Rajamouli: ‘కాస్త గ్యాప్‌ ఇవ్వమ్మా’.. రాజమౌళి ఆసక్తికర ట్వీట్‌

తన అన్నయ్య కీరవాణి(Keeravani)కి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల రాజమౌళి (Rajamouli) స్పందించారు. తనకు ఎంతో ఆనందంగా ఉన్నట్లు చెప్పారు.

Updated : 26 Jan 2023 10:34 IST

హైదరాబాద్‌: తన సోదరుడు, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (Keeravani)కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు (Padma Shri Award) ప్రకటించడం పట్ల అమితానందం వ్యక్తం చేశారు దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli). అన్నయ్య విషయంలో తాను గర్వంగా ఉన్నట్లు చెప్పారు. కీరవాణిని చూస్తూ కూర్చొన్న ఓ ఫొటోని ఆయన షేర్‌ చేశారు. తన అన్నయ్యకు వరుస అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన జక్కన్న.. అవార్డుకు అవార్డుకు మధ్య కాస్త గ్యాప్‌ ఇవ్వమని ఈ విశ్వానికి చెబుతానని అన్నారు. అలా, అయితేనే ఒక విజయాన్ని పూర్తిగా ఆస్వాదించగలనని తెలిపారు.

‘‘నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాలని మీ అభిమానులందరి లాగానే నేనూ భావిస్తున్నాను. కానీ, ఈ విశ్వం ఒక వ్యక్తి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఊహించని రీతిలో అందిస్తుందంటూ మీరు ఎప్పుడూ చెప్పే మాటలను గుర్తు పెట్టుకున్నాను. ఒకవేళ నేనే కనుక ఈ విశ్వంతో మాట్లాడగలిగితే.. ‘‘కొంచెం గ్యాప్‌ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్‌ చేశాక మరొకటి ఇవ్వు’’ అని దానికి చెబుతాను. నా పెద్దన్న.. ఎం.ఎం.కీరవాణికి పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. గర్వంగా ఫీలవుతున్నా’’ అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రానికి గానూ కీరవాణికి ఈ ఏడాది వరుస అవార్డులు వరించాయి. ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe Award) అవార్డుతోపాటు ‘బోస్టన్‌ సోసైటీ ఆఫ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌’, ‘క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డు’, ‘లాస్‌ ఏంజెల్స్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా వచ్చిన పద్మశ్రీతో ఆయన ఖ్యాతి మరింత పెరిగింది. ఇప్పటికే ఆస్కార్‌ నామినేషన్‌లో చోటు దక్కించుకున్న ‘నాటు నాటు’ కనుక విజయం అందుకుంటే కీరవాణి కిరీటంలో మరో కలికితురాయి చేరినట్లు అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని