family man: సమంత మార్షల్స్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నారు!

అభిమానులు ఎంతో ఆసక్తికంగా ఎదురుచూస్తోన్న ఒరిజినల్‌ సిరీస్‌, ‘ఫ్యామిలీమ్యాన్‌2’ ట్రైలర్‌ను మే 19న అమెజాన్‌ ప్రైమ్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే

Updated : 02 Jun 2021 09:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఒరిజినల్‌ సిరీస్‌ ‘ఫ్యామిలీమ్యాన్‌2’ ట్రైలర్‌ను మే 19న అమెజాన్‌ ప్రైమ్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ భారీ స్థాయిలో 37 మిలియన్లకు పైగా వ్యూస్‌ లభించాయి. ‘ఫ్యామిలీమ్యాన్‌2’ సిరీస్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ షో సృష్టికర్తలు రాజ్‌-డీకే ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ప్రస్తుతం అత్యంత క్రేజ్‌ను సొంతం చేసుకున్న ‘ఫ్యామిలీమ్యాన్‌’ గురించి?

రాజ్‌-డీకే: మా మనసు పెట్టి ఈ సిరీస్‌ రూపొందించాం. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వేళలో సైతం కష్టపడి ఈ సిరీస్‌ను సిద్ధం చేశాం. మేము కూడా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొద్దామా? అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ఈ సీజన్‌ను కూడా ఎక్కువ మంది ఇష్టపడే శ్రీకాంత్‌ తివారీ (మనోజ్‌ బాజ్‌పాయ్‌) పాత్ర చుట్టూనే తీర్చిదిద్దాం. మధ్య తరగతి తండ్రి, భర్తగా సంఘర్షణ ఎదుర్కొంటూనే గూఢచారిగా ఫిక్షనల్‌ ఏజెన్సీకి ఆయన పనిచేస్తుంటారు. గత సిరీస్‌తో పోలిస్తే, శ్రీకాంత్‌ తివారీ ఎదుర్కొనే సవాళ్లు మరింత కఠినంగా ఉంటాయి. తాజా సిరీస్‌ అన్ని వర్గాల వారినీ అలరిస్తుంది. ఈసారి సమంత అక్కినేని ఇందులో నటించారు. డిజిటల్‌పై ఆమె నటించడం ఇదే తొలిసారి. ఇందులో ఆమెది సాహసోపేతమైన పాత్ర.

ఈ సీజన్‌ను ప్రత్యేకంగా నిలిపే అంశాలేంటి?

రాజ్‌-డీకే: ‘ఫ్యామిలీమ్యాన్‌’ నూతన సీజన్‌లో నటీనటుల పరిధి పెరిగింది. బాలీవుడ్‌తో పాటు, దక్షిణాది నటులు కూడా ఇందులో నటించారు. ఉద్వేగభరితమైన యాక్షన్‌ సన్నివేశాలతో పాత్రల మధ్య సంఘర్షణ అద్భుతంగా ఉంటుంది. ముంబయి, తమిళనాడు, లండన్‌, ఫ్రాన్స్‌ తదితర ప్రాంతాల నేపథ్యంలో కథాగమనం సాగుతుంది. ప్రతి సన్నివేశం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. పలువురి నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నాం. మన కథల ద్వారా భారతీయ గొప్పదనాన్ని తెలిపేందుకు మేము చేసిన ప్రయత్నం ఇది.

ఈ సిరీస్‌ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి, నిబద్ధతతో పనిచేశారు. మనోజ్‌ బాజ్‌పాయ్‌ తన పాత్రలో లీనమై, తెరపై తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఇక సమంత తన పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సంభాషణలు పలికే తీరుపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌లో మెళకువలు నేర్చుకున్నారు.

ఇతర ప్రాజెక్టులతో పోలిస్తే, ఈ నూతన సీజన్‌ మరింత సవాల్‌ నిలిచిందా?

రాజ్‌-డీకే: ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌-1 ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వ స్పందన ప్రశంసలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించాయి. అదృష్టవశాత్తూ తర్వాతి సీజన్‌ కోసం మేము స్క్రిప్ట్‌ను ముందుగానే పూర్తిగా సిద్ధం చేసుకున్నాం. దీంతో సీజన్‌-1 విడుదలకు ముందే షూటింగ్‌ కూడా ప్రారంభించాం. అది ప్రేక్షకుల నుంచి భారీ అంచనాలను, ఒత్తిడిని తగ్గించేందుకు మాకు తోడ్పడింది.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌ చూసిన కొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రాజీ పాత్ర పోషించిన సమంత క్యారెక్టర్‌ తమ మనో భావాలను గాయపరిచిందని అంటున్నారు?

రాజ్‌-డీకే: ట్రైలర్‌లో కొన్ని షాట్స్‌ చూసి, కథను అంచనా వేయడం తప్పు. ఈ షోలో ప్రధాన తారాగణంతో పాటు రచనా బృందంలో అత్యధికులు తమిళయన్స్‌. వారి ప్రజల మనోభావాలు, వారి సంస్కృతి పట్ల మాకు అవగాహన ఉంది. అంతకుమించి తమిళ ప్రజల పట్ల మాకు అపూర్వమైన ప్రేమ, గౌరవం ఉంది. సీజన్‌-1లో ఏవిధంగానైతే సున్నితమైన, భావోద్వేగపూరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామో అదేవిధంగా ఈ సీజన్‌ కోసమూ కష్టపడ్డాం. ఈ షో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రశంసిస్తారని మాకు తెలుసు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని