HBD Rajamouli: రాజమౌళి సినిమాల్లో ఈ ప్రత్యేకతలు గమనించారా?

హీరో చేతిలోని ఆయుధం, నుదుటిన బొట్టు, మెడలో వేలాడే లాకెట్టు ప్రతీది ప్రత్యేకమే

Published : 09 Oct 2021 09:55 IST

తను చెప్పాలనుకున్న కథను రాజమౌళి ఏ స్థాయిలో ఊహిస్తాడో, అంతే భారీగా వెండితెరపై కనీవినీ ఎరుగని రీతిలో చూపిస్తాడు. సినిమా నిండా భారీతనం ఉన్నప్పటికీ.. ప్రతిచిన్న విషయంలోనూ జాగ్రత్త పడతాడు. హీరో చేతిలోని ఆయుధం, నుదుటిన బొట్టు, మెడలో వేలాడే లాకెట్‌ ప్రతీది అర్థవంతంగా ఉండేలా చూసుకుంటారు. ఆదివారం రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా ఆకట్టుకునే అంశాలపై కథనం..

ఆయుధం.. రక్తపాతం

రాజమౌళి సినిమాలో కనీసం రెండు భారీ పోరాట సన్నివేశాలు ఉంటాయి. రక్తపాతం అదే స్థాయిలో ఉండి మాస్‌ ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది. ఇక ఫైట్స్‌ కోసం వాడే ఆయుధాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. ‘బాహుబలి’ కోసమే వేల సంఖ్యలో ఆయుధాలు తయారు చేశారంటే వాటిపైన ఆయనకున్న మక్కువ తెలిసిపోతుంది. దాదాపు అన్ని సినిమాల్లో ఇలాంటి ఆయుధమొకటి తారసపడుతుంది. ‘సింహాద్రి’లో నిప్పుల్లే కాలే గొడ్డలితో విలన్లను ఊచకోత కోసే సన్నివేశం చూస్తే ఎవరికైనా పూనకాలు రావాల్సిందే. ‘ఛత్రపతి’లో మొనదేలి ఉండే ఆయుధం చేతబట్టి రౌడీలతో నెత్తుటి ఆటాడతాడు. ‘విక్రమార్కుడు’లో చక్రమే ఓ ఆయుధంగా చేసే ఫైట్‌కి  రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ‘ఈగ’లో గుండుసూదే మారణాయుధం. ‘మగధీర’లో వందమందిని చంపే ఖడ్గాలు, ‘బాహుబలి’లో ప్రభాస్‌ ఆయుధాలు అంతే స్థాయిలో ఆకట్టుకుంటాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ బల్లెంతో, రామ్‌చరణ్‌ బాణంతో గురిపెడుతున్న పోస్టర్లు సినిమాపై అంచనాలను తారాస్థాయికి పెంచాయి. భళ్లాల దేవుడి గద, కాలకేయుడి త్రిశూలం ఇలా చూస్తే  జక్కన్నకు ఆయుధాల విషయంలో ఎంత శ్రద్ధ ఉందో అర్థమౌతుంది. ఎస్‌ఎస్‌ రాజమౌళి స్టాంప్‌లాగా ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేస్తాయి.


అదిరేటి లాకెట్లు

జక్కన్న ఆయుధాల్లాగే లాకెట్స్‌ కూడా చాలా ప్రత్యేకం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అలియాభట్‌ ఫస్ట్‌లుక్‌ను జాగ్రత్తగా గమనిస్తే ఆమె హారంలో కనిపించే లాకెట్‌, తిరిగి ట్రైలర్‌లో రామ్‌చరణ్‌ మణికట్టుకి కనిపిస్తుంది. అంటే కథలో ఇది కీలకంగా మారనుందని అర్థమైపోతుంది. ‘యమదొంగ’లోనూ ఇలాంటి సన్నివేశమే ఉంది.  బాల్యంలో విడిపోయిన ఎన్టీఆర్‌, ప్రియమణిలను ఒక్కటి చేయడంలో లాకెట్‌ కీలకంగా మారుతుంది. ‘ఈగ’లో నాని కోసం ప్రత్యేకంగా ఒక లాకెట్‌ను తయారు చేస్తుంది. దాన్ని కానుకగా ఇచ్చేలోపే విలన్ల చేతిలో నాని చనిపోతాడు. ‘ఛత్రపతి’లో ప్రభాస్‌కి వాళ్లమ్మ శంఖాన్ని హారంగా మెడలో వేస్తుంది. బాహుబలిలో శివుడి మెడలో శివలింగం ఉంటే, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్ చరణ్‌ మెడలో ఓమ్‌ ఆకారంలో లాకెట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి.  ఈ లాకెట్స్‌ సినిమాల్లో కావాల్సినంత భావోద్వేగాలను పండిస్తాయి. తెలుగులో వీటిని ఈ స్థాయిలో వాడింది జక్కన్న ఒక్కడే. 


దేవుడు.. నరుడు

‘అన్యాయాన్ని అరికట్టేందుకు దేవుడు గుళ్లోంచి రాడు, అలా జనంలోంచి వస్తాడు’ రాహుల్‌దేవ్‌ను చంపిన తర్వాత ‘సింహాద్రి’లో పూజారి చెప్పే డైలాగ్‌ ఇది. విలన్లను ఊచకోత కోసిన తర్వాత హీరోని నరసింహుడితో పోల్చుతారు. ‘యమదొంగ’ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్‌ నరకానికి వెళ్లకుండా కాపాడేది ఆ లక్ష్మీనరసింహుడే. అమరేంద్ర బాహుబలి పాత్రను శ్రీరాముడి నుంచి ప్రేరణగా పొందినట్లు జక్కన్న తెలిపారు. ‘మర్యాద రామన్న’లో సునీల్‌ శివలింగాన్ని మొక్కిన తర్వాతే ధైర్యంగా గడప దాటుతాడు. ‘బాహుబలి’లో శివలింగాన్ని సెలయేటి నీటితో అభిషేకం చేసే సన్నివేశం ఎంతగా అలరించిందో తెలిసిందే.  యుద్ధానికి ముందు కాళీదేవికి భళ్లాలదేవుడు జంతువును బలిస్తే, బాహుబలి తన నెత్తుటితో పాదాలను అభిషేకిస్తాడు. ‘మగధీర’లో కాలభైరవుడి ప్రతిమ ముందు వందమందితో చేసే ఫైట్‌ గురించి తెలిసిందే. ఇలా ప్రతి సినిమాలో హిందూ దేవుళ్లను, ఇక్కఢి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రయత్నం చేస్తాడు.


గతం..ఘనం

‘స్టూడెంట్‌ నం.1’ నుంచి ‘బాహుబలి’ దాకా ఏ సినిమా తీసుకున్న హీరోకి ఓ అద్భుతమైన గతముంటుంది. సినిమాను మరింత రక్తికట్టించడంలో ఇది కీలకంగా మారుతుంది. ‘విక్రమార్కుడు’, ‘ఛత్రపతి’ సినిమాల్లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్స్‌ మాస్‌ ప్రేక్షకులకు మంచి యాక్షన్‌ విందును అందించాయి. ఇక ‘మగధీర’లో 400 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి భైరవ, మిత్రవిందల ప్రేమకథను చూపించిన తీరుకు టాలీవుడ్‌ ఆశ్చర్యపోయింది. ఇక ‘బాహుబలి’లో అమరేంద్ర బాహుబలి ఫ్లాష్‌బ్యాక్‌ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. వర్తమానాన్ని, గతానికి ముడిపెడుతూ అందమైన చందమామ కథలా చెబుతాడు గనుకే ఈ స్థాయి విజయాలు అందుకున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కూడా అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల గతానికి చెందిన ఒక కల్పిత కథతోనే తెరెకెక్కుతోంది. 


బొట్టు బొట్టుకో అర్థం

రాజమౌళి సినిమాల్లో ప్రతిబొట్టుకు ప్రత్యేక అర్థం ఉంటుంది. ఆయా పాత్రల వ్యక్తిత్వాన్ని చెప్పేలా వాటిని రూపొందిస్తారాయన. శివగామి నిండు చందమామలా సింధూరం అద్దుకుంటుంది. పున్నమినాటి చంద్రుడు అందరి మీద ఒకే రకమైన వెన్నెలను కురిపిస్తాడు. భేదాన్ని చూపించడు. శివగామి కూడా అంతే. తన కుమారులు ఇద్దరి మీద ఒకేరకమైన ప్రేమను చూపిస్తుంది. ఎక్కడా తేడా చూపించదు. అంతేకాదు నిండైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అమరేంద్ర బాహుబలి, కాలభైరవుడు ఇద్దరికీ అర్థ చంద్రాకారంలో బొట్టు ఉంటుంది. నెలవంకను పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. అమరేంద్ర బాహుబలి ఎంత దయగలవాడో చెబుతుంది. ఇక దేవసేనకి లింగ సమానత్వాన్ని చూపించేలా బొట్టును తీర్చిదిద్దారు. భళ్లాలదేవుడికి ఉదయించే సూర్యుడిని సింధూరంగా తీర్చిదిద్దారు. ఏ రోజైనా సరే ఉదయించే సూర్యుడిలో మార్పుండదు. ఇంకొన్ని యుగాలైనా అలాగే ఉదయిస్తాడు. భళ్లాలదేవుడు కూడా అంతే. ఎన్నేళ్లయైనా పగ చల్లారని అతడి నైజాన్ని ఆ సింధూరం వ్యక్తపరుస్తుంది.  ఇలా చెప్పుకుంటూ పోతే బొట్టు బొట్టుకు ఓ నిగూఢమైన అర్థముంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని