Rajinikanth: రాజకీయం గురించి మాట్లాడాలనుంది.. కానీ అది వద్దంటోంది: రజనీకాంత్‌

నందమూరి తారక రామారావు.. శతజయంతి ఉత్సవాల (NTR Centenary Celebrations) శంఖారావాన్ని విజయవాడ వేదికగా నిర్వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Updated : 28 Apr 2023 21:18 IST

విజయవాడ: ‘ఇంత పెద్ద సభను చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనుందని, కానీ, అనుభవం వద్దని ఆపుతోంది’ అని ప్రముఖ హీరో రజనీకాంత్‌ (Rajinikanth) అన్నారు. విజయవాడ వేదికగా నిర్వహించిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల శంఖారావానికి (NTR Centenary Celebrations) ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.

వేడుకనుద్దేశించి రజనీకాంత్‌ ప్రసంగిస్తూ.. ‘‘ఇలాంటి పెద్ద వేడుకల్లో నేను తెలుగు మాట్లాడి చాలా రోజులైంది. ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో జ్ఞానం చెబుతుంది. ఎంత సేపు మాట్లాడాలనేది సభ చెబుతుంది. ఏం మాట్లాడకూడదో అనుభవం చెబుతుంది. మీ అందరినీ ఇలా చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనిపిస్తుంది. కానీ, ‘వద్దురా రజనీ’ అని అనుభవం ఆపుతోంది’’ అని అన్నారు.

చంద్రబాబు విజన్‌ ప్రపంచానికి తెలుసు..

‘‘నా ఆప్తమిత్రుడు, రాజకీయ నేత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొంచెమైనా పాలిటిక్స్‌ గురించి మాట్లాడకపోతే సరికాదు. ఆయన నా మిత్రుడు. నాకు ఆయనతో 30 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. నా మిత్రుడు మోహన్‌బాబు చంద్రబాబు నాయుడు గారిని పరిచయం చేశారు. ‘త్వరలోనే పెద్ద నాయకుడు అవుతాడు’ అని ఆ సమయంలోనే చంద్రబాబు గురించి నాతో చెప్పారు. పలు సందర్భాల్లో చంద్రబాబుని కలిసి ఆయనతో మాట్లాడితే నా జ్ఞానం పెరిగింది. 24 గంటలూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఉంటారు. ఇండియా పాలిటిక్స్‌ మాత్రమే కాదు వరల్డ్‌ పాలిటిక్స్‌ కూడా ఆయనకు తెలుసు. చంద్రబాబు ఘనత పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు తెలుసు. ఐటీ గురించి ఎవరికీ తెలియని రోజుల్లో భవిష్యత్తు దానిదే అని చెప్పారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చారు. బిల్‌గేట్స్‌లాంటి వాళ్లెందరో ఆయన్ను ప్రశంసించారు. లక్షలాది మంది ఇప్పుడు ఐటీ రంగంలో పనిచేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు గారే. 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను చూసినప్పుడు ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అనేది నాకు అర్థంకాలేదు. దూరదృష్టితో ఆయన వేసిన ప్లాన్‌ ‘2047’ అనుకున్నట్టు అమలైతే ఆంధ్రప్రదేశ్‌ స్థానం ఎక్కడికో వెళ్లిపోతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌ నాలో స్ఫూర్తి నింపారు!

ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను తొలిసారిగా చూసిన సినిమా ఎన్టీఆర్‌ నటించిన ‘పాతాళభైరవి’. ఆ చిత్రం నా మదిలో నిలిచిపోయింది. నా తొలి సినిమాలోనూ ‘భైరవి ఇల్లు ఇదేనా?’ అనే సంభాషణ ఉంటుంది. సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా పనిచేస్తున్న రోజుల్లో ఓ దర్శకుడు నన్ను కలిసి హీరోగా సినిమా చేస్తానని చెప్పారు. కానీ, కథానాయకుడిగా నటించడం అప్పుడు ఇష్టం లేదు. ‘ఒక్కసారి కథ వినండి’ అంటూ సినిమా పేరు ‘భైరవి’ అని చెప్పారు. ఆ పేరు వినగానే చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పాను. ‘లవకుశ’ సినిమా విజయోత్సవ వేడుకకు ఎన్టీఆర్‌ చెన్నైకు రాగా దూరం నుంచి ఆయన్ను చూశా. అప్పుడు నా వయసు 13 ఏళ్లు. ‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాలోని ఎన్టీఆర్‌ నటించిన దుర్యోదన పాత్రకు మంత్రముగ్దుణ్ని అయ్యా. నేను బస్‌ కండక్టర్‌గా ఉన్న సమయంలో నిర్వహించిన ఓ వేడుకలో ఎన్టీఆర్‌ను ఊహించుకుంటూ దుర్యోదన పాత్రకు అభినయించా. అక్కడ దక్కిన ప్రశంసల వల్లే నేను నటన వైపు వచ్చా’’ అని తెలిపారు. 

బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ‘‘కంటి చూపుతోనే ఆయన చంపేస్తాడు. ఆయన తన్నితే కారు 30 అడుగుల దూరంలో పడుతుంది. అలా.. రజనీకాంత్‌, షారుక్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌ ఎవరు చేసినా ప్రేక్షకులు అంగీకరించారు. ఎందుకంటే నందమూరి తారకరామారావుని బాలకృష్ణలో చూసుకుంటున్నారు. ఆయనకు కోపం బాగా ఎక్కువ. కానీ, మనసు వెన్నలాంటిది. సినీ, రాజకీయ జీవితంలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని ఆకాంక్షించారు. 

అసలైన హీరో ఎన్టీఆర్‌: నందమూరి బాలకృష్ణ

‘‘నాన్నగారు నడయాడిన ప్రాంతంలో ఈ వేడుక నిర్వహించడం ఆనందంగా ఉంది. ఆయన కొడుకుగా పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆయన నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లోని ఆయన నటనకు కళామ్మతల్లి సంతోషించింది. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు చేసి నటధీశాలి నందమూరి తారకరామారావుగారు. సినిమాల్లోనే కాదు రాజకీయ నాయకుడిగాlp తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచారు. తెలుగు జాతి గర్వించే అసలైన హీరో ఆయన’’

‘‘తెలుగు దేశం పార్టీ స్థాపించి రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. దేశంలోనే తొలిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. రూ. 2కే కిలో బియ్యం, పలు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ జనతా వస్త్రాలు పంపిణీ చేశారు. వృద్ధులకు పెన్షన్‌, పక్కా ఇళ్లు, రూ. 50కే రైతులకు విద్యుత్తు సరఫరా, భూమి శిస్తు రద్దు చేయడం, ప్రజల వద్దకే పాలనలో భాగంగా తాలుకాలను మండలాలుగా మార్చడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల అభివృద్ధి తోడ్పడ్డారు. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు. తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. విద్యార్థుల కోసం సంక్షేమ వసతి గృహాలు నిర్మించారు. రైతు రుణమాఫీ చేశారు. ఇలాంటివెన్నో కార్యక్రమాలు చేపట్టిన ఆయన్ను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఈ పండుగను చేసుకుంటున్నారు’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మేలో మరో కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని