Puri Musings: మానవజాతిని కాపాడాలంటే.. ఇదొక్కటి చేయండి చాలు: పూరి జగన్నాథ్‌

మరో 50ఏళ్ల తర్వాత ప్రపంచం దారుణంగా ఉంటుందని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అభిప్రాయపడ్డారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో ఆయన మరో స్పెషల్‌ వీడియోను పంచుకున్నారు.

Updated : 27 Dec 2022 14:53 IST

హైదరాబాద్‌: జనాభా నియంత్రణ విషయంలో ఇప్పటికైనా అందరూ మేల్కొనాలని, లేకపోతే భవిష్యత్‌ అంధకారం అవుతుందని సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌  (Puri Jagannadh) అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ (Puri Musings)పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘స్టాప్‌ హ్యూమన్స్‌’ అనే అంశంపై మాట్లాడారు.

‘‘మనిషి పుట్టి, ఇప్పటికి రెండు లక్షల సంవత్సరాలు అయింది. మానవజాతి పెరుగుతూ వచ్చి, 8 బిలియన్లు దాటింది. రోజూ 4లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. బర్త్‌రేట్‌తో డెత్‌రేట్‌ సమానంగా లేదు. చావులు తక్కువ. పుట్టుకలు ఎక్కువైపోయాయి. మనుషుల వల్ల సగం ప్రకృతి నాశనం అయిపోయింది. అడవులన్నీ మంటగలిసిపోయాయి. మనం తిండి కోసం ఏటా 80 బిలియన్‌ జంతువులను చంపుతున్నాం (ఇందులో కోళ్లను మినహాయిస్తే..). 1970 తర్వాత 60శాతం జంతువులు అంతరించిపోయాయి. మనం వేటినీ బతకనీయడం లేదు. అన్నీ అంతరించిపోతున్నాయి. దీనికి తోడు అందరం పిల్లల్ని పుట్టించడంలో బిజీగా ఉన్నాం. చాలా తప్పు. మానవజాతి ఆగాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. ఆగకపోతే, మనం ఆపలేం. 1971లో లెస్‌యునైట్‌ అనే సామాజిక ఉద్యమకారుడు వాలంటరీ హ్యూమన్‌ ఎక్సిటిన్షన్‌ ఉద్యమాన్ని మొదలు పెట్టాడు. ఈ భూగ్రహాన్ని కాపాడాలంటే, మానవ జాతి అంతరించిపోవాలి. అదొక్కటే సమాధానం. ఇదొక ఉద్యమం’’

‘‘ఆ ఉద్యమంలో పాల్గొనాలంటే మనం ఆత్మహత్య చేసుకోనవసరం లేదు. కనీసం పెళ్లిళ్లు చేసుకోవడం మానేయాలి. ఒకవేళ పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కనడం మానేయాలి. నా పిల్లలు, నా వంశం అనే ఆలోచనల నుంచి బయట పడాలి. ఇలాంటి ఆలోచన రావాలంటే, ఈ ప్లానెట్‌ను ప్రేమించేంత పెద్ద మనసు ఉండాలి. మీరే వాలంటరీగా మీ వంశాన్ని ఆపాలి. మీ జాతిని ఆపాలి. మీది బ్లూ బ్లడ్‌ అయినా సరే, మీ పిల్లల్ని ఆపాలి. పిల్లల్ని కనడం ఆపకపోతే, కొన్నాళ్లకు ఈ భూగ్రహం మనుషులతో నిండిపోతుంది. వేరే జంతువులు, పక్షులు, చెట్లు ఉండవు.  ఈ మధ్య చాలా మంది ఆడవాళ్లు.. తమ అండాలను భద్రపరచుకోవడం మొదలు పెట్టారు. అసలు మీ అండాలు ఎందుకు దాచుకోవాలి. భవిష్యత్‌లో పిల్లల కోసమా? భవిష్యత్‌ చాలా దారుణంగా ఉండబోతోన్న నేపథ్యంలో అందులో మీ పిల్లలు ఎందుకు? మీ సరదా కోసం పిల్లల్ని కని, పెంచి కొన్నాళ్లకు చచ్చిపోతావు. కానీ, అతి దారుణమైన వాతావరణంలో మీ డీఎన్‌ఏకు పుట్టిన మీ వారసులను వదిలి వెళ్తున్నారని గుర్తు పెట్టుకోండి’’

‘‘50ఏళ్ల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి. గ్లోబల్‌ వార్మింగ్‌ పెరిగి, వాతావరణం ఇంకా వేడెక్కుతుంది. గ్లేసియర్స్‌ మాయమైపోతాయి. సముద్రాలు యాసిడ్‌లా మారతాయి. 70శాతం హిమాలయాలు కరిగిపోతాయి. ప్రపంచ జనాభా మరో 10 బిలియన్లు పెరుగుతుంది. సహజ వనరులు ఉండవు. తినడానికి తిండి ఉండదు. సరిపడా ఆక్సిజన్‌ ఉండదు. ఇవి కాకుండా హెపటైటిస్‌ ఏ, హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, మలేరియా, డెంగ్యూ, ఎయిడ్స్‌, ఎబోలా, హెర్పస్‌, ఇన్‌ఫ్లూయాంజా, చికెన్‌పాక్స్‌, కరోనా వైరస్‌ దాని రకాలు ఉన్నాయి. ఈ లెక్కన అప్పటికి ఎన్ని వైరస్‌లు వస్తాయో లెక్క పెట్టండి. దయ చేసి, మీ అండాలను భద్రపరచకండి.  ఉన్న పిల్లలు చాలు. మనందరం స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో చేరి, పునరుత్పత్తిని ఆపగలిగితే, 200 ఏళ్ల వరకూ మానవ మనుగడ సాగుతుంది. అప్పుడు ఈ ప్లానెట్‌ పచ్చగా ఉంటుంది. వాలంటరీ హ్యూమన్‌ ఎక్సిటిన్షన్‌ అనేది అద్భుతమైన ఆలోచన’’ అని పూరి జగన్నాథ్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని