Rajamouli: ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి పేరు హాలీవుడ్‌లో మార్మోగుతోంది. ఆయన తీసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకొంటోంది.

Updated : 04 Dec 2022 07:20 IST

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ పురస్కారం

గ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (Rajamouli) పేరు హాలీవుడ్‌లో మార్మోగుతోంది. ఆయన తీసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకొంటోంది. అమెరికాలో ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనల తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి, ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళికీ మరింతగా అభిమానులు పెరిగారు. ఆస్కార్‌ పురస్కారాల్లో ఫేవరేట్‌గా నిలుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రానికిగానూ, ప్రతిష్ఠాత్మకమైన న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ (ఎన్‌.వై.ఎఫ్‌.సి.సి) పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు. ఆ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేసింది సదరు సంస్థ. ఈ పురస్కారాన్ని అందుకున్న ఎక్కువమంది దర్శకులు ఆస్కార్‌ విజేతలుగా నిలిచినట్టు హాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజమౌళికి పురస్కారం పట్ల సామాజిక అనుసంధాన వేదికల్లో అభినందనలు వెల్లువెత్తాయి.  ఎన్టీఆర్‌ ట్విటర్‌లో స్పందిస్తూ ‘మీ గురించి నాకు తెలిసింది ప్రపంచం కూడా తెలుసుకోవల్సిన సమయం ఇది. ప్రపంచవ్యాప్తంగా సాగనున్న మీ కీర్తి ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమే. అభినందనలు జక్కన్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ కల్పిత కథతో రూపొందించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని