రజనీ.. ఐదు రూపాలు

రజనీ.. మూడక్షరాల పేరే. కానీ, ఆ పేరు వెనుక అక్షరాలతో కూడా వర్ణించలేని స్టార్‌డమ్‌ ఉంది. ఆయన వెండితెరపై కనపడితే చాలు అభిమానులకు అదో పండగ. నిర్మాతలకూ పెద్ద పండగే. ఆయనేమీ ఆరడుగుల పొడవూ కాదు!

Updated : 01 Apr 2021 11:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం: రజనీ.. మూడక్షరాల పేరే. కానీ, ఆ పేరు వెనుక అక్షరాలతో కూడా వర్ణించలేని స్టార్‌డమ్‌ ఉంది. ఆయన వెండితెరపై కనపడితే చాలు అభిమానులకు అదో పండగ. నిర్మాతలకూ పెద్ద పండగే. ఆయనేమీ ఆరడుగుల పొడవూ కాదు! కండల వీరుడు అంతకన్నా కాదు. నల్లగా, బట్టతలతో సన్నగా సామాన్యుడిలా ఉంటాడు. కానీ, ఎవరినైనా మంత్రముగ్ధులను చేయగల సమ్మోహనశక్తి ఆయనకుంది. ఆనందాలకు పొంగిపోడు.. బాధల్లో కుంగిపోడు. ‘నరసింహా’లో ఒక డైలాగ్‌ ఉంది. ‘బేబీ నా ఐదు రూపాలు చూశానన్నావుగా. నాకు ఇంకో రూపం ఉంది. అది ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం. చూశావో తట్టుకోలేవు’ అంటారు. రజనీ కెరీర్‌ను తరిచి చూస్తే ఐదు రూపాలు నటన, స్నేహం, నిరాడంబరత, అభిమానుల పట్ల ప్రేమ, దాతృత్వ గుణం మనకు కనిపిస్తాయి. తన నటన, వ్యక్తిత్వంతో కోట్లాది అభిమానులను సంపాదించుకొన్న తలైవాకు కేంద్ర ప్రభుత్వం గురువారం  దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది.

అసలు రూపం దాల్చకముందు..

రజనీ నటుడిగా అందరికీ తెలుసు. మరి నటుడు కాకముందు? రజనీకాంత్‌ అసలు పేరు శివాజీరావ్‌ గైక్వాడ్‌. బెంగళూరులో జన్మించారు. దురదృష్టవశాత్తూ ఐదేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. ఎన్నో కష్టాల తర్వాత కండక్టర్‌గా ఉద్యోగ జీవితం మొదలు పెట్టారు. బాల్యంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా తనలోని కళాకారుడిని ఎప్పుడూ వదిలేయలేదు శివాజీ. చిన్నతనం నుంచే అడపాదడపా నాటకాలు వేసేవారు. వేసిన ప్రతీ నాటకంలో శివాజీకి ఓ ప్రత్యేక శైలి ఉండేది. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఓసారి నాటకంలో ‘దుర్యోధనుడి’ పాత్రలో రజనీని చూసిన అతని స్నేహితుడు రాజ్‌ బహదూర్‌ ఆ నటనకు మంత్ర ముగ్ధుడై డబ్బులిచ్చి మరీ శివాజీని మద్రాసు పంపాడు. మద్రాసు చేరుకున్న శివాజీ నటనలో శిక్షణ తీసుకున్నాడు.

ఆ తర్వాత అవకాశాల వేట. ఏవీఎం, జెమిని, విజయవాహిని ఏ స్టూడియోకు వెళ్లినా అవకాశాలు రాలేదు. భాష రాదు. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఉన్న ఉద్యోగం పోయింది. ‘ఈ బతుకు బతికి వేస్ట్‌’ అనుకుంటూ చివరిగా తన స్నేహితులను కలిసేందుకు బెంగళూరు వెళ్లాడు. రైలు దిగిన వెంటనే స్నేహితుడు రమేశ్‌ను కలిశాడు. ఆయన పెయింటర్‌. వివిధ రకాల పెయింట్‌లు వేస్తూ ఉండేవారు. శివాజీ రావడం చూసి, కొంచెం సేపు వేచి ఉండమని సైగ చేశాడు రమేశ్‌. సరేనని శివాజీ ఒక స్తంభానికి ఆనుకుని కూర్చొని చూస్తూ ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో గోడపై గీసిన రాఘవేంద్రస్వామి బొమ్మను చూసి శివాజీలో తెలియని ఆనందమేదో కలిగింది. ‘నేనున్నా. నీకేం కాదు’ అన్నట్లు అనిపించింది. అప్పటివరకూ శివాజీని ఆవరించిన నిరాశ, నిస్పృహలు చెల్లా చెదురైపోయాయి. పోరాడితే పోయేదేముంది అన్నట్లు శివాజీ ముందుకు కదిలారు.

మొదటి రూపం: నటన

శివాజీరావ్‌గా మద్రాసులో నటనలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు! కాలే కడుపుతోనే కళామతల్లిని నమ్ముకున్నారు. అవకాశాల కోసం ఎదురు చూశారు. అప్పుడే ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ దృష్టిలో పడ్డారు. ఆయన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రాన్ని తీసే పనిలో ఉన్నారు. శివాజీని కూడా ఆ సినిమాకు తీసుకున్నారు. అప్పటికే సినిమాల్లో శివాజీ పేరుతో నటుడు ఉండటంతో శివాజీరావ్‌కు వేరే పేరు పెట్టాలనుకున్నారు. బాలచందర్‌ పేరు కోసం ఎక్కువసేపు ఆలోచించలేదు. ఆయన తీసిన సినిమా మేజర్‌ చంద్రకాంత్‌లో ఓ పాత్ర పేరు రజనీకాంత్‌. దీంతో ఈ పేరును శివాజీకి పెట్టాలని నిర్ణయించారు. దీంతో శివాజీరావుకు ఇష్టదైవమైన రాఘవేంద్రస్వామిని ఆరాధించే గురువారం రజనీకాంత్‌గా నామకరణం చేశారు. తొలి సినిమానే రజనీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

కమల్‌హాసన్‌ నటనను చూస్తూ తాను నటుడిగా ఎదిగాను అంటారు రజనీ. అప్పుడు ‘అవరగళ్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. రజనీ బయట ఎక్కడో కూర్చుని ఉన్నారు. ఈ విషయం తెలిసి బాలచందర్‌కు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే రజనీకాంత్‌ని సెట్‌ లోపలకి రమ్మన్నారు. ‘సిగరెట్‌ తాగడానికి బయటకు వెళ్లావా? కమల్‌ నటిస్తున్నాడు జాగ్రత్తగా గమనించు. అలా గమనిస్తే నీ నటన మెరుగుపడుతుంది’ అని మందలించారు. దీంతో అప్పటి నుంచి కమల్‌ నటనను దగ్గరుండి చూసేవారు రజనీ. అయితే కమల్‌ ఉన్న పరిశ్రమలో తానూ రాణించాలంటే ఇంకేదో భిన్నంగా చేయాలి.. అదే రజనీ చేశారు. ఈ క్రమంలో మరో అరుదైన ఘనతనూ దక్కించుకున్నారు. తొలి చిత్రం ‘అపూర్వ రాగంగళ్‌’(తమిళం) కాగా, రెండోది కన్నడలో ‘సంగమ’. మూడోది తెలుగు చిత్రం ‘అంతులేని కథ’. ఇలా తొలి మూడు చిత్రాలు మూడు భాషల్లో నటించారు. రజనీ సూపర్‌స్టార్‌ అయ్యాడు.

తన మేనరిజం, స్టైల్‌, డైలాగ్‌ డెలివరీతో వరుస చిత్రాలను చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు రజనీ. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతీ భాషలోనూ నటిస్తూ దూసుకుపోయారు. 1978లో సుమారు 20కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఆయన కథానాయకుడిగా నటించిన ‘భైరవి’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అప్పుడే ఆయన పేరు ముందు ‘సూపర్‌స్టార్‌’ అని వేశారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది.

రెండో రూపం: స్నేహం

బస్‌కండక్టర్‌గా పనిచేసే రోజుల్లో అతని స్నేహితుడూ, డ్రైవర్‌ రాజ్‌ బహదూర్.. రజనీని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరమని ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రజనీ సూపర్‌స్టార్‌ అయినా ఆ స్నేహం చెక్కుచెదరలేదు. ఏడాదికోసారి రజనీకి బెంగళూరులోని స్నేహితుడి ఇంటికెళ్లి ఐదారు రోజులు గడిపి రావడం అలవాటు. ‘రజనీ చెప్పాపెట్టకుండా వస్తాడు. అందరితో కలిసి భోజనం చేస్తాడు. తాను తనలా ఉండగలిగే ఒకేఒక్క చోటు మా ఇల్లే అంటుంటాడు’ అని స్నేహితుడి స్వభావాన్ని గుర్తు చేసుకుంటారు బహదూర్‌.

మూడో రూపం: నిరాడంబరత

‘రోబో’ ఆడియో విడుదల వేడుకలో రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘మొన్నీమధ్య బెంగళూరులోని మా అన్నయ్య ఇంటికెళ్లా. నన్ను చూడ్డానికి పక్కింట్లో ఉండే ఓ రాజస్థానీ పెద్దాయన వచ్చాడు. నేనింకా సినిమాల్లో నటిస్తున్నానా అని అడిగాడు. ఒక సినిమా చేస్తున్నా... ఐశ్వర్యారాయ్‌ హీరోయిన్‌ అని చెప్పా. ‘ఓహ్‌... చాలా అందమైన అమ్మాయి, బాగా నటిస్తుంది, వేరీ గుడ్‌. మరి హీరో ఎవరు?’ అని అడిగాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నేనే హీరోనని చెప్పేసరికి అతనికి నోట మాటరాలేదు. బయటివాళ్లకు హీరోలా కనిపించని నాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్‌ ఐశ్వర్యా’ అంటూ చాలా నిరాడంబరంగా, నిజాయతీగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

నాలుగో రూపం: అభిమానుల పట్ల ప్రేమ

కార్తీక్‌ అనే క్యాన్సర్‌ బాధిత కుర్రాడికి ఒక్కసారైనా సూపర్‌స్టార్‌ని చూడాలన్న కోరికుండేది. విషయం తెలుసుకున్న రజనీ ఆస్పత్రికి బయల్దేరాడట. కానీ ఆ కుర్రాడి తండ్రి ‘భక్తులే గుడికి రావాలి కానీ...’ అంటూ రజనీని రావొద్దని వారించి కొడుకునే అతడి ఇంటికి తీసుకెళ్లాడు. గేటు వరకూ వెళ్లి కార్తీక్‌ని ఆహ్వానించిన రజనీ, అతడితో గంటపాటు గడిపి, తాను సంతకం పెట్టిన ఫొటోను బహుమతిగా ఇచ్చి పంపించాడు. ‘ఆయనతో ఫొటో దిగితే చాలనుకున్నా, కానీ నాకోసం ఆస్పత్రికి వస్తాననడం, ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అంతా కలలా ఉంది’ అని మురిసిపోయాడు కార్తీక్‌.

ఐదో రూపం: దాతృత్వం

తన తదనంతరం సంపాదనంతా తాను స్థాపించిన ‘రాఘవేంద్ర పబ్లిక్‌ చారిటీ ట్రస్టు’కే చెందుతుందని రజనీ గతంలో బహిరంగ సభలో ప్రకటించారు. ‘రజనీకాంత్‌ కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే సంగతే అందరికీ తెలుసు. కానీ ఆయన సంపాదనలో యాభై శాతాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయిస్తారన్న విషయం చాలామందికి తెలీదు’ అని రజనీకాంత్‌ జీవిత చరిత్రలో రచయిత నమన్‌ రామచంద్రన్‌ ప్రస్తావించారు.

ఒకప్పుడు రజనీకి సహాయకుడిగా పనిచేసిన జయరామన్‌ నిర్మాతగా మారి ఓ చిన్న సినిమా తీశాడు. అతడిని ప్రోత్సహించేందుకు స్వహస్తాలతో దాదాపు వంద పోస్టర్లపైన సంతకం పెట్టాడు రజనీ. ‘బాబా’ సినిమా సరిగా ఆడకపోవడంతో ఆ పరాజయాన్ని తన భుజాలమీద వేసుకొని, దాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఇంటికి పిలిచి మరీ సొంత డబ్బుని తిరిగిచ్చి ఓ కొత్త సంస్కృతికి ప్రాణం పోసిందీ సూపర్‌స్టార్‌ రజనీనే.

 

 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని