Puri Musings: తాగుబోతులు, తిరుగుబోతులు, ఆశబోతులు కలిసే జంక్షన్‌ అదే!

వివిధ అంశాలపై ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న పూరి జగన్నాథ్‌‘స్పిరిట్యువల్ ప్రాసెస్‌’పై మాట్లాడారు.

Published : 05 Mar 2023 01:36 IST

హైదరాబాద్‌: తాగుబోతులు, తిరుగుబోతులు, ఆశబోతులు, పొగరుబోతులు అందరూ కలిసేది ఒకే ఒక జంక్షన్‌ ‘విరక్తి’ అని సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. వివిధ అంశాలపై ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘స్పిరిట్యువల్ ప్రాసెస్‌’ అనే అంశంపై మాట్లాడారు.

‘‘ఎవరినో ప్రేమిస్తాం.. వాళ్లు మోసం చేస్తారు.. వెక్కి వెక్కి ఏడుస్తాం. రాత్రి పగలూ ఏడుస్తాం. మీరు గానీ, అలా ఏడుస్తుంటే కంగ్రాట్స్‌.. మీరు క్యూలో ఉన్నారు. రాత్రి పగలూ కునుకు లేకుండా కష్టపడుతున్నారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. కుటుంబం పరువు కాపాడాలి. కోట్లు కోట్లు సంపాదించాలి. మీరు ఇలా ఉంటే, వెరీ గుడ్‌.. మీరు చేయని అరాచకం లేదు. చేయని మోసం లేదు. ఎలాగైనా పదవికి కావాలి. దాని కోసం ఎంతమందిని అయినా నరుకుతా. అనుకుంటే మీరు సరైన దారిలో పయనిస్తున్నారని అర్థం... ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నారని అర్థం. ఎంత కామిస్తారో కామించండి. రమిస్తారో రమించండి.. ఎంత తాగుతారో తాగండి. మద్యం మీద విరక్తి కలిగేలా తాగండి. మీరు సరైన దారిలో ఉన్నారు’’

‘‘ప్రేమిస్తూ అలసిపోండి.. పనిచేస్తూ నలిగిపోండి.. దొంగతనాలు చేస్తూ తిరగండి.. అందరినీ హింసించండి. ప్రజా సేవలో కరిగిపోండి. జీవితాంతం ఏ దైవ సేవలోనో గడపండి.. ఏం చేసినా ఆఖరి రోజుల్లో ‘అనవసరంగా ఇవ్వన్నీ చేశాను’ అనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ కొన్ని అర్థమవుతాయి. నరాల బలహీనమైన తర్వాత, కూలబడ్డాక ఇంకొన్ని అర్థమవుతాయి. చివరికి తాగుబోతులు, తిరుగుబోతులు, ఆశబోతులు, పొగరుబోతులు అందరూ కలిసేది ఒకే ఒక జంక్షన్‌లో దాని పేరు ‘విరక్తి’. ఆ తర్వాత వచ్చేది వైరాగ్యం. వయసులో ఉన్న కుర్రాడు అర్ధరాత్రి గోడదూకి, రోడ్డుపైన ఎవరితోనే గొడవపడి పోలీసులు అరెస్ట్‌ చేస్తే, నాలుగు లాఠీ దెబ్బలు పడ్డాక, మీరు ‘ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు’ అని ఆ కుర్రాళ్లకు చెప్పండి. ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడానికే ఇక్కడ మనందరం పుట్టాం.. కొంచెం త్వరగా వెళితే మంచిది’’ అని పూరీ చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని