Puri Musings: అది ఎంతో అవసరం.. నాశనం చేయకండి: పూరీ జగన్నాథ్‌ విజ్ఞప్తి

‘పూరీ మ్యూజింగ్స్‌’ పేరుతో ఎన్నో అంశాలను ప్రేక్షకులతో పంచుకుంటుంటారు దర్శకుడు పూరీ జగన్నాథ్‌. ఈసారి ఆయన హ్యూమస్‌ గురించి పాడ్‌కాస్ట్‌ వినిపించారు.

Published : 14 Dec 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మట్టిలో హ్యూమస్‌ తయారయ్యేందుకు చాలాకాలం పడుతుందని, ఎంతో ఉపయోగకరమైన దాన్ని నాశనం చేయొద్దని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ విజ్ఞప్తి (Puri Jagannadh) చేశారు. ‘పూరీ మ్యూజింగ్స్‌’ (Puri Musings) ద్వారా హ్యూమస్‌ గురించి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

‘‘హ్యూమస్‌ అనేది నలుపు/గోధుమ రంగులో ఉండే సేంద్రీయ పదార్థం. చెట్ల నుంచి రాలిపోయిన ఆకులు, చనిపోయిన జంతువులు, పురుగులు నేలలో కుళ్లిపోయి హ్యూమస్‌ తయారవుతుంది. చెత్త, వృథా ఆహారం తదితర వాటిని ఓ చోట కుళ్లబెట్టినా హ్యూమస్‌ వస్తుంది. ఎన్నో చిన్న మొక్కలు దీనిపై ఆధారపడి బతుకుతాయి. హ్యూమస్‌ అధికంగా ఉన్న నేల దృఢంగా ఉంటుంది. మొక్కలకు నైట్రోజన్‌ చాలా అవసరం. అది హ్యూమస్‌లో ఎక్కువగా ఉంటుంది. హ్యూమస్‌ మొక్కలకు బలాన్ని ఇచ్చి, వ్యాధుల బారినుంచి కాపాడుతుంది’’

‘‘పెంటకుప్పలో పంట పొలాలకు కావాల్సిన నైట్రోజన్‌, ఫాస్పరస్‌, సల్ఫర్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉత్పన్నమవుతాయి. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరం. అయితే, మీరు హ్యూమస్‌ తయారుచేయాలని నేను ఇది చెప్పడం లేదు.. దాన్ని పాడు చేయకుండా ఉంటారని చెబుతున్నా. చలికాలంలో మనమంతా చలి మంటలు వేసుకుంటాం. ఆ మంటల వల్ల భూమిలోని హ్యూమస్‌ నాశనమవుతుంది. అందుకే రోజుకో ప్రాంతంలో కాకుండా ఒకే చోట మంటలు వేసుకోండి. ఫైర్‌ ప్రూఫ్‌ షీట్స్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అవి తీసుకుని, వాటిపైనా మీరు చలిమంట కాచుకోవచ్చు. మట్టిలో హ్యూమస్‌ తయారయ్యేందుకు చాలాకాలం పడుతుంది. దాన్ని పది నిమిషాల్లో నాశనం చేయొద్దని నా మనవి. హ్యూమస్‌ అనేది లాటిన్‌ పదం. భూమి అని అర్థం’’ అని పూరీ జగన్నాథ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని