ఆ ప్రేమ గీతం రాజమౌళికి నచ్చలేదట! 

ఆయన తెరకెక్కించిన చిత్రంలోని ఓ సూపర్‌ హిట్ గీతం నచ్చలేదట దర్శక ధీరుడు రాజమౌళికి. అదేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘స్టూడెంట్‌ నెం.1’. జూనియర్‌ ఎన్టీఆర్‌, గజాలా జంటగా నటించారు.

Published : 27 Feb 2021 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను తెరకెక్కించిన చిత్రంలోని ఓ సూపర్‌ హిట్ గీతం నచ్చలేదట దర్శక ధీరుడు రాజమౌళికి. అదేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘స్టూడెంట్‌ నెం.1’. జూనియర్‌ ఎన్టీఆర్‌, గజాలా జంటగా నటించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షిస్తూ ఈ సినిమాను నిర్మించారు. ఆ సమయంలో సినిమా తెరకెక్కించడం రాజమౌళికి కొత్త కావడంతో సంగీతానికి సంబంధించిన పనులు రాఘవేంద్రరావు చూసుకునేవారు. పైగా ఈ చిత్రానికి సంగీతం అందించింది ఆయనకు సన్నిహితులైన ఎం.ఎం. కీరవాణి.

అప్పటికే కీరవాణి-రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఎన్నో హిట్ చిత్రాలొచ్చాయి. శ్రోతల నాడి బాగా తెలిసిన ఈ ఇద్దరు ‘స్టూడెంట్‌ నెం.1’కి ముందుగా ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’, ‘పడ్డానండి ప్రేమలో మరి’ పాటలు సిద్ధం చేశారు. ఓకే చేసేందుకు ఓసారి రాజమౌళిని వినమని చెప్పారు దర్శకేంద్రుడు. వాటిని విన్న రాజమౌళి ‘ఎక్కడో పుట్టి’ సరే అనుకుని,  ‘పడ్డానండి ప్రేమలో మరి’ ఈ ట్యూన్‌ ఏంటి బాబోయ్‌.. అనుకుంటూ కీరవాణి దగ్గరకు వెళ్లి తన అభిప్రాయం చెప్పారు. ‘పెద్దన్నా..! ఏంటి ఈ ట్యూన్‌ ఇలా ఉంది. అసలేం బాలేదు. నాకు నచ్చలేదు’ అనగానే  ‘హిట్‌ అవుతుందిరా.. రాఘవేంద్రరావు గారు ఓకే చేశారంటే అది పెద్ద హిట్‌ అయినట్టే’ అని సమాధానం ఇచ్చారు కీరవాణి. ఈ మాటతో ఆ పాటను సినిమాలో ఉంచారు రాజమౌళి. ఆడియో విడుదలై ఈ పాట పెద్ద హిట్‌ అయినపుడు ఓహో! మనం అయితే ఏం పాట చేయించుకునేవాళ్లమో, అది ఏం అయ్యేదో అని మనసులో అనుకున్నానని ఓ సందర్భంలో తెలియజేశారు జక్కన్న. ఈ సినిమాలోని ఒకటి.. రెండు కాదు సినిమాలోని ఆరు పాటలూ హిట్ గీతాలుగా నిలిచాయి. చిత్ర ఘన విజయానికి ప్రధాన కారణమయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని