Puri Musings: ఆ దేశాల్లో పుడితే ఆందోళ‌న ఉండ‌దు

కామ‌న్‌వెల్త్ దేశాల్లో పుట్టినా, అక్క‌డి సిటిజ‌న్‌షిప్ ఉన్నా పిల్ల‌లు, ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన ఉండ‌ద‌ని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు.

Published : 29 May 2021 09:30 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: కామ‌న్‌వెల్త్ దేశాల్లో పుట్టినా.. అక్క‌డి సిటిజ‌న్‌షిప్ ఉన్నా.. పిల్ల‌లు, ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన ఉండ‌ద‌ని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. పూరీ మ్యూజింగ్స్‌ వేదికగా తాజాగా ఆయన ‘నేష‌నల్ హెల్త్‌కేర్ సిస్ట‌మ్’ గురించి ముచ్చటించారు. ఆ విష‌యాలు ఆయ‌న మాటల్లోనే... ‘మ‌నంద‌రం రాత్రి, ప‌గ‌లు క‌ష్ట‌ప‌డి ఆస్తులు కూడ‌బెట్టేది పిల్లల చ‌దువుల కోసం. అనారోగ్య స‌మ‌స్య‌లకి, సొంత ఇంటికి, వృద్ధాప్యం కోసం దాచుకుంటాం. అయితే వీట‌న్నిటి కోసం ఎంత డ‌బ్బు కావాలో తెలీదు. దాని ప‌రిమితీ మ‌న‌కు తెలియ‌దు. యూరప్‌, కెన‌డా, ఆస్ట్రేలియా త‌దితర కామ‌న్‌వెల్త్‌ దేశాల్లో సిస్ట‌మ్ ఎలా ఉంటుందంటే.. పిల్ల‌లంద‌రికీ బేసిక్ ఎడ్యుకేష‌న్ ఉచితం. పై చ‌దువులు చ‌ద‌వాలంటే ప్ర‌భుత్వం నుంచి లోన్ తీసుకుని, ఉద్యోగం వ‌చ్చాక మెల్ల‌గా తీర్చాలి. స్కాట్లాండ్లో అయితే ఎంత చ‌దివినా, ఎన్నేళ్లు చ‌దివినా అది పూర్తిగా ఉచిత‌మే’. 

ఆరోగ్య బీమా విష‌యానికొస్తే ఆయా దేశాల్లో నేష‌న‌ల్ హెల్త్ కేర్ సిస్ట‌మ్.. ఇది ప్ర‌పంచ‌లోనే నంబ‌రు 1. ప్రతి సిటిజ‌న్‌కి ప్రైమ‌రీ కేర్ ఫిజిషియ‌న్ ఉంటాడు. త‌న‌కి రోగి గురించి అంతా తెలుసు. మన హెల్త్ రికార్డు అత‌డి ద‌గ్గ‌ర ఉంటుంది. ఒకవేళ వేరే ఊరిలో ఉండి ఆసుపత్రిలో చేరితే మీ ప్రైమ‌రీ డాక్ట‌ర్ నుంచి రిపోర్టు తీసుకుని వాళ్లే చికిత్స అందిస్తారు. నీ గురించి నువ్వు వాళ్ల‌కి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక‌వేళ కాలు విరిగితే అందులో చికిత్స ఉచితం. అంతేకాదు ఉద‌య‌మే 5 స్టార్ మెనూ కార్డు ఇస్తారు. ఏం కావాలంటే అది ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు. అదీ ఉచిత‌మే. డిశ్చార్జ్ అయ్యాక కూడా ఓ బృందాన్ని పంపిస్తారు. వాళ్లే వండిపెడ‌తారు. మందులు సరిగా వేసుకుంటున్నావో లేదో చూస్తారు. వారానికోసారి షాపింగ్ కూడా చేసి పెడ‌తారు. జీవితాంతం బెడ్ మీదే ఉండాల్సిన ప‌రిస్థితి వ‌స్తే నెల‌కు రూ.3 లక్ష‌లు ఖ‌ర్చు పెడతారు. చివ‌రి వ‌ర‌కు చూసుకుంటారు. దాన్ని రెసిడెన్షియ‌ల్ కేర్ అంటారు. ఒక సిటిజ‌న్ హెల్త్ కేర్ కోసం ప్ర‌భుత్వం ఎన్ని కోట్లైనా ఖ‌ర్చుపెడుతుంది. ఈ దేశాల్లో పుట్టినా అక్క‌డి సిటిజ‌న్ షిప్ ఉన్నా పిల్ల‌లు, ఆరోగ్యం గురించి ఆందోళ‌న ఉండ‌దు. భ‌విష్య‌త్‌ మీద భ‌యంతో ర‌క‌ర‌కాల త‌ప్పులు చేస్తూ డ‌బ్బు సంపాదించే అవ‌స‌రం కూడా ఉండ‌దు. మ‌న‌శ్శాంతిగా బ‌త‌కొచ్చు. అలాంటి హెల్త్ కేర్ సిస్ట‌మ్ మ‌న ఇండియాలో కూడా రావాల‌ని కోరుకుందాం’ అని అన్నారు పూరీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని