RRR Sequel: మరోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌ ప్రశ్న.. రాజమౌళి ఇప్పుడేమన్నారంటే?

తన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ లభించిన ఆనందంలో ఉన్న దర్శకుడు రాజమౌళి.. ఆ సినిమా సీక్వెల్‌పై స్పందించారు. 

Updated : 14 Mar 2023 19:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుమారు రూ. 1200 కోట్ల వసూళ్లు, పలు అంతర్జాతీయ అవార్డులు సాధించి, చరిత్ర సృష్టించిన తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకులుగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆస్కార్‌ (Oscar Awards 2023) దక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా సంస్థ రాజమౌళిని ఇంటర్వ్యూ చేసింది. ఆ ముఖాముఖిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రెండోభాగం సినిమా ప్రస్తావన వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌ పనుల్ని వేగవంతం చేసేందుకు ఆస్కార్‌ అవార్డు మోటివేట్‌ చేస్తుందా?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ఆస్కార్‌ అవార్డు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. అది మాలో ఎంతో ఉత్సాహం నింపింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌ స్క్రిప్టు పనుల్ని వేగవంతం చేయడంలో దోహదపడుతుంది’’ అని రాజమౌళి స్పష్టత ఇచ్చారు.

ఇప్పుడే కాదు గతంలోనూ ఈ సీక్వెల్‌పై రాజమౌళి స్పందించారు. ‘నాటు నాటు’కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన సమయంలోనే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు కొనసాగింపు చిత్రం తీయాలనే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. ‘‘ఈ సినిమా సీక్వెల్‌ విషయంలో మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మొదట దీనికి సీక్వెల్‌ తీయాలా.. వద్దా అనుకున్నాం. విదేశాల్లోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు వచ్చిన ఆదరణ చూసిన తర్వాత చిత్ర బృందంతో, మా నాన్నతో సీక్వెల్‌ గురించి చర్చించా. అప్పుడు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. దాని ఆధారంగా కథ రాయడం ప్రారంభించా. ప్రస్తుతం మేమంతా అదే పనిలో ఉన్నాం. స్క్రిప్ట్‌ పూర్తయే వరకు మేం ఈ సీక్వెల్‌ విషయంలో ముందుకెళ్లలేం’’ అని వివరించారు. రాజమౌళికంటే ముందే ఆయన తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పార్ట్‌ 2 గురించి మాట్లాడారు. ‘‘ఓ రోజు ఎన్టీఆర్‌ మా ఇంటికి వచ్చాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొనసాగింపు చిత్రం గురించి అడిగాడు. నేను కొన్ని ఐడియాలు చెప్పా. తనకు, రాజమౌళికి బాగా నచ్చాయి. దైవానుగ్రహం ఉంటే సీక్వెల్‌ వస్తుంది’’ అని గతేడాది పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి, అది ఎప్పుడు పట్టాలెక్కుతుందంటే వేచి చూడాల్సిందే.

హీరో మహేశ్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నట్టు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా దాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సినిమా కోసం అమెరికాకు చెందిన క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీ (Creative Artists Agency)తో రాజమౌళి ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు హాలీవుడ్‌ టెక్నిషియన్లు పనిచేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు