Nani: ‘జెర్సీ’ రైల్వేస్టేషన్‌ సీన్‌.. సరిగ్గా రైలు వచ్చే సమయానికి ఏం జరిగిందంటే?

‘జెర్సీ’ మూవీ ట్రైన్‌ సీన్‌ వెనుక చిత్ర బృందం పడిన కష్టాన్ని నాని ఓ సందర్భంలో పంచుకున్నారు.

Published : 19 Jun 2024 13:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాని (Nani) కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ డ్రామా ‘జెర్సీ’ (Jersey). 2019లో విడుదలైన ఈ సినిమాలో ఓ క్రీడాకారుడి జీవితాన్ని ఎమోషనల్‌గా చూపించారు. ముఖ్యంగా అర్జున్‌గా నాని నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అన్నింటికన్నా తాను క్రికెట్‌ టీమ్‌లో ఎంపికైన తర్వాత అర్జున్‌ తన మనసులో ఉన్న బాధ, ఆనందం ఎక్కడ వ్యక్తంచేయాలో అర్థం కాదు. అప్పుడు బైక్‌పై రైల్వేస్టేషన్‌కు వెళ్తాడు. అవతలి ఫ్లాట్‌ఫాం నుంచి ఓ రైలు వేగంగా వెళ్తున్నప్పుడు గట్టిగా అరుస్తాడు. ఆ సీన్‌లో అర్జున్‌గా నాని నటన తెరపై చూస్తున్న ప్రతీ ప్రేక్షకుడి కళ్లు చెమ్మగిల్లేలా చేసింది. జీవితంలో కష్టాలు పడి చివరకు సక్సెస్‌ అందుకున్న ప్రతిఒక్కరూ తమలో అర్జున్‌ను చూసుకున్నారు. సినిమాకే హైలైట్‌గా నిలిచిన ఈ సన్నివేశం వెనక ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు రైల్వేశాఖ అనుమతి తీసుకుని, సన్నివేశాలకు అనుగుణంగా ట్రైన్‌ నడిచేలా ప్లాన్‌ చేస్తారు. కానీ, రియలిస్టిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో చిత్రబృందం అలా చేయలేదు. హైదరాబాద్‌ నగర శివారులోని ఓ రైల్వేస్టేషన్‌లో రాత్రిపూట షూట్‌ చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఆ లైన్‌లో చాలా తక్కువ రైళ్లు మాత్రమే నడుస్తాయి. ఒక రైలు వెళ్లిందంటే, మళ్లీ దాదాపు మూడు గంటలు వేచి చూడాల్సిందే. అది వెళ్లేలోపు పర్‌ఫెక్ట్‌ షాట్ తీయాలి. రైలు అవతలి ఫ్లాట్‌ ఫాం మీదకు రాబోతోందని సమాచారం తెలియగానే చిత్రబృందం షాట్‌ కోసం రెడీ అయింది. భావోద్వేగంతో అరిచినప్పుడు కళ్లు ఎర్రగా మారి, నీళ్లు వచ్చేలా నాని షాట్‌ కోసం రెడీ అయ్యారు. సడెన్‌గా ఇవతలి ఫ్లాట్‌ఫాంపై మరో రైలు వచ్చి సిగ్నల్‌ కోసం ఆగిపోయింది. ఈలోగా అటువైపు ఫ్లాట్‌ఫాం నుంచి రైలు వెళ్లిపోయింది. మళ్లీ ఇంకో రైలు వచ్చేవరకు వేచి చూడాల్సి వచ్చిందట. రూ.25 కోట్లతో నిర్మించిన ‘జెర్సీ’రూ.48 కోట్లు వసూలుచేసింది. గౌతమ్‌ తిన్ననూరి టేకింగ్‌, నాని నటన, అనిరుధ్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని