Kalki 2898 AD: అమేజింగ్‌.. కమల్‌హాసన్‌ లుక్‌ చూస్తూ ఉండిపోయా: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

కల్కి కొత్త ట్రైలర్‌పై అగ్ర దర్శకుడు రాజమౌళి ట్వీట్‌ చేశారు.

Updated : 24 Jun 2024 10:49 IST

హైదరాబాద్‌: ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ట్రైలర్‌పై అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) ప్రశంసల జల్లు కురిపించారు. ట్రైలర్‌ చూసిన తర్వాత ‘కల్కి’ మూవీని ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ చూసేయాలన్నంత ఉత్సాహంగా ఉందని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ ఎపిక్‌ యాక్షన్‌ మూవీ ఇది. అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌ 27న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. దీన్ని చూసిన రాజమౌళి తన స్పందన తెలియజేశారు.

‘‘అమితాబ్‌ జీ, డార్లింగ్‌ (ప్రభాస్‌), దీపిక పాత్రలు మరింత లోతుగా ఉంటాయని అనిపిస్తోంది. ఆ విషయం తెలియకుండా చాలా రహస్యంగా ఉంచుతూ ట్రైలర్‌ తెచ్చారు. కమల్‌ సర్‌ లుక్‌ దగ్గర నేను ఒక్క క్షణం ఆగిపోయా. ఆయనెప్పుడూ అద్భుతాలనే చేస్తారని మరోసారి నిరూపించారు. నాగీ.. ‘కల్కి’ ప్రపంచాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారు.

తాజాగా విడుదల చేసిన రిలీజ్‌ ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అదే సమయంలో కథ విషయంలోనూ కాస్త స్పష్టత ఇచ్చారు. గర్భిణి అయిన పద్మావతి (దీపిక)ను కాపాడే బాధ్యత అశ్వత్థామ (అమితాబ్‌) తీసుకోగా, ఆమెను కాంప్లెక్స్‌ మనుషులకు అప్పగించి యూనిట్స్‌ (డబ్బులు) సంపాదించడం ద్వారా విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకునే బౌంటీ హంటర్‌గా భైరవగా ప్రభాస్‌ కనిపించారు. ఈ క్రమంలో అశ్వత్థామ, భైరవల మధ్య సుదీర్ఘ పోరాటం జరగనుంది. వనరులన్నీ కలిగిన కాంప్లెక్స్‌ అధిపతి సుప్రీం యాస్కిన్‌ పాత్రలో కమల్‌ స్టన్నింగ్‌ లుక్‌లో కనిపించారు. ‘ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చిన మనిషి మారడు.. మారలేడు’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ కనిపించిన విధానం ఒళ్లు గగురుపొడిచేలా ఉంది. ఇక మహాభారతంలో అశ్వత్థామ పోరాటం చేస్తున్న సన్నివేశాలను కూడా ట్రైలర్‌లో చూపించారు.

దిశాపటానీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి, స్వాస్థ ఛటర్జీ, బ్రహ్మానందం, అన్నాబెన్‌, మాళవిక నాయర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్‌ నడిపే కారులో ఉండే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోబోకు కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని