Radhe shyam: సినిమాలో ప్రభాస్‌కి చెల్లిగా నటించే ప్రసక్తే లేదు: కృష్ణంరాజు పెద్ద కుమార్తె సాయి ప్రసీదా

నాలుగేళ్ల నిరీక్షణ.. ప్రభాస్‌- పూజా హెగ్డే కలిసి నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 10 Mar 2022 14:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నాలుగేళ్ల నిరీక్షణ.. ప్రభాస్‌- పూజా హెగ్డే కలిసి నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ.300కోట్ల బడ్జెట్‌,  యూరప్‌లో షూటింగ్‌, 1970కాలం నాటి రొమాంటిక్‌ ప్రేమకథా నేపథ్యం.. ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణ. వీటితో పాటు మరొక విశేషమైన అంశం. ఈ చిత్రంతో నిర్మాతగా వెండితెరకు పరిచయం కానున్నారు ప్రభాస్‌ సోదరి, కృష్ణంరాజు పెద్ద కుమార్తె ‘సాయి ప్రసీదా’. మార్చి11న ‘రాధేశ్యామ్’ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఆసక్తికర అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలను విలేకర్ల సమావేశంలో పంచుకున్నారిలా..

ఆ అనుభూతి కొత్తగా ఉంది..

‘‘నిర్మాతగా ‘రాధేశ్యామ్‌’ చూడటం కొత్తగా అనిపించింది. విడుదల తేదీ దగ్గర పడుతోంది. కొంత టెన్షన్‌గా ఉంది. నాన్న(కృష్ణం రాజు), ప్రమోద్‌ అన్నయ్య సలహాలతో షూటింగ్‌ సాఫీగా సాగిపోయింది. నిర్మాతగా నా తొలిచిత్రం చూడటానికి నాలుగేళ్లు పట్టింది. కరోనా వల్ల షూటింగ్‌ రెండేళ్లు ఆలస్యమైంది. ఏమీ చేయలేని పరిస్థితి. మొత్తానికి నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’’

టెక్నాలజీ విశేషాలివే..

‘‘ఈ సినిమా సగ భాగం ఇటలీలో షూట్‌ చేయాల్సి ఉంది. ఇంతలో కరోనా మొదలైంది. అయితే జరిగిన మంచి పరిణామం ఏమిటంటే.. భారత్‌లో కొత్త టెక్నాలజీ వచ్చింది. వర్చువల్‌ ప్రొడక్షన్‌ చేశాం. మొదట ఇటలీలో షూట్‌ చేశాం. తర్వాత హాలీవుడ్‌లో ఉపయోగించే ‘అన్‌రియల్‌ ఇంజిన్‌’  టెక్నాలజీని వాడి ఇటలీనే ఇండియాకి తీసుకొచ్చేలా చేశారు. దీని గురించి ఎవ్వరికీ తెలియదు కాబట్టి, ఇదంతా ట్రయిల్‌ అండ్‌ ఎర్రర్‌లా ఉంటుంది. భవిష్యత్‌లో అందరూ ఇదే వాడతారు. బడ్జెట్‌ ఫ్రెండ్లీ కూడా. లొకేషన్లకు వెళ్లకుండానే లొకేషన్‌నే ఇక్కడికి తెచ్చేస్తాం. కాబట్టి నిర్మాణ వ్యయం తేలికవుతుంది. కొవిడ్‌ కారణంగా అనుకున్న బడ్జెట్‌లో కాస్త ఇబ్బంది ఎదురైంది. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నేనే అన్నీ దగ్గరుండి చూసుకున్నా’’

వాళ్ల సలహాతోనే ఇదంతా..

‘‘నా తొలిప్రాజెక్ట్‌ రూ.300 కోట్లు.. ఈ విషయంలో టెన్షన్‌ ఉంది. సినిమా విడుదలయ్యాక తగ్గుతుందేమో చూడాలి. నిర్మాతగా మీ ముందుకు రావడానికి ఇదే సరైన ప్రాజెక్ట్‌ అని అనుకోలేదు. నేను విదేశాల్లో ప్రొడక్షన్‌ కోర్స్‌ చేశా. ఈలోపు నాన్న, అన్నయ్య సలహాతో ఇందులోకి అడుగుపెట్టా’’

నెట్‌ఫ్లిక్స్‌కి పనిచేశా..

‘‘ఇక్కడ గ్రౌండ్‌ రియాల్టీకి, నేను విదేశాల్లో సినిమాకి సంబంధించి చదువుకున్న దానికి..  ఈ ప్రయాణం ఒక ప్రాక్టికల్‌గా భావిస్తా. చేసిన కోర్స్‌కి, ప్రాక్టికల్‌గా నేర్చుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. నేను చేసిన ప్రొడక్షన్‌ కోర్స్‌ తర్వాత హాలీవుడ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో పనిచేశా. హాలీవుడ్‌కి ఇక్కడికీ పనితనంలో చాలా తేడా ఉంటుంది. హాలీవుడ్‌లో వర్కింగ్‌ స్టైల్‌ పక్కా ప్రొఫెషనల్‌. మన సెట్‌ వాతావరణం కాస్త సరదాగా ఉంటుంది. అక్కడేమో తక్కువ. యూరప్‌లో షూటింగ్‌ చేసినప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్లారు. అప్పుడు నేను లండన్‌లో చదువుకుంటున్నా. అందుకే షూటింగ్‌కి వెళ్లలేకపోయా’’

ఆ విషయంలో ప్రభాస్ అన్నయ్య జాగ్రత్తే!

‘‘రాధేశ్యామ్‌లో మేకింగ్‌ పరంగా క్లైమాక్స్‌లో వచ్చే షిప్‌ ఎపిసోడ్‌ కాస్త క్లిష్టమైన ఘట్టం. ‘యూవీ క్రియేషన్స్‌’ సొంత ప్రొడక్షన్‌ అయినప్పటికీ.. బడ్జెట్‌ పరంగా అనవసర ఖర్చులు, వృథా కాకుండా చూసుకున్నారు’’

‘సాహో’ చిత్రానికీ పనిచేశా..

‘‘ప్రొడక్షన్‌ చేయాలన్న ఆలోచన వచ్చాకే విదేశాలకు వెళ్లి చదువుకున్నా. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగా. అందుకే ప్రొడక్షన్‌ వైపు వెళ్లాలన్న ఆశయంతో లండన్‌లో బిజినెస్‌ మాస్టర్స్‌ చేశా. దాని కన్నా ముందు ఒక నెల ‘సాహో’కి పనిచేసి వెళ్లా. అక్కడికి వెళ్లి ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ మీద థిసీస్‌ చేశా. మా అమ్మ కూడా బిజినెస్‌ వైపే వెళ్లమని సలహా ఇవ్వడంతో ఇటువైపు వచ్చా’’

నాన్నలా నేను ఉండను..

‘‘ప్రొడక్షన్‌ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. కృష్ణంరాజు గారు రూపాయి అడిగితే.. రెండు రూపాయలు ఇచ్చి అయినా సరే నిర్మాణ పనులు బాగా చేయమంటారు. అయితే ఈ విషయాల్లో వాళ్లలాగా ఉండకూడదని నేర్చుకున్నా(నవ్వులు). చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా.  వేస్టేజ్‌ తక్కువగా ఉండాలనుకుంటా’’

మా టీమ్‌ సూపర్‌!

‘‘దర్శకుడు రాధాకృష్ణ చాలా కూల్‌గా ఉంటారు. స్టోరీ డిస్కషన్స్‌లోనూ నా సలహాలు తీసుకున్నారు. మా ఆలోచనలకు తగ్గట్టు విజువల్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ చాలా బాగాచేశారు. సినిమాకోసం సెట్స్‌ చాలానే వేయాల్సి వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్స్‌ని అందంగా తీర్చిదిద్దారు’’

ప్రభాస్‌ అన్నయ్య ప్రేమ ఇలాగే ఉంటుంది..

‘‘గోపీకృష్ణా మూవీస్‌ అంటే ఇండస్ట్రీలో ఓ మార్క్‌ ఉంది. ఆ బాధ్యతలు నాకు అప్పగించారు. ఆ విషయంలో ప్రభాస్‌ అన్నయ్య చాలా హ్యాపీ. నేను అది ఊహించలేదు. వ్యక్తిగతంగా అన్నయ్య ప్రేమగా చూసుకుంటారు. మా కోసం ఎన్నో పనులు వాయిదా వేసుకుంటారు. బిజీగా ఉన్నా సరే మా కోసం సమయం కేటాయిస్తారు’’

పది మంది అన్నయ్యలు..

‘‘నాకు మొత్తం పది మంది అన్నయ్యలు. ప్రభాస్‌ అన్నయ్య.. వాళ్ల సొంత అన్నయ్య ప్రబోధ్‌. ప్రమోద్‌ అన్నయ్య.  నాన్నకి ఆరుగురు సోదరీమణులు, ఒక సోదరుడు. అందరినీ కలుపుకొంటూ పోతే పది మంది అన్నయ్యలు(నవ్వులు). ఇక ఏటా రాఖీ పండుగకి ప్రభాస్‌ అన్నయ్య ఒకదానిని మించిన బహుమతి మరొకటి ఇస్తుంటారు. చిన్నప్పుడు రాఖీకి పెద్ద బొమ్మ కొనిచ్చారు. అంత పెద్ద బొమ్మ నా లైఫ్‌లో చూడలేదు. నా స్నేహితులంతా ప్రభాస్‌తో ఒక్క ఫొటో ఇప్పించమని అడుగుతుంటారు. పుట్టినరోజు వస్తే వాయిస్‌నోట్‌తో శుభాకాంక్షలు తెలియజేస్తారు కూడా. నా ఫ్రెండ్స్‌ని బాహుబలి సెట్‌కి తీసుకెళ్లా కూడా’’

అది మా బ్లడ్‌ గ్రూప్‌లో ఉంది..

‘‘ఆతిథ్యం అనేది మా ఫ్యామిలీ బ్లడ్‌ గ్రూప్‌లో ఉండిపోయింది. అందుకే కృష్ణంరాజు, ప్రభాస్‌ ఇలా మేమంతా సెట్‌లో అందరిని బాగా చూసుకుంటాం. ‘బిల్లా’ షూటింగ్ అప్పుడు మా అమ్మ అందరికీ పులావ్‌ వండి పెట్టారు. నేనూ అంతే అమెరికాలో మా స్నేహితులకు వండిపెట్టేస్తా. సినిమాపరంగా ప్రభాస్‌ అన్నయ్య ఎదుగుదలంతా ఆయన సొంత ఛాయిస్‌. అదే ఆయన్ను స్థాయిలో నిలబెట్టింది. ఒక చిత్రం కోసం ఐదు ఏళ్లు కేటాయించారంటే ఆయన డెడికేషన్‌ అర్థం చేసుకోవచ్చు’’

రొమాంటిక్‌గా ప్రభాస్‌ ఇష్టం ఎందుకంటే..

‘‘యాక్షన్‌, రొమాంటిక్‌ హీరోగా ప్రభాస్‌ దేనికైనా సరిపోతాడు. వ్యక్తిగతంగా ప్రభాస్‌కు రొమాంటిక్‌ సినిమాలు చేయడం ఇష్టం. ‘డార్లింగ్‌’, ‘వర్షం’ చిత్రాల్లాగా...ఒక అభిమానిగా అయితే యాక్షన్‌ చిత్రాలు చూడాలనిపిస్తుంది. ‘సలార్‌’ కోసం ఎదురుచూస్తున్నా’’

ఆ పోలికలివే..

‘‘ప్రభాస్‌కి, నాన్నకీ చాలా పోలికలు ఉన్నాయి. ఆతిథ్యం, మర్యాద చేయడం.. ఇక సినిమా పరంగా ఇద్దరి ప్యాషన్‌ ఒకటే. ఈ సినిమాలో ‘పరమహంస’ పాత్ర చాలా ముఖ్యమైనది. ఇద్దరి మధ్య సీన్స్‌ చాలా బాగుంటాయి’’

ఆ హీరోయిన్‌ ప్రభాస్‌ పక్కన బాగుంది..

‘‘రాధేశ్యామ్‌’ పూర్తిగా చూడలేదు. సగమే చూశా. అమెరికాలోనూ భారీ స్థాయిలో విడుదలవుతోంది. హీరోయిన్స్‌లో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే బాగుంటుంది. ఇక ఆన్‌స్క్రీన్‌లో ప్రభాస్‌కి చెల్లిగా నటించాలని లేదు.(నవ్వులు) దర్శకురాలిగా మారాలన్న ఆలోచన లేదు. నా పూర్తి ఫోకస్‌ అంతా నిర్మాణం వైపే’’

ప్రభాస్‌ పెళ్లి అప్పుడే..

‘‘వైజయంతీ మూవీస్‌లో ఒక ఏడాది ప్రాజెక్ట్‌ కేర్‌ డెవలెప్‌మెంట్లో పనిచేశా. అప్పుడు స్వప్నదత్‌, ప్రియాంకా దత్‌ సలహాలు, సూచనలు చేసేవారు. వదినని తీసుకురమ్మని ప్రభాస్‌ అన్నయ్యకు ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు హ్యాపీ. అన్నయ్య అసలు వంటలు చేయరు. ఇక నాన్నంటారా.. వంటలు చేస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. మా ముగ్గురి అక్కా చెల్లెళ్లలో ప్రభాస్‌ ఎక్కువగా గారాబం చేసేది నా రెండో చెల్లెలినే. తనపేరు సాయి ప్రకీర్తి. నాగ్‌ అశ్విన్‌- ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ ‘కె’కి అసిస్టెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. చిన్న చెల్లి సాయి ప్రదీప్తికి సినిమాలంటే ఆసక్తి తక్కువే’’

చిన్న బడ్జెట్‌లోనూ ప్రభాస్..

‘‘పాన్‌ ఇండియా స్థాయి రావడంతో ప్రభాస్‌ తదుపరి చిత్రాలు ‘ఆదిపురుష్‌’, ‘స్పిరిట్’, ‘సలార్‌’. వాటితో పాటు చిన్న బడ్జెట్‌ చిత్రాల్లోనూ నటించే అవకాశం ఉంది. నా తదుపరి లక్ష్యం యూవీ క్రియేషన్స్‌ నుంచి చిన్న బడ్జెట్‌ సినిమాలు రూపొందించడమే. ఎప్పుడైనా కంటెంట్‌ కింగ్‌. ఓటీటీలోనూ అడుగు పెట్టాలనుకుంటా. నిర్మాత కథలో పరిశీలించేవి ఇవి.. అది ప్రేక్షకులకు చేరువవుతుందా లేదా అని మాత్రమే.  జ్యోతిషం అని కాదు.. నేను విధిని నమ్ముతా’

మేమంతా ఒక టీమ్‌..

‘‘గుణశేఖర్ కూతురు ‘నీలిమ గుణ’, కోడి రామకృష్ణ కూతురు ‘కోడి దివ్య’, దిల్‌ రాజు కూతురు ‘హన్షిత’.. వీళ్లంతా నిర్మాణంలో అడుగుపెట్టారు. ఇలా ఇండస్ట్రీలో రాబోయే తరమంతా మహిళలు ఉండటమనేది మంచి పరిణామం. మేమంతా ఓ టీమ్‌లా ఉంటాం’’

కథలు వింటున్నా ..

‘‘మా తదుపరి చిత్రానికి సంబంధించి కథలు వింటున్నా. అది థియేటర్‌, ఓటీటీ అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఓటీటీ యుగంలో ప్రేక్షకుల  సినిమాపరంగా అభిరుచిలో ఎప్పటికప్పుడు మార్పు వస్తోంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నాం’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని