Bushcraft.. అంత ఈజీ కాదు

మనకున్న జీవన నైపుణ్యాలు తెలుసుకోవడం కోసం.. మనకి మనమే ఒక పరీక్ష పెట్టుకుని ఒంటరిగా బయలుదేరి వెళ్లి అడవిలో బతకడాన్నే బుష్‌క్రాఫ్ట్‌ అంటారని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు....

Updated : 12 May 2021 21:05 IST

పూరీజగన్నాథ్‌ ఏం చెప్పారంటే

హైదరాబాద్‌: మనకున్న జీవన నైపుణ్యాలు తెలుసుకోవడం కోసం.. మనకి మనమే ఒక పరీక్ష పెట్టుకుని ఒంటరిగా బయలుదేరి వెళ్లి అడవిలో బతకడాన్నే బుష్‌క్రాఫ్ట్‌ అంటారని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు. బుష్‌క్రాఫ్ట్‌ చేయడం అంత ఈజీ కాదని ఆయన అన్నారు. పూరీ మ్యూజింగ్స్‌ వేదికగా విభిన్న అంశాలతో ప్రేక్షకులను పలకరించే ఆయన తాజాగా బుష్‌క్రాఫ్ట్‌ గురించి వివరించారు. ఇంతకీ బుష్‌క్రాఫ్ట్‌ విశేషాలంటే ఆయన మాటల్లోనే తెలుసుకోండి..

‘బుష్‌క్రాఫ్ట్‌.. అడవిలో మిగతా జంతువులతో కలిసి వాటిలానే బతకగలిగే తెలివితేటలు. అది కూడా ఒక కళ. అన్ని జంతువులకి ఎలా జీవించాలో తెలుసు. మనం మాత్రం మర్చిపోయాం. ఒక మనిషిగా మనం కొన్ని బుష్‌క్రాఫ్ట్‌ స్కిల్స్‌ తెలుసుకోవాలి. అడవిలో ఆహారం సంపాదించుకోవాలంటే వేటాడటం, కొండలు ఎక్కడం, చేపలు పట్టడం ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. బుష్‌క్రాఫ్ట్‌ అనేది మనకున్న జీవన నైపుణ్యాలు తెలుసుకోవడం కోసం.. మనకి మనమే ఒక పరీక్ష పెట్టుకుని ఒంటరిగా బయలుదేరి వెళ్లి అడవిలో బతకడం. ఇది క్యాంపింగ్‌ అంత ఈజీ కాదు. అడవిలో మంచి నీళ్లు ఎక్కడ దొరుకుతాయో వెతుక్కోవాలి. వేటాడి తినాలి. అక్కడే ఓ చిన్న గూడు నిర్మించుకుని పడుకోవాలి. ఒకవేళ ఏదైనా జంతువులు దాడి చేస్తే.. దాని నుంచి తప్పించుకుని సురక్షితంగా తిరిగి రావాలి’’

‘‘కొన్ని ప్రాంతాల్లో మినహాయించి అన్ని దేశాల్లో బుష్‌క్రాఫ్ట్‌ చట్టపరంగా అమలులో ఉంది. బుష్‌క్రాఫ్ట్‌ గురించి పుస్తకాలు ఉన్నాయి. ఎన్నో జీవన మనుగడ నైపుణ్యాల గురించి అందులో రాసి ఉంటాయి. బుష్‌క్రాఫ్ట్‌ గేర్‌ అని అమ్ముతారు. ఆ సెట్‌ ఒక్కటి కొనుక్కుని మనం బయలుదేరవచ్చు. అందులో అన్నిరకాల అత్యవసర వస్తువులు అందుబాటులో ఉంటాయి. అడవిలో కనుక జీవించగలిగితే నువ్వు ఒక స్కిల్డ్‌ యానిమల్‌. అక్కడ నీతో మాట్లాడడానికి ఎవరూ ఉండరు. ప్రతి చిన్న శబ్ధం కూడా నీకు స్పష్టంగా వినిపిస్తుంది. రోజూ కంటే 4 రెట్లు ఎక్కువగా అక్కడ పనిచేస్తారు. ఆక్సిజన్‌ లేకుండా మూడు నిమిషాలు.. మంచినీళ్లు తాగకుండా మూడు రోజులు.. భోజనం చేయకుండా మూడు వారాలు జీవించగలం. బుష్‌క్రాఫ్ట్‌ ఎప్పుడూ ప్లాన్డ్‌గా ఉండదు. అలా ఫుడ్‌ని వెతుక్కుంటూ వెళ్లిపోవడమే’’

‘‘ఎక్కడికి,  ఎంత దూరం వెళతారో ఎవరికీ తెలీదు. మరలా తిరిగి రావడం కోసం మ్యాప్‌ కానీ కంపాస్‌ కానీ వాడతారు. బుష్‌క్రాఫ్ట్‌ చేసేవాళ్లు తప్పకుండా తీసుకువెళ్లాల్సింది. శాటిలైట్‌ ఫోన్‌. ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడుతుంది. యూట్యూబ్‌లో బుష్‌క్రాఫ్ట్‌ ఫర్‌ బిగినర్స్‌ అని టైప్‌ చేయండి. ఎన్నో వీడియోలు వస్తాయి. ఒంటరిగా బుష్‌క్రాఫ్ట్‌ చేస్తున్న ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. కొంతమంది వాళ్ల కుక్కని తీసుకువెళ్తారు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ చేసేవాళ్లు ఉన్నారు. బుష్‌క్రాఫ్ట్‌ చేస్తూ ఆరేళ్లు ఉన్నవాళ్లు నాకు తెలుసు. బుష్‌క్రాఫ్ట్‌ చేయాలంటే జీవితంపై ప్రేమ, దమ్ము ఉండాలి’ అని పూరీ వివరించారు.దీంతో పాటు, క్యాంపింగ్‌ అనే అంశం గురించి కూడా పూరీ తనదైన శైలిలో వివరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని