Kaala Movie: 21వ శతాబ్దపు టాప్‌-25 చిత్రాల్లో రజనీ మూవీకి చోటు

పా.రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన ‘కాలా’ మూవీకి అరుదైన గౌరవం దక్కింది.

Published : 20 Jun 2024 16:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా పా.రంజిత్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘కాలా’ (Kalaa Movie). 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, పా.రంజిత్‌ టేకింగ్‌, విజువల్స్‌, అధికారం కోసం ఉన్నత, అణగారిన వర్గాల మధ్య జరిగే పోరును రియలిస్టిక్‌గా చూపించారు. ఇప్పుడు ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ (బీఎఫ్‌ఐ) సైట్‌ అండ్‌ సౌండ్‌ మ్యాగజైన్‌లో 21వ శతాబ్దపు అత్యుద్భుతమైన 25 చిత్రాల జాబితాలో ‘కాలా’కు స్థానం లభించింది. ఈ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ చిత్రంగానూ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అనేక సినిమాలను విశ్లేషించి, క్రోడీకరించి విడుదల చేసిన జాబితాలో ఓల్డ్‌ బాయ్‌, గెట్‌ అవుట్, ఆర్టిఫిషియల్‌ ఇంటర్‌వెన్షన్‌ వంటి చిత్రాలు ఉన్నాయి.  ‘‘21వ శతాబ్దం నాలుగు భాగాల్లో ఒక భాగం ముగింపునకు వచ్చిన నేపథ్యంలో మా దగ్గర ఉన్న 25మంది అత్యుత్తమ సినీ విమర్శకుల విశ్లేషణ ఆధారంగా ఈ అరుదైన మైలురాయిని ఆవిష్కరిస్తున్నాం. ఈ 2000-2024 మధ్య వచ్చిన సినిమాల్లో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కలిగిన 25 సినిమాలను ఎంపిక చేశాం. ప్రతి సంవత్సరం ఒక్కో సినిమాను తీసుకున్నాం. ఒక్కొక్క విమర్శకుడు ఒక్కో సినిమాను ప్రతిపాదించారు’’ అని బీఎఫ్‌ఐ తెలిపింది.

ఇదీ ‘కాలా’ కథ: కరికాలుడు అలియాస్ కాలా (రజనీకాంత్) ముంబయి మురికవాడ ధారవి ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడే నేత. స్వచ్ఛ మహారాష్ట్ర స్కీం కింద ధారవిలో నివసించే ప్రజలను ఖాళీ చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నిస్తుంటాడు హరిదాదా (నానా పాటేకర్). అందుకోసం విష్ణు సేఠ్‌ (సంపత్ రాజ్)ను ఉపయోగించుకొంటాడు. హరిదాదా వేసే ఎత్తుకు కాలాపై ఎత్తులు వేసి తనవాళ్ల నేలను రక్షిస్తుంటాడు. ఈ క్రమంలో ధారవిలో పుట్టి పెరిగిన కాలా మాజీ ప్రేయసి జరీనా (హ్యుమా ఖురేషి) ఈ వ్యవహారంలోకి ప్రవేశిస్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి. ధారవి నేల కోసం పోరాడే కాలాను హరిదాదా గ్యాంగ్ ఎలాంటి సమస్యలకు గురిచేసింది? నేల కోసం తన భార్య స్వర్ణ (ఈశ్వరీరావు)ను ఎలా కోల్పోయాడు? కాలాకు జరీనా ఎలా దూరమైంది? హరిదాదా భూకాంక్షను ఎలా ఎదుర్కొన్నాడు? తాము జీవించే నేలను దక్కించుకోవడానికి ధారవి ప్రజల్లో కాలా ఎలా స్ఫూర్తిని నిలిపాడు? అన్నది చిత్ర కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని