవించినప్పుడే అతని జీవితం బ్లాక్‌బస్టర్‌ అవుతుందని పూరీ వివరించారు. ‘లైఫ్‌ ఆంథెమ్‌’ అనే అంశంపై తాజాగా పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన ఏం చెప్పారంటే..

‘ఒక్కటే జీవితం.. ఒక్కసారే బతుకుతాం. ఈ జీవితం నీది. ఎవరూ నీ కోసం పుట్టలేదు. నువ్వు ఎవ్వరి కోసం పుట్టలేదు. ఏం చేసినా నీ కోసమే చెయ్‌.. నచ్చిందే చెయ్‌.. నీకు నచ్చినట్టుగా ఉండు. మన బతుకే మూణ్నాళ్ల ముచ్చట. దానికి 16 రోజుల పెళ్లెందుకు? బానిస బతుకెందుకు? జీవితం అంటే నదిలో కొట్టుకుపోవడం కాదు. జీవితంలో పెళ్లి అనే ఒక్క తప్పు చేస్తే ఎన్ని ఫిలాసఫీలు చదివినా ఉపయోగం లేదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో. ఎవ్వరికీ మాట ఇవ్వకు. నీకంటూ ఒక ప్రపంచం సృష్టించుకో. దేనికీ భయపడకు. శాంతంగా ఉండడం నేర్చుకో’

‘నువ్వు ప్రత్యేకంగా దేశానికి సాయం చేయాల్సిన అవసరం లేదు. పదిమందికి నీ చేతితో తిండిపెట్టు. సమాజాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు. పనిచేసుకో.. వచ్చినదాన్ని దాచుకో.. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో.. వయసు మీద పడుతుందని ఆలోచించవద్దు. 60 ఏళ్లు అంటే రిటైర్‌మెంట్‌ అని ఎవర్రా చెప్పారు? కొత్త జీవితం ప్రారంభం కావడానికి అదే ఆరంభం. బుద్ధి, జ్ఞానం వచ్చే వయసు అది. నీకున్న అనుభవంతో జూనియర్స్‌లో స్ఫూర్తి నింపు. వాళ్లతో కలిసి సరదాగా బయటకు వెళ్లు. ఎంజాయ్‌ చెయ్‌. 70 లేదా 80 ఏళ్లు వచ్చినా సరే, నీ పనులు నువ్వు చేసుకోగలిగితే చాలు. ఎందుకంటే క్లైమాక్స్‌ బాగుంటేనే సినిమా సూపర్ హిట్‌ అవుతుంది. మేక్‌ యువర్‌ లైఫ్‌ ఏ బ్లాక్‌బస్టర్‌. ఇది ఫిలాసఫీ కాదు.. కామన్‌సెన్స్‌. దీనినే నీ లైఫ్‌ ఆంథెమ్‌గా మార్చుకో’ అని పూరీ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని