Published : 17 Jan 2022 01:26 IST

Puri Musings: ఆ మాట విన్న తర్వాత మీకు కన్నీళ్లు వస్తాయి: పూరి జగన్నాథ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: విపశ్యన (Vipassana) అనేది పురాతన ధ్యాన పద్ధతి అని, 2500 ఏళ్ల క్రితం బుద్ధ భగవానుడు దీన్ని కనిపెట్టినట్టు ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్‌ చెప్పుకొచ్చారు. వివిధ అంశాలను విశ్లేషిస్తూ వాటిపై తన అభిప్రాయాలను అభిమానులు, ఫాలోవర్స్‌తో ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో పంచుకుంటారాయన. కొన్ని రోజుల కిందట విరామం ఇచ్చిన పురి జగన్నాథ్‌.. తాజాగా కొత్త విషయాలను చెబుతున్నారు. ఇందులో భాగంగా విపశ్యన ధ్యాన కేంద్రం గురించి వివరించారు. 

‘‘మనకు చాలా విపశ్యన(Vipassana) కేంద్రాలు ఉన్నాయి. పచ్చని చెట్లతో ఒక పాజిటివ్‌ ఎన్విరాన్‌మెంట్‌తో ఉంటాయి. ఎత్తైన గోడలతో ఉంటాయి. విపశ్యన రెండు రకాలుగా ఉంటుంది. ఏకాగ్రత. మనః పరిశీలన. విపశ్యన సమయంలో మిమ్మల్ని ఒక సమయంలో కూర్చోబెట్టి, శ్వాసమీద ధ్యాస పెట్టమని అడుగుతారు. ఇది పదిరోజుల కోర్సు. మీ దగ్గర మొబైల్స్‌, పుస్తకాలు ఏవి ఉన్నా తీసుకుంటారు. ఆ క్షణం నుంచి మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. అక్కడ ఎంతమంది ఉన్నా, వాళ్లతో సైగల ద్వారానే సమాధానం చెప్పాలి. ఇది అతి పురాతన బౌద్ధ ధ్యాన ప్రక్రియ. ఎవరి గది వాళ్లకు ఇస్తారు. అందులో టీవీ ఉండదు. ఉదయం 4గంటలకు నిద్రలేపుతారు. 4.30 నుంచి 6.30 వరకూ మెడిటేషన్‌ చేయమంటారు. అల్పాహారం తీసుకోగానే, మళ్లీ మధ్యాహ్నం వరకూ మెడిటేషన్‌ చేయిస్తారు. ప్రతి గంటకూ ఒక తరగతి ఉంటుంది. గదిలో స్పీకర్లు ఉంటాయి. అందులో నుంచి వచ్చే సూచనలు పాటిస్తూ, వాళ్లు చెప్పింది చేయడమే. చక్కటి వెజిటేరియన్‌ ఆహారం పెట్టి, రాత్రి 9.30గంటలకు లైట్లు ఆర్పేస్తారు. రోజుకు 10గంటలు మెడిటేషన్‌. మొదటి రెండు రోజులు మెంటల్‌ వస్తుంది. చొక్కాలు చింపుకొంటారు. పారిపోవాలని చూస్తారు. గేట్లు లాక్‌ చేసి ఉంటాయి. గోడదూకి పారిపోవాలని చూస్తుంటారు. అందుకే అక్కడ అంత ఎత్తైన గోడలు కడతారు. కొంతమంది తలుపులు తీయమని అరుస్తారు. అయినా వాళ్లు వినరు. ‘సైలెన్స్‌’ అని చీటీ మీద రాసి చూపిస్తారు. మీకు జైల్లో పెట్టినట్లు ఉంటుంది. కానీ, మూడో రోజు నుంచి మీకు మెల్లగా అలవాటైపోతుంది. ఆ తర్వాత మెడిటేషన్‌లో కూర్చొంటే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కాదు, మీ ఒంట్లో నరనరాల్లో ప్రవహించే రక్తం శబ్దం కూడా వినిపిస్తుంది. ఎప్పుడూ ప్రకృతిలో వినపడని శబ్దాలు వినిపిస్తాయి’’

‘‘చిన్న చిన్న కీటకాలు చేసే శబ్దాలు వినిపిస్తాయి. రోజూ వాగుతూ ఉండే మనలో నాన్సెన్‌ తగ్గుతుంది. మాట్లాడటం మానేస్తే, ఎన్ని దరిద్రాలు తగ్గుతాయో మీకు అర్థమవుతుంది. మీలో డిప్రెషన్‌, యాంగ్జైటీ తగ్గుతుంది. ప్రశాంతత అలవాటవుతుంది. అదో అద్భుతమైన అనుభూతి. పది రోజుల తర్వాత మీ వస్తువులు, బట్టలు మీకు ఇచ్చేస్తూ అక్కడ ఉన్న టీచర్‌ మీకు థ్యాంక్స్‌ చెబుతారు. ఎన్నో రోజుల తర్వాత మీరు విన్న మొదటి మాట అది. ఆ మాట విన్న తర్వాత కృతజ్ఞతాభావంతో మీ కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. ఇంతకుముందులా బయట ట్రాఫిక్‌ శబ్దాలు వింటే మీకు నచ్చదు. ఇన్నాళ్లూ ఎంత శబ్ద కాలుష్యంలో బతుకుతున్నామో అర్థమవుతుంది. ఆ రోజు నుంచి అనవసరంగా ఏమీ మాట్లాడరు. అవసరమైందే మాట్లాడతారు. ఒక దైవత్వం ఫీలవుతారు. ఇంటికి వచ్చాక రోజుకు గంటసేపైనా మెడిటేషన్‌ చేయాలనిపిస్తుంది. ఆ గంట కాస్తా అరగంట అవుతుంది. చివరకు ఆ అరగంట కూడా మాయమైపోతుంది. ఆ తర్వాత విపశ్యన గుర్తుండదు.. బుద్ధుడు గుర్తు ఉండడు. అన్నీ మర్చిపోతారు. జన జీవన స్రవంతిలో కలిసిపోతారు. మనలాంటి ఈ మామూలు మనుషులకు విపశ్యన పెట్టారు. ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ సెంటర్లు నడుపుతున్నారు. వాళ్లు ఫీజు తీసుకోరు. పది రోజుల కోర్సు పూర్తయిన తర్వాత మీకు ఎంత తోస్తే అంత ఇవ్వవచ్చు. మీరు ఇవ్వకపోయినా, ఇవ్వలేకపోయినా వాళ్లు ఏమీ అనుకోరు. పది రోజుల కోర్సు చేయడమే మీకు అంత కష్టంగా ఉంటే,  జీవితాంతం అక్కడే ఉండి పనిచేసే టీచర్లు, స్టాఫ్‌కు చేతులెత్తి మొక్కాలి. అక్కడ ఎంతో మంది జీతం లేకుండా పనిచేస్తుంటారు. వాళ్లు నిజమైన సాధువులు. విపశ్యన అనేది మత కేంద్రం కాదు. వాళ్లేమీ బోధించరు. మీతో మిమ్మల్ని కూర్చోబెడతారు’’ అని పూరి జగన్నాథ్‌ చెప్పుకొచ్చారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని