Published : 17 Aug 2021 23:40 IST

Raja Raja Chora: సినిమాలో ప్రతి పాత్ర మిమ్మల్ని నవ్విస్తుంది: హసిత్‌ గోలి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేవలం కామెడీ మాత్రమే సినిమాను నడిపించలేదని.. మంచి కథ కూడా ఉండాలని అంటున్నాడు యువ డైరెక్టర్‌ హసిత్‌ గోలి. ఆయన దర్శకత్వం వహించిన ‘రాజరాజ చోర’ ఆగస్టు 19న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మీడియాతో ముచ్చటించారు. ఆయన మాటల్లోనే..

మా నాన్నగారి వల్ల చిన్నప్పటి నుంచే సాహిత్యం మీద నాకు ఇష్టం ఉండేది. హౌసింగ్‌ కార్పొరేషన్‌లో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేసేవారు. నాకు సినిమాలంటే ఆసక్తి ఉండేది. మనం కూడా సినిమాలు చేయగలమని అనిపించి షార్ట్‌ఫిల్మ్‌లు చేశాం. వాటికి మంచి ప్రశంసలు వచ్చాయి. అలా నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చాం.

* లక్షల్లో జీతం వదులుకొని సినిమాల్లోకి వచ్చినందుకు మా అమ్మ కొంత ఆందోళనకు గురైంది. మా నాన్న మాత్రం నాకు సపోర్టుగానే ఉన్నారు. అమ్మ మాత్రం సినిమాల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అని కంగారు పడేది. నాకు కూడా మొదట్లో అలాగే ఉండేది. అయితే.. ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నా అభిప్రాయం మారింది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

* ఇండస్ట్రీలో ఎంత అనుభవం ఉన్నప్పటికీ ఒక సినిమాను తెరకెక్కించాలంటే ఎన్నో తెలివితేటలు ఉండాలి. ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాలకు డైరెక్షన్‌ టీమ్‌లో పని చేశాను. ఆ అనుభవంతో పాటు ఇప్పుడు సినిమా చేయగలను అనే నమ్మకం ఏర్పడ్డ తర్వాతే నేను డైరెక్టర్‌గా మారాను.

* నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రల్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. నేను ఎక్కువగా అలాంటి  సినిమాలే చేయడానికి అది కూడా కారణం కావచ్చు.

* సినిమాల పేర్లన్నీ అచ్చ తెలుగులోనే ఉండాలని మొదట్లోనే మేం అనుకున్నాం. షార్ట్‌ఫిల్మ్స్‌ కూడా అచ్చం తెలుగులోనే ఉండేవి. ‘మెంటల్‌ మదిలో’ సినిమాకు కూడా ‘చెల్లియోచెల్లకో’ అనే టైటిల్‌ పెడదాం అనుకున్నాం. కానీ.. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. షార్ట్‌ఫిల్మ్స్‌ అన్నింటికీ తెలుగు టైటిల్స్‌ పెట్టి సినిమాకు మాత్రం ఇంగ్లిష్‌ టైటిల్‌ పెట్టాల్సి వచ్చిందని వివేక్‌ కాస్త బాధపడ్డాడు. అందుకే ఆ తర్వాత వచ్చిన చిత్రానికి ‘బ్రోచేవారెవరురా’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశాం. ఇప్పుడు ‘రాజరాజ చోర’తో వస్తున్నాం. మేమంత మొదటి నుంచి ఒకే టీమ్‌తో పనిచేస్తున్నాం. అందరి అభిరుచి ఒకేలా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతోంది.

* నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి నాలో తెలుగు భాష స్థిరపడిపోయింది. అందుకే తెలుగు భాష మీద నాకు అభిమానం ఎక్కువే. మా టీమ్‌లో కూడా భాష గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. తమిళులు మాత్రమే వాళ్ల భాష గురించి బాగా పోరాడతారు.. మనం ఎందుకు చేయకూడదు. అసలు మనం మన భాష కోసం ఏం చేయగలం అనే చర్చలు జరుగుతూ ఉంటాయి.

* ఈ సినిమా కామెడీ డ్రామా. నేచురల్‌గా వచ్చిన ఆలోచన. అయితే.. కామెడీ సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించాలని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం కామెడీతోనే సినిమా నడుస్తుందని నేను నమ్మను. మంచి కథ లేకపోతే ముందుకెళ్లదు.  డ్రామా సినిమాలు ఎక్కువ ఇష్టపడతాను.

* సినిమా టైటిల్‌ ‘రాజరాజ చోర’ టైటిల్‌ ఊరికే పెట్టలేదు. దానికి అర్థం ఉంది. అప్పట్లో రాజు వస్తుంటే రాజ రాజ అంటూ వినిపించేది. ఏ రాజుకైనా తన పేరు ముందు ప్రిఫిక్స్‌ ఇస్తే కొంచెం గంభీరంగా ఉంటుంది. చోర అనేది దొంగకు పర్యాయపదం. దొంగ అనే బదులు చోర అంటే వినడానికి బాగుంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్‌ పెట్టాం. 

* ట్రైలర్‌లో హీరో కిరీటం పెట్టుకోవడం కనిపిస్తుంది. అయితే.. ఆ కిరీటం వెనుకాల కూడా ఓ కారణం ఉంటుంది. సినిమా మొత్తం దానికి సంబంధించిన మరో కథ నడుస్తూ ఉంటుంది.

* సినిమాలో ప్రతి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఏదో ఒక్క పాత్రకే ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేలా చూడాలని అనుకోలేదు. సినిమాలో ప్రతి ఒక్క కేరెక్టర్‌ కూడా ప్రేక్షకులను అలరించాలన్న జాగ్రత్తలు తీసుకున్నాం. హీరో పాత్ర కొంచెం హైలైట్‌ అవుతారనడంతో అనుమానం లేదు. గంగవ్వ గురించి చెప్పాలంటే హీరోకు ఉన్న ఏకైక ఫ్రెండ్‌ ఆమె. కథలు చెప్పే ముసలవ్వగా ఆమె కనిపిస్తుంది.

* నిర్మాతలకు కథ చెప్పి ఒప్పించడం కొంచెం కష్టమైన పనే. అయితే.. మొదట విష్ణుగారికి కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. ఇలాంటి మంచి కథను నిర్మించేందుకు ఎవరో ఒకరు నమ్ముతారనే మా ఇద్దరి నమ్మకం. ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి, కీర్తి గారికి కథ చెప్పాం. అలా నిర్మాతలు సులభంగానే నిర్మాతలు దొరికారు.

* మొదటి సినిమానే కరోనా వల్ల ఆలస్యం కావడం నాకు పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే వచ్చీరావడంతోనే అన్ని మనం అనుకున్నట్లు జరగాలని ఏం లేదు. సినిమా ఆలస్యం కావడం వల్ల కథకు ఇంకా మెరుగులు దిద్దాను. కరోనా ఎప్పుడు తగ్గుతుందో అనే విషయం ఎవరికీ తెలియదు. అందుకే కంగారు పడటం వల్ల వచ్చేది ఏం లేదు.

* మొదటి లాక్‌డౌన్‌ సమయానికి సినిమా షూటింగ్‌ మొదటి భాగం మాత్రమే పూర్తయింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత రెండో భాగం షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర పనులు పూర్తి చేశాం. మా సినిమా ఓటీటీలో వస్తుందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులకు థియేటర్‌కు వచ్చి మనసారా నవ్వుకోవడం చాలా అవసరం అని మేమంతా భావించాం. అందుకే థియేటర్‌లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం.

* ప్రత్యేకంగా ఏదో ఒక సందేశం ఇవ్వడం ఈ సినిమాలో కనిపించదు. మనం అందరం నిజ జీవితంలో ఎలా ఉంటామో అలాగే సినిమాలో పాత్రలు ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడే ఎవరికి వారు అంతర్లీనంగా సందేశాలు స్వీకరిస్తారు.

* కమర్షియల్‌ అంటే నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ డబ్బులు తెచ్చే సినిమా. ఎక్కువగా చదువుకున్నవాళ్లు ఈ మధ్య కమర్షియల్‌ సినిమాలు తీస్తున్నారంటే దానికి కారణం వాళ్ల దగ్గర కమ్యూనికేషన్‌ ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద హీరోలను సులభంగా కలుస్తారు. బాగా మాట్లాడటం. లాజికల్‌గా ఒప్పించడం వల్ల కమర్షియల్‌ సినిమాలు తీస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం.. ఇప్పుడు పరిస్థితుల్లో చదువుకున్న డైరెక్టర్లు ఇండస్ట్రీకి అదనపు బలం. చదువుకున్నవాళ్లు అనే ట్యాగ్‌ ఉంటే సరిపోదు. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి.

* సినిమా థియేటర్‌ నుంచి బయటకు రాగానే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించి మాట్లాడుకుంటారు. ఆ నమ్మకం మా టీమ్‌లో అందరికీ ఉంది. ఎందుకంటే మాలోనే చాలా మంచి టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్లకు కూడా సంగీతం బాగుందన్నారు. ఈ సినిమా విడుదలయ్యే వరకూ ఇంకో ప్రాజెక్టు మొదలుపెట్టాలని అనుకోవట్లేదు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని