Puri Musings: జీవితంలో సగం గొడవలకు కారణం అదే: పూరీ జగన్నాథ్‌

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ‘మ్యూజింగ్స్‌’ను మళ్లీ ప్రారంభించారు. ‘తడ్కా’ అనే కొత్త పాడ్‌కాస్ట్‌ను వినిపించారు.

Published : 10 Dec 2022 10:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పూరీ మ్యూజింగ్స్‌’ (Puri Musings) పాడ్‌కాస్ట్‌లకు కొంతకాలం విరామం ఇచ్చిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నో విభిన్న కాన్సెప్ట్‌లను ప్రేక్షకులకు వినిపించిన ఆయన ఈసారి ‘తడ్కా’ (Tadka) గురించి చెప్పారు. తడ్కా అంటే తాలింపు కాబట్టి వంటల సబ్జెక్ట్‌ ఎంపిక చేసుకున్నారనుకుంటే పొరపాటే. మరి, పూరీ చెప్పిన ఆ తాలింపు వివరాలేంటో చదివేయండి..

‘‘మనం అప్పుడప్పుడు ఏదైనా పనికోసం ఓ మనిషిని మరో మనిషి దగ్గరకు పంపిస్తాం. అవతలి వ్యక్తి ఏమన్నాడనేది  తప్ప మిగిలినవ్నీ చెబుతాడు మనం వెళ్లమని చెప్పిన వ్యక్తి. ఏం జరిగింది? అని అడిగితే.. ‘మంచి రోజులుకావు. నువ్వు ఎంత మంచి చేసినా ఫలితం ఉండదు. అతడు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. డబ్బు ఎక్కువవ్వడం వల్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. నేను కాబట్టి ఊరుకున్నా. వాడి మాటలు వింటే నువ్వు కొడతావ్‌’ అని మనం పంపించిన మనిషి సమాధానం ఇస్తాడు. ఇదంతా కాదు ఆయన ఏమన్నాడో చెప్పు అని గట్టిగా అడిగితే.. ‘డబ్బులిచ్చి పట్టుకెళ్లమన్నాడు’ అని బదులిస్తాడు. అక్కడ పెనంలో ఉన్న దాన్ని ఇక్కడకి తీసుకొచ్చేలోపు మనుషులు తాలింపు వేసి తీసుకొస్తారు. తాలింపు అంటే తడ్కా. జీవితంలో సగం గొడవలు దీనివల్లే వస్తాయి. మధ్యవర్తులు జరిగింది చెబుతున్నారా? వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? అనే దాన్ని గ్రహించాలి. మధ్యవర్తులంటే ఎవరో కాదు మనమే’’

‘‘ప్రతి ఒక్కరూ తడ్కా స్పెషలిస్టే. తడ్కా లేకుండా ఎవరూ మన దగ్గరకు ఏ వంటకాన్నీ తీసుకురారు. మనమంతా పుట్టుకతోనే మంచిగా వండడం నేర్చుకున్నాం. అలవోకగా తడ్కా పెట్టేస్తాం. ఐదుసార్లు తాలింపు వేయడం అయ్యాక మరో వ్యక్తి జీడిపప్పు వేసి అరటి ఆకులో పొట్లం కట్టి తీసుకొస్తాడు. వాసన చూసి బాగుంది అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. అందుకే ఎప్పుడైనా జరిగిందే చెప్పాలి. అడిగితే మీ అభిప్రాయాన్ని చెప్పండి.. లేదంటే మానేయండి. ఇప్పుడు మనం ఎంత స్మార్ట్‌గా ఉంటున్నామో తడ్కా అలానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. దయచేసి తడ్కా తగ్గిద్దాం’’ అని పూరీ జగన్నాథ్‌ విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు