ఆల్‌ఇండియా టాప్‌లో పుష్ప.. 4లో రాధేశ్యామ్‌ 

టాలీవుడ్‌ సినిమాల కోసం కేవలం తెలుగు అభిమానులే ఎదురుచూసే రోజులు పోయాయి. దేశం మొత్తంలో ఉన్న అభిమానులు ఎదురుచూసే రోజులు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాలు విడుదలకు ముందే రికార్డులు కొల్లగొడుతూ ఇండస్ట్రీలకు పెద్దన్న బాలీవుడ్‌కు సవాల్‌ విసురుతున్నాయి.

Published : 27 Jun 2021 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ సినిమాల కోసం కేవలం తెలుగు అభిమానులే ఎదురుచూసే రోజులు పోయాయి. దేశం మొత్తంలో ఉన్న అభిమానులు ఎదురుచూసే రోజులొచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాలు విడుదలకు ముందే రికార్డులు కొల్లగొడుతూ ఇండస్ట్రీలకు పెద్దన్న బాలీవుడ్‌కు సవాల్‌ విసురుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కువ మంది ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల జాబితాను ఐఎంబీడీ (ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్) తాజాగా విడుదల చేసింది. అందులో రెండు తెలుగు చిత్రాలు స్థానం సొంతం చేసుకున్నాయి. బన్నీ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ అగ్రస్థానంలో నిలిచి తెలుగు సినిమా పవర్‌ చూపించింది. నాలుగో స్థానంలో ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్‌ తెరకెక్కించిన ‘రాధేశ్యామ్‌’ నిలిచింది.

ఐదు భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ‘పుష్ప’పై మొదటి నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. అల్లుఅర్జున్‌, సుకుమార్‌ హిట్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పుడు రెండు భాగాలని చెప్పడంతో ఆ ఆసక్తి రెట్టింపయింది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు పాన్‌ ఇండియాస్టార్‌గా మారిన ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ చిత్రంపైనా అంచనాలు బాగానే ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతోందీ చిత్రం. ఈ చిత్రానికి జసిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. జూలై 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కరోనా ప్రభావంతో చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. విడుదల తేదీలపై చిత్రబృందాలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఎక్కువ మంది ఎదురుచూస్తున్న సినిమాల జాబితా..

1. పుష్ప

2. కే.జీ.ఎఫ్‌ ఛాప్టర్‌2

3. హసీన్‌ దిల్‌రుబా

4. రాధేశ్యామ్‌

5. బెల్‌బాటమ్‌

6. తుఫాన్‌

7. ఆట్రంగి రే

8. మరక్కర్‌

9. గుంగూబాయి కతియావాడి

10. ఫీల్స్‌ లైక్‌ ఇష్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని