RRR: ఆ ఫార్మాట్‌లో వస్తున్న తొలి భారతీయ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)తో సాంకేతికంగా భారతీయ చిత్ర పరిశ్రమలో మరో ముందడుగు పడింది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని నేటి దర్శకులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నారు.

Updated : 24 Mar 2022 10:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)తో సాంకేతికంగా భారతీయ చిత్ర పరిశ్రమలో మరో ముందడుగు పడింది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని నేటి దర్శకులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో డాల్బీ విజన్‌ను భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి. ఆ ఫార్మాట్‌లో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు సృష్టించింది.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలా ఈ సినిమాను 2డీ, 3డీలతో పాటు డాల్బీ అట్మాస్‌, డాల్బీ విజన్‌ ఫార్మాట్‌లలోనూ విడుదల చేస్తుండటం గమనార్హం. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు ‘డాల్బీ విజన్‌’లో ‘ఆర్ఆర్ఆర్‌’ను చూసి ఆస్వాదించాల్సిందిగా చిత్ర బృందం చెబుతోంది.

ఇంతకీ ఏంటీ డాల్బీ విజన్‌/డాల్బీ అట్మాస్‌?

ఆడియో, వీడియో ఫార్మాట్‌లను అత్యున్నత ప్రమాణాలతో అందించే అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ డాల్బీ లేబొరేటరీస్‌ ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వెండితెరపై మనం చూస్తున్న ప్రతి సన్నివేశాన్నీ డాల్బీ విజన్‌ కలిగిన తెరపై పదిరెట్లు స్పష్టతతో చూడవచ్చు. ఉదాహరణకు చీకట్లో ఉన్న ఒక వస్తువును చూడటానికి ఒక దీపం వెలిగించామనుకుందాం. ఆ వస్తువు ఆ ఒక్క దీపం వెలుగులో ఒక విధంగా కనపడుతుంది. అదే వస్తువును చూడటానికి వెయ్యి దీపాలు వెలిగిస్తే కనపడే తీరు మరో రకంగా ఉంటుంది. అదే వస్తువును చూడటానికి పదివేల దీపాలను ఉపయోగిస్తే మరింత స్పష్టంగా ఆ వస్తువు ప్రతి అణువునూ చూడొచ్చు. అలాగే సినిమా విషయంలోనూ ఇదే ఫార్ములా అమలవుతుంది. 35 ఎంఎంలో సినిమా చూస్తే వచ్చే అనుభూతికి, 70ఎంఎంలో కలిగే అనుభూతికి తేడా ఉన్నట్లే, డాల్బీ విజన్‌+డాల్బీ అట్మాస్‌ ఉన్న థియేటర్‌లో సినిమా ప్రేక్షకుడిని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

మన దేశంలో డాల్బీ విజన్‌ అందుబాటులో ఉందా?

ప్రస్తుతం మన దేశంలో ఐమాక్స్‌ స్క్రీన్‌లు మాత్రమే అక్కడక్కడా అందుబాటులో ఉన్నాయి. డాల్బీ విజన్‌ కలిగిన థియేటర్‌ మన దేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. సాధారణ స్క్రీన్‌తో పోలిస్తే డాల్బీ ప్రొజెక్టర్స్‌ 500 రెట్ల కాంట్రాస్ట్‌ రేషియోతో పాటు, నాలుగింతల స్పష్టతతో పిక్చర్‌ నాణ్యత ఉంటుంది. అయితే, చాలా థియేటర్‌లు డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. సాధారణ సౌండ్‌ సిస్టమ్‌లు కలిగిన థియేటర్‌లో పోలిస్తే, ఇవి ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని ఇస్తాయి. దేశవ్యాప్తంగా దాదాపు 500లకు పైగా థియేటర్‌లు/మల్టీపెక్స్‌లలో డాల్బీ అట్మాస్‌ సిస్టమ్‌ ఉంది.

డాల్బీ సినిమా vs ఐమాక్స్‌

* డిజిటల్‌ ఫార్మాట్‌లో ఉన్న ఒక సాధారణ వీడియో ఐమ్యాక్స్‌లో మూడింతలు స్పష్టంగా కనిపిస్తే, డాల్బీ సినిమాలో నాలుగింతలు స్పష్టతతో చూడవచ్చు.

* ఐమ్యాక్స్‌లో ఇమేజ్‌ ఫార్మాట్ 1.90:1 యాస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంటే, డాల్బీలో 2.40:1 యాస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంటుంది.

* ఐమ్యాక్స్‌ 12 ఆడియో ఛానల్స్‌ ఉంటే, డాల్బీలో 64 ఆడియో ఛానల్స్‌ ఉంటాయి.

* డాల్బీలో రెక్లయినింగ్‌ ఛైర్స్‌కు ట్రాన్స్‌డ్యూసర్స్‌ పరికరాలు అమర్చి ఉంటాయి. ఇక ఐమాక్స్‌లో సీట్లు సాధారణ థియేటర్‌ కన్నా కాస్త సౌకర్యంగా ఉంటాయి.

* ప్రపంచవ్యాప్తంగా 1500లకు పైగా ఐమ్యాక్స్‌ స్క్రీన్లు ఉండగా, డాల్బీ విజన్‌ కలిగిన థియేటర్‌లు  200లకు మించి లేవు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 3డీలో చేయటం ఇష్టం లేదు.. కానీ: రాజమౌళి

‘‘సాధారణంగా నాకు 3డీ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే సినిమా స్కేల్‌ తగ్గిపోతుంది. అయితే, ‘RRR’ షూట్‌ చేస్తుండగా 3డీ గురించి నన్ను అడిగారు. నాకు ఇష్టం లేదని చెప్పా. ‘టెక్నాలజీ మారింది. మాకు కొన్ని షాట్స్‌ ఇవ్వండి నచ్చితే ముందుకు వెళ్దాం. లేకపోతే వద్దు. ఒకసారి ఇచ్చి చూడండి’ అన్నారు. సర్లే అని నాలుగైదు వందల షాట్స్‌ ఇచ్చాను. ఎలాగూ నేను నో చెబుతానని నాకు తెలుసు. అందుకే వెళ్లి చూశా. 3డీలో ఆ షాట్స్‌ చూసినప్పుడు కొత్త టెక్నాలజీ వల్ల సినిమా స్కేల్‌ తగ్గలేదు. దాంతో పాటు సినిమాలోని పాత్రలు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాయన్న అనుభూతి కలిగింది. సాధారణ 2డీ తెరపై సన్నివేశాలు చూసిన దాని కన్నా, 3డీ స్క్రీన్‌పై తారక్‌, చరణ్‌ ఎమోషనల్‌ అవుతుంటే.. మన దగ్గరకు వచ్చి భావోద్వేగానికి గురవుతున్న భావన కలిగింది. 3డీలో కూడా ఇంత ఎఫెక్టివ్‌గా ఉంటుందా? అని మొదటిసారి అనిపించింది. వెంటనే ఓకే చెప్పా. కరోనా కారణంగా దొరికిన సమయాన్ని 3డీ వెర్షన్‌కు మరిన్ని మెరుగులు దిద్దడానికి అవకాశం లభించింది. టెక్నికల్‌గా బెస్ట్‌ 3డీ పిక్చర్‌ను చూస్తారు. డాల్బీ విజన్‌లో చూడటం ఒక అద్భుతం. అలాగే మేం పెట్టిన రూ.500 కోట్ల పెట్టుబడి నాణ్యత కనిపించాలంటే ఐమాక్స్‌లో చూడాలి. తారక్‌, చరణ్‌లు చేసి అద్భుత నటన చూడాలంటే 3డీలో చూడండి’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు