Pushpa: రష్యాలోనూ ‘తగ్గేదేలే’.. 25 రోజుల కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

Pushpa: రష్యాలో విడుదలైన ‘పుష్ప-1’ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

Published : 02 Jan 2023 16:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పుష్ప (Pushpa) అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’ అంటూ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద మాస్‌ హిస్టీరియా క్రియేట్‌ చేశారు అల్లు అర్జున్‌ (Allu arjun). ఆయన కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్‌ ఇండియా మూవీగా అదరగొట్టింది. ఇటీవల ఈ చిత్రాన్ని రష్యాలోనూ విడుదల చేశారు. చిత్ర బృందం సైతం అక్కడకు వెళ్లి ప్రచారం చేసింది.

సినీ ట్రేడింగ్‌ వర్గాల అంచనా ప్రకారం.. అక్కడ కూడా ‘పుష్ప’ పార్ట్‌-1 మంచి వసూళ్లు రాబడుతోంది. 25 రోజుల్లో ఈ చిత్రం 10 మిలియన్‌ రుబెల్స్‌ను వసూలు చేసింది. అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ.13కోట్లు. ఇప్పటికీ రష్యన్‌ భాషలో 774 స్క్రీన్స్‌పై ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో పలు భారతీయ చిత్రాలు విదేశాల్లోనూ వసూళ్లు రాబడుతున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు ‘పుష్ప: ది రైజ్‌’ వచ్చి చేరింది. పుష్పరాజ్‌ అనే యువకుడు ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించి ఎర్ర చందనం సిండికేట్‌ నడిపే స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా దాటాడు? అన్నది ‘పార్ట్‌-1’లో చూపించారు. ఎర్రచందనం సిండికేట్‌ గుప్పిట్లోకి వచ్చిన తర్వాత పుష్పరాజ్‌ ఎవరిని ఎదుర్కోవాల్సి వచ్చింది? శత్రువులను అణగదొక్కి తన ‘బ్రాండ్‌’ ఇమేజ్‌ను ఎలా పెంచాడు? తెలియాలంటే ‘పుష్ప: ది రూల్‌’ చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. కీలక సన్నివేశాల కోసం చిత్ర బృందం ఇటీవల థాయిలాండ్‌ వెళ్లింది. అల్లు అర్జున్‌ సరసన రష్మిక (Rashmika) నటిస్తుండగా, ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

అన్నట్లు పుష్ప గురించి ఈ రికార్డులు మీకు తెలుసా?

🪓  ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావ’, ‘సామి సామి’ పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. 2022లో అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్‌-10 సాంగ్స్‌లో ఇవి నిలిచాయి.  అంతేకాదు, 6 బిలియన్‌ + వ్యూస్‌ సొంతం చేసుకున్న తొలి ఇండియన్‌ ఆల్బమ్‌గానూ పాటలు రికార్డు సృష్టించాయి.

🪓  డిసెంబరు 17న పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన ‘పుష్ప’ (Pushpa) ప్రపంచవ్యాప్తంగా రూ.365కోట్లు(గ్రాస్‌) వసూలు చేసింది, ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్‌) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప’రాజ్‌ రికార్డు సృష్టించాడు. టాలీవుడ్‌లో అత్యధికమంది వీక్షించిన, లైక్‌ చేసిన వీడియో ‘పుష్ప’టీజర్‌ నిలిచింది.

🪓 ఓటీటీలోనూ ‘పుష్ప’ (Pushpa) అదరగొట్టింది. 2022లో అమెజాన్‌ప్రైమ్‌ వీడియోలో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్‌ హవా చూపించాడు. 2022లో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌ సాధించిన చిత్రంగా పుష్ప (Pushpa) అలరించింది. 10మిలియన్‌+ ఇన్‌స్టా రీల్స్‌ క్రియేట్‌ చేశారంటే పుష్ప మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని