Puri Musings: తప్పుని నిజమని నమ్మొద్దు

జీవితంలో ప్రతి విషయాన్ని, ప్రతిఒక్కర్నీ ప్రశ్నించాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. ప్రశ్నించడం ద్వారానే ఎన్నో విషయాలు నేర్చుకోవడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ‘కొశ్చన్‌ ఎవ్రిథింగ్‌’

Published : 19 May 2021 15:00 IST

ప్రశ్నించడం తెలుసుకోండి అంటోన్న దర్శకుడు

హైదరాబాద్‌: జీవితంలో ప్రతి విషయాన్ని, ప్రతిఒక్కర్నీ ప్రశ్నించాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. ప్రశ్నించడం ద్వారానే ఎన్నో విషయాలు నేర్చుకోవడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ‘కొశ్చన్‌ ఎవ్రీథింగ్‌’ అనే అంశంపై తాజాగా ఆయన స్పందించారు. ‘పూరీ మ్యూజింగ్స్’ వేదికగా కొన్ని విశేషాలను బయటపెట్టారు.

‘ఎందుకు? ఏమిటి? ఎక్కడ? ఎప్పుడు? ఎలా? ఎందుకలా.. చిన్నప్పుడు మనం జీవితం ఇలాగే మొదలవుతుంది. మాటలు నేర్చుకున్న దగ్గర నుంచి మన ప్రశ్నలు మొదలవుతాయి. తల్లిదండ్రులు కొన్నింటికి సమాధానం చెబుతారు. కొన్నింటికి చెప్పరు. కొన్ని ప్రశ్నలకు మన నోరు నొక్కేస్తారు. మిమ్మల్ని ఎవరైనా..  ‘అలా అడక్కు కళ్లుపోతాయ్‌’ అని అంటే మాత్రం వాళ్లని అండర్‌లైన్‌ చేయండి. అక్కడ ఏదో తేడా ఉందని అర్థం. మనం ప్రతిదాన్ని ప్రశ్నించాలి. అలా ప్రశ్నిస్తేనే నేర్చుకుంటాం’

‘ఏ ప్రశ్న అడిగినా అమాయకంగా, నవ్వుతూ అడగండి. ఎప్పుడూ మంచి ప్రశ్న నుంచే మంచి సమాధానం వస్తుంది తప్ప ఒక చెత్త ప్రశ్న నుంచి అద్భుతమైన సమాధానం ఎన్నటికీ రాదు. మనం ప్రశ్న అడిగితే అవతలి వ్యక్తి ఆలోచనల్లో పడాలి. ప్రపంచంలో అందర్నీ ప్రశ్నించండి. ఎవర్నీ వదిలిపెట్టవద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది అబద్ధపు సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తూ బతికేస్తున్నారు. అలాంటి యుద్ధాల్లో మీరు ఉండకూడదు. గుడ్డిగా నమ్మితే వాళ్ల యుద్ధాల్లో మీరు కూడా ఉన్నట్లే. వాటి నుంచి బయటకు రావాలంటే ప్రశ్నించాలి. అయితే మనలో మొదలైన ప్రశ్నలన్నీ ఏదో ఒకరోజు ఆగిపోతాయ్‌. అప్పుడు మాట్లాడడం మానేస్తాం. అడగడం మానేస్తాం. అదే జ్ఞానోదయం. అది రాకపోయినా నష్టం లేదు నిజం తెలుసుకోకపోయినా నష్టం లేదు. కానీ ఒక తప్పుని నిజం అని నమ్మొద్దు. ఒక్కసారి మీ నమ్మకాల సిద్ధాంతాలను చెక్‌ చేసుకోండి’ అని పూరీ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని