ఆస్పత్రి నుంచి రజనీకాంత్‌ డిశ్చార్జ్‌

రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన అగ్రకథానాయకుడు రజనీకాంత్‌

Updated : 27 Dec 2020 16:34 IST

హైదరాబాద్‌: రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన అగ్రకథానాయకుడు రజనీకాంత్‌ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్‌ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, రజనీ త్వరగా కోలుకునేందుకు వైద్యులు కొన్ని సూచనలు చేశారు.

వారం రోజుల పాటు రజనీ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్‌ సోకే అవకాశం ఉన్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొన వద్దని సూచించారు. అదే సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని తెలిపారు. గతంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో ఆయన చెన్నై వెళ్లనున్నారు.

తమిళ సినిమా ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ కోసం ఈ నెల 13న హైదరాబాద్‌కు రజనీ వచ్చారు. నిత్యం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నెలాఖరుకల్లా షెడ్యూల్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల సెట్‌లో నలుగురికి కొవిడ్‌ రావడంతో దర్శకుడు శివ షూటింగ్‌ నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఈనెల 22న రజనీకాంత్‌ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. అప్పటి నుంచి స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇంతలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అనారోగ్యం తలెత్తడంతో వెంటనే అపోలో ఆసుపత్రిలో చేరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని